శంకర్ సర్ - గేమ్ ఛేంజర్ - కథ - కథనం - విశ్లేషణ
శంకర్ గారు భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరు - అది ఒకప్పుడు. ఇప్పుడు మనం రాజమౌళి గారి గురుంచి ఎలా మాట్లాడుకుంటున్నామో ఒకప్పుడు అంతకు మించి ఈయన గురుంచి మాట్లాడుకునేవాళ్ళం. మనకి తెలిసిన శంకర్ గారు వేరు, కమర్షియల్ సినిమాలలో మెసేజ్ ని జోడించి ప్రేక్షకులని మెప్పించటం లో శంకర్ ఒక జీనియస్, కానీ అదంతా ఒకప్పుడు - సుజాత లాంటి రైటర్ తన పక్కన ఉన్నపుడు. ఆ తర్వాత కాలం లో ఏమైంది? టెక్నికల్ గా ఎప్పుడూ అందరికంటే పది అడుగులు ముందు నడిచే డైరెక్టర్ గారు ఆ తర్వాత టెక్నాలజీ ని మాత్రమే నమ్ముకొని కొన్ని సినిమాలు చేశారు. ఇప్పటికి అయన ఊహాశక్తి అమోఘం అనే చెప్పొచ్చు కానీ కథ - కథనం విషయం లో ఒకప్పటి మెరుపులు ఏమైపోయాయి? వరసపెట్టి సినిమాలు తీసేస్తూ ఉంటె ఏమో, ఎప్పుడో 2018 లో 2.0 తర్వాత గత సంవత్సరం భారతీయుడు 2 అని ఒక షాక్ ఇచ్చి, దాని నుంచి తేరుకోక ముందే "గేమ్ ఛేంజర్" తో భయంకరమైన షాక్ ఇచ్చారు. బహుశా ఆయన కెరీర్ కే ఇదొక గేమ్ ఛేంజర్ ఏమో....
భారతీయుడు 2 - కమల్ హాసన్ గారికి విక్రమ్ హిట్ అవ్వటం మన చావుకి వచ్చింది అన్నట్టు మూసుకుపోయింది అనుకున్న ప్రాజెక్ట్ మళ్ళీ తెరుచుకుంది. లంచం అనేది ఇప్పటికీ లైవ్ లో ఉన్న టాపిక్ ఏమో కానీ, పార్ట్ 1 వచ్చినప్పుడు ఉన్న కాలమాన పరిస్థితులు ఇప్పుడు లేవు, జనాలు కూడా ఇవ్వటానికి పని చేయించుకోడానికి అలవాటు పడి ఉన్నారు. దానికి తగ్గట్టు గా స్క్రీన్ ప్లే లో కూడా మార్పులు చేర్పులు చేసుకోలేక పోయారు. అన్నిటికి మించి ఫస్ట్ పార్ట్ లో ఉన్న డ్రామా (కన్న కొడుకు ని కూడా శిక్షించటం) లాంటి గ్రిప్పింగ్ పాయింట్/ఎమోషన్ లేక పోవటం, వెరసి ఒక డిసాస్టర్ బొమ్మ అయింది.
గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే, ఇది కార్తీక్ సుబ్బురాజ్ అందించిన కథ కావటం, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అవ్వటం, RRR లాంటి సినిమా తర్వాత చరణ్ సోలో గా చేస్తున్న సినిమా అవ్వటం ఎవరి అంచనాలు వాళ్ళకి ఉన్నాయి. పాటలు సో సో గా ఉన్నపుడు శంకర్ గారు పాటలు అంటే స్క్రీన్ మీదనే చూడాలి అని సర్దిచెప్పుకున్నాం, ట్రైలర్ వచ్చినప్పుడు శంకర్ గారు బ్యాక్ అని కొంచెం నమ్మకం కలిగించింది కానీ థియేటర్ లో కూర్చున్న పావు గంట కే ఆశలన్నీ ఆవిరై పోయాయి. ఇది శంకర్ గారు తీసిన సినిమానేనా అనిపించటం - సహనానికి పరీక్ష పెట్టడం రెండు ఒకేసారి జరిగాయి. ఎప్పుడెప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమా తీస్తారా అని ఎదురు చూసిన అయన అభిమానులకి - ఆలా ఎదురు చూసిన పాపానికి - గరుడ పురాణం లోని శిక్షలన్నీ కూర్చోబెట్టి అమలు పరిచారు శంకర్ గారు. ఆ అనుభవాలు మనం ఒకరితో ఒకరు పంచుకోటానికే ఈ కథ - కథనం - విశ్లేషణ
"సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం. ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు.
కథ : ఉపేంద్ర గారి UI సినిమా కథా వస్తువు అయినా విశ్లేషించుకోవచ్చు కానీ ఈ సినిమా కథ ఇది అని రాసుకోవటం ఒక బ్రెయిన్ టీజర్. ఒక లైన్ లో చెప్పుకోవాలి అంటే "ఒక నిజాయితీగల ఐఏఎస్ అధికారి అవినీతితో నిండిన రాజకీయ వ్యవస్థపై న్యాయసమ్మతమైన మరియు పారదర్శకమైన ఎన్నికల ద్వారా పోరాడడం" అరె ఇంత సింపులుగానే ఉంది కదా, దానికి తోడు మంచి కమర్షియల్ లైన్ కూడా, మరి పెద్దాయన్ని అన్ని మాటలు అంటారు ఎందుకు అంటే, ఈ ఒక్క లైన్ ని పూర్తి నిడివిగల సినిమాగా మార్చినప్పుడు జరిగిన పరిణామాలు ఏమైతే ఉన్నాయో, వాటి గురుంచి మాట్లాడుకోవాలి.
మన సినిమా కథని చెప్పాలి అనుకున్న దృష్టికోణం ని బట్టి ప్రేక్షకుల అనుభూతి ఉంటుంది, ఒక సినిమా హీరో యొక్క దృష్టికోణంలో చెప్పబడితే, ప్రేక్షకులు హీరో యొక్క విజయాలు మరియు సవాళ్లను అనుభవిస్తారు. కానీ అదే కథను విలన్ యొక్క దృష్టికోణంలో చెప్పినట్లయితే, ప్రేక్షకులు విలన్ యొక్క కారణాలు మరియు భావోద్వేగాలను అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కథని ఎవరి దృష్టికోణంలో చెప్పాలి అనే విషయం లోనే తడబడినట్టు గా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మన కథని ఫ్లాష్ బ్యాక్ రూపం లో చెప్పాలి అనుకున్నపుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఫ్లాష్ బ్యాక్ ఎప్పటికి మెయిన్ కథ అవ్వదు, మనం సినిమా ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నామో, ఎటు తీసుకు వెళ్తున్నామో, అదే రన్నింగ్ స్టోరీ, ఆ స్టోరీ కి ఒక సపోర్ట్ మాత్రమే ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ని ఫ్లాష్ బ్యాక్ లో నే అవ్వగొట్టేసి మెయిన్ కథ లోకి వచ్చేయాలి, లేదంటే ట్విస్ట్ కి కావాల్సిన లీడ్ వదిలేసి దానిని రన్నింగ్ స్టోరీ లో రెవీల్ చేసి అలరించవచ్చు.
అసలు ఈ సినిమాకి ఫ్లాష్ బ్యాక్ లేక పోతే ఏమవుతుంది ? ఏమీ అవ్వదు. ఫ్లాష్ బ్యాక్ ఉన్నపుడు ఈ కథని ఇలా చెప్పొచ్చా ? చెప్పకూడదు. ఎందుకు ?
కథనం:
ప్రారంభం : ఫ్లాష్ బ్యాక్ : అనగనగా ఒక అప్పన్న,సామజిక కార్యకర్త, మైనింగ్ మాఫియా / స్టీల్ ప్లాంట్ కి ఎదురుగా పోరాటం చేసే నాయకుడు. అయన పోరాటం ఫలించి స్టీల్ ప్లాంట్ ఏ మూసేసుకుంటారు. కలుషితం గురుంచి పోరాటం చెయ్యటం వేరు, ఖనిజాలని తవ్వకూడదు అని పోరాటం చెయ్యటం దాని వలన రాబోయే 20 తరాలు బాగుపడతాయి అని భావించటం అనేది పక్కన పెడితే రీజినల్ ఫిలిం హిట్ అయిన తర్వాత పాన్ ఇండియా సినిమాకి వెళ్లినట్టు, తన పోరాటం హిట్ అవ్వడం తో - ఇష్టం లేక పోయినా - చుట్టూ ఉన్న వాళ్ళ ప్రోద్భలం తో అభ్యుదయం పార్టీ పెడతాడు. తనకి నత్తి ఉండటం వలన తాను చెప్పాలి అనుకున్నది సరిగ్గా చెప్పలేక పోతే అది జనాలకి సరిగ్గా చేరక పోతే నష్టం కనుక ఉన్న అందరిలో టాలెంటెడ్ అయిన శ్రీకాంత్ ని ముందు పెడతాడు. తన భార్య అంజలి కూడా చదువురాని జనాలకి హెల్ప్ చేస్తూ వాళ్ళ తరపున పిటిషన్లు రాసిపెడుతూ ఉంటుంది. వాళ్ళ కొడుకు రామ్ నందన్. అప్పన్న రాసిచ్చిన స్పీచ్ లు చదివే శ్రీకాంత్ వాటికీ వస్తున్న రెస్పాన్స్ కి తనకి తానుగా ఆపాదించుకొని, గెలుపు మీద మోజు తో అడ్డ దారులు తొక్కి, అడ్డు పడుతున్న అప్పన్న ని చంపేసి సీఎం అవుతాడు. రామారావు గారికి తప్ప ఎవరికీ సాధ్యపడని ఘన విజయం సొంతం చేసుకుంటుంది అభ్యుదయం పార్టీ. ఎక్కడో ఒక గ్రామం లో పోరాటం చేసుకునే సామజిక కార్యకర్త, పార్టీ పెట్టడం, జీరో బడ్జెట్ పాలిటిక్స్ నడపటం, పవర్ లోకి రావటం మాములు విషయం కాదు. ఆంధ్రాలో కాదు కదా కనీసం తమిళనాడు లో కూడా ఇలా జరిగిన దాఖలాలు ఎక్కడ కనపడవు వినపడవు. శంకర్ సర్ కి ఎలా వచ్చిందో మరి ఈ ఐడియా. తన భర్త చావుని కళ్లారా చూసిన అంజలి షాక్ లో ఉండిపోయి పిల్లాడిని మిస్ చేసుకుంటుంది. అప్పటి వరకు అంటే అమ్మ నోరు మూసింది కాబట్టి అరవలేదు అనుకుందాం, అమ్మ చెయ్యి వదిలేసి వెళ్లిపోతున్నా కూడా ఆ పిల్లాడు ఎందకు అరవలేదు లేక అమ్మ వెనక ఎందుకు పరిగెత్తలేదు అనేది మనకి తెలియదు, అసలు ఈ స్టోరీ లో లాస్ట్ లో జరిగిన డ్రామా అంత సముద్రఖని కి ఎలా తెలిసిందో కూడా మనకి తెలియదు, ఇదంతా మన హీరో కి సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది.
అసలు ఇప్పుడు మనం చూసిన సినిమాలో ఈ ఫ్లాష్ బ్యాక్ లేక పోతే వచ్చే నష్టం ఏమైనా ఉందా అంటే అస్సలు లేదు, అది ఉండటం వలెనే చాలా నష్టం జరిగింది అని చెప్పుకోవాలి ఎందుకు అంటే - హీరో ఆశయ సాధన కి కావాల్సిన గోల్ ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఏర్పడి ఉండాలి, ఇక్కడ హీరో కి గోల్ ఏ లేక పోగా అసలు అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉందని సగం సినిమా అయ్యాక కానీ తెలియదు, తెలిసిన తర్వాత కూడా మిగిలిన కథనం ఆ దిశగా సాగదు సరికదా తన తల్లి చావుకి కూడా తనే కారణం అవుతాడు. ఇంకో పక్కన తండ్రిని చంపిన వాడికి తల కొరివి పెట్టిన వాడు అవుతాడు. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ ఉండటం వలన చరణ్ బాబు ఆ తర్వాత నరేష్ గారి ఫ్యామిలీ కి ఎలా దొరికాడు, అంజలి గారు హీరోయిన్ దగ్గరకి ఎలా వచ్చారు, ఇన్ని రోజులు శ్రీకాంత్ గారు అసలు వీళ్లొకరు ఉన్నారు అని ఎందుకు గుర్తించలేదు, వాళ్ళ కోసం ఎందుకు వెతకలేదు, కనీసం పోలికలు కలిసిన రామ్ చరణ్ ని కూడా ఎందుకు పోల్చుకోలేక పోయాడు, మరి అంత ఫ్లాష్ బ్యాక్ వలన ఇప్పుడు ఉన్న థ్రెట్ ఏంటి ? ఏ పాత్రకి అయినా వచ్చిన ముప్పు ఏంటి? ఆ ఫ్లాష్ బ్యాక్ తెలియటం వలన మారిన గోల్ ఏంటి గమనం ఏంటి? అసలు అది ఉంటే ఏంటి లేక పోతే ఏంటి ?
థంబ్ రూల్ : హీరో కి ఆశయం ఫ్లాష్ బ్యాక్ లో నే సెట్ అయ్యి ఉండాలి లేదా ఫ్లాష్ బ్యాక్ తర్వాతే సెట్ అయ్యే పని అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా త్వరగా ఫస్ట్ ప్లాట్ టైం కే వచ్చేసి ఉండాలి
ప్రస్తుతం: తన గతం తనని వెంటాడుతూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్న శ్రీకాంత్ చావు బ్రతుకుల మధ్య ఉంటె తన తరువాత ఎవరు CM అవ్వాలి అని తన కొడుకులు (సూర్య అండ్ జయరాం) కొట్టుకుంటూ ఉంటారు. చావు తప్పించుకొని బయటపడ్డ శ్రీకాంత్ తాను చేసిన తప్పులు సరిచేయాలి అనుకుంటాడు. ఇప్పటి వరకు చేసిన తప్పులు అన్నీ మానెయ్యాలి, జనాలకి మంచి చెయ్యాలి అని చెప్తాడు. ఈ మార్పు కి కారణం ఏంటి ? శంకర్ సర్ ఏ చెప్పాలి. ఈయన నిర్ణయం కొడుకులకి నచ్చదు. హీరో ఇంట్రడక్షన్ , జనరల్ టికెట్ తో AC లో ప్రయాణిస్తున్న IPS నుంచి ఐఏఎస్ అయిన రామ్ చరణ్ లుంగీ బనియన్ లో వచ్చి ఒక పెద్ద యాక్షన్ సీన్ వెంటనే నేను కూడా నీలాంటోడిని అని ఒక సాంగ్. ఈ రెండిటికి పెట్టిన బడ్జెట్ తో ఒక సినిమా తీసేయొచ్చు అది వేరే విషయం కానీ సరే మన శంకర్ గారు కమర్షియల్ ఫార్మటు లో ఎల్తున్నట్టు ఉన్నారు లే అని కుర్చీ లో సర్దుకుంటాం.
పెరిగి పెద్దవాడైన మన హీరో కి కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అనే కంటే తొందరపాటు తనం ఎక్కువ, నువ్వు ఇలా ఉంటె తెలుగు సినిమా హీరో వి అవ్వవు, నీ ఆవేశం ని సరైన దారిన పెట్టాలి అంటే నువ్వు ఐఏఎస్ అవ్వాలి అప్పుడే నీతో లవ్వు అని డాక్టర్ హీరోయిన్ చెప్తుంది. కష్టపడి చదివి కొంచెం లో మిస్ అయ్యి IPS అవుతాడు. కోపమొచ్చి హీరో మన హీరోయిన్ ని వదిలేస్తుంది అండ్ అందుకని ఇంక నేను పెళ్లి చేసుకొని అని మొండి పట్టు పట్టుకొని కూర్చుంటాడు హీరో. ఇదొక ఫ్లాష్ బ్యాక్. ఇది ఎందుకు అంటే ? హీరో ఐఏఎస్ అవ్వటం అనే ఆశయ సాధన - గోల్ ఏర్పడటానికి. అంటే మధ్యలో ఒక సాంగ్ కూడా ఉంది లెండి. మళ్ళీ హీరోయిన్ ని కలిశాడా? ఎప్పుడూ కలిసాడు.. పాటొచ్చే ముందు ప్రతి సరి కలుస్తూనే ఉంటాడు. కలవక పోతే మిగతా సాంగ్స్ కి డాన్స్ ఎవరు చేస్తారు, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం లెండి. IAS అయ్యి ఎం చేస్తాడు అనే విషయం కంటే అయితేనే హీరోయిన్ తో ప్రేమ పెళ్లి అనే చిన్న కారణానికి ఫ్లాష్ బ్యాక్. పోనీ హీరోయిన్ కోసం అయిన వాడు ఇప్పుడు ఎం చేసాడు?
ప్రస్తుతం : ఛార్జ్ తీసుకున్న వెంటనే ఒకే ఒక్కడు సినిమాలో ఒక రోజే ఉన్నట్టు వచ్చిన రోజే మొత్తం ఊరిలో ఉన్న ట్రబుల్ మేకర్స్ అందరితో పెట్టుకుంటాడు. ఒక పావు గంట పాటు మనకి ఆ పాత సినిమా చూసిన ఫీలింగ్ ఏ కలుగుతూ ఉంటుంది. ఆల్రెడీ చూసెయ్యటం వలన "ప్రెడిక్టబుల్" అనే ఫీలింగ్ తాలూకు స్పెల్లింగ్ మన మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. కమర్షియల్ గా స్టార్ట్ చేసినా అయన ఇంక ఆయన పాత ఐడియాస్ చుట్టూనే తిరుగుతున్నారు అని తెలుసుకోటానికి పెద్ద సమయం పట్టదు మనకి. మెయిన్ విలన్ అయిన సూర్య తో చరణ్ కలిసే సీన్ వరకు అంటే దాదాపు గంట వరకు పాట, ఫైట్, ఫ్లాష్ బ్యాక్ లో పాటలు, ఫైట్ లు, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో తెలిసిన విలన్ తోనే ఫైట్ లు అని టైం - బడ్జెట్ శంకరార్పణం అయ్యాక అసలైన కథ మొదలవబోతుంది అనే ఆశ మొదటి సారి మనల్ని పలకరిస్తుంది. మంత్రిగా అహంకారం హర్ట్ అయిన సూర్య - సిన్సియర్ IAS ఆఫీసర్ చరణ్ మధ్య సీన్. అప్పటి వరకు ఉన్న సినిమాలో విజిల్ వర్త్ ఉన్న డైలాగ్స్ పడిన ఏకైక సీన్ అంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఐఏఎస్ ఆఫీసర్ గురుంచి చరణ్ చెప్పిన మాటలు తూటాల్లా పేలాయి. నువ్వు జస్ట్ పేస్ మాత్రమే, నీ వెనక ఉండి నిన్ను నడిపించే ఒక నెంబర్ 1 ఐఏఎస్. నువ్వు 5 ఇయర్స్ మాత్రమే మినిస్టర్ నేను చనిపోయే వరకు (రిటైర్మెంట్ వరకు అని లెండి) ఐఏఎస్.
గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని డాక్టర్ ప్రియురాలిని కలవటానికి వెళ్లిన చరణ్ అంజలి ని చూస్తాడు. డాక్టర్ అక్కడ ఎం చేస్తుంది అంటే ? రామ్ ఐఏఎస్ అవ్వలేదు అని పెళ్లి చేసుకోవటం మానేసి ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుకుంటూ ఉంటుంది. ఆవిడ ఎవరో ఫ్లాష్ బ్యాక్ చూడని మనకి కూడా తెలుస్తుంది కానీ తనకి తెలియదు కదా పాపం. ఆవిడకి అయినా ఈడెవడు మా అయన పోలికలతో ఉన్నాడు అని ఆలోచించనివ్వకుండా పిచ్చి దానిలా చూపించారు. కానీ ఆవిడ శ్రీకాంత్ ని బాగానే పోల్చు కుంటుంది. ఇదంతా శంకర్ మార్క్ ఏ అని మనల్ని మనం గిల్లుకొని CM సభ లో కూర్చుంటాం. అప్పటి వరకు పోనీ శ్రీకాంత్ కి కలెక్టర్ చరణ్ ఎవరో తెలియదు అనుకున్న సభ లో పక్కనే అప్పన్న పోలికలతో ఉన్న చరణ్ ని చూసి కూడా గుర్తు పట్టలేడు, వాళ్లిద్దరూ కలిసి వస్తుంటే వాళ్ళని చూసి తల్లి కొడుకులు అని అక్కడే షాక్ తో పోతాడు అనుకుంటాం కానీ హీరోయిన్ వచ్చి అంజలి ని మెంటల్ కాండిడేట్ అని సభ మీద ఉన్న వాళ్లందరికీ పరిచయం చేసాక, ఆవిడ ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చాక, శ్రీకాంత్ కి హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ సీన్ చూసాక ఇంక ఈ చెరుకు పిప్పి లో రసం ఎక్కడా మిగలలేదు అని అర్ధం చేసుకోక పోతే ముందు ముందు అంతకు అంతా అనుభవించాల్సి వస్తుంది.
సమస్యాత్మకం : చరణ్ సస్పెండ్ అవుతాడు. గేమ్ ఛేంజర్ షూటింగ్ డిలే అయితే ఇంట్లో పాపతో ఆడుకునట్టు, ఎలాగూ టైం దొరికింది కదా హీరోయిన్ తో పెళ్లి కి రెడీ అవుతాడు. సీఎం చచ్చిపోతాడు, సూర్య సీఎం అవ్వటానికి అన్నీ రెడీ చేసుకుంటాడు. చరణ్ మీద FIR వేసి అరెస్ట్ చేసి చంపేద్దాం అని ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు ఒక పెరియ ట్విస్ట్. ఎంద మాదిరి ఓరు ట్విస్ట్ నా అంద మాదిరి ట్విస్ట్ తో శ్రీకాంత్ లాస్ట్ కోరిక చరణ్ ని సీఎం చెయ్యటం అని తెలియటం తో ఇంటర్వెల్. ఇప్పటి వరకు అసలు కథ ఎక్కడ మొదలు అయ్యింది ఎలా వెళ్తుంది ఆలోచిస్తే, ఏ ఆవేశం వలన ప్రాబ్లెమ్ వస్తుంది అని ప్రియురాలు కోసం ఐఏఎస్ అయ్యాడో, అదే ఆవేశం తో చేసిన పని వలన సస్పెండ్ అయ్యి, సీఎం చివరి కోరిక వలన CM అవ్వబోతున్నాడు చరణ్. కనీసం ఫస్ట్ హాఫ్ నరేషన్ విన్న తర్వాత అయినా కూడా ఇంతకంటే పాసివ్ హీరో పాత్ర ఇంకోటి ఉండదు అని తెలుసుకోలేక పోవటం ఉంటుందా? అది శంకర్ గారు అయినా, చరణ్ అయినా, దిల్ రాజు గారు అయినా....
అంత పెద్ద తప్పు చేసిన శ్రీకాంత్ కూడా పాపానికి ప్రాయశ్చితం గా హీరో తో తలకొరివి పెట్టుకున్నాడు. పాపం చరణ్. తండ్రి పోయాడు అని తెలియదు, పెంచుకున్న తండ్రి ఉన్నా కూడా సీఎం కి తలకొరివి పెట్టేసాడు, నేను పెట్టను, నాకు సీఎం పోస్ట్ వద్దు, నా ఐఏఎస్ గురుంచి నేను న్యాయపోరాటం చేస్తాను, ఎందుకంటే సీఎం పోస్ట్ ఓన్లీ 5 ఇయర్స్ అదే నేను చనిపోయేవరకు ఐఏఎస్ అనడు. మా నాన్న తీసుకొస్తాను అన్న మార్పు నేను ఇటు సైడ్ నుంచి తీసుకొచ్చి, సిస్టం లో ఉంటూ రాజకీయాలని ప్రక్షాళన చేస్తాను అనడు. నాతో చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ని ప్రెస్ మీట్ పెట్టి స్టేట్ మొత్తం మీరే చెప్పండి మళ్ళీ నేను ఎగ్జాక్ట్ గా ఇలాగె చెప్పలేనేమో, మా అమ్మని తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చెయ్యండి లాంటి డిమాండ్ పెట్టడు. పోనీ ఫ్లాష్ బ్యాక్ అయ్యాక అమ్మ దగ్గరకి వెళ్తే ఆవిడన్న కూడా మీ నాన్న ని చంపేసిన వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టడానికి నేను ఇన్నాళ్లు పోరాటం చెయ్యలేదు, కనీసం నువ్వు అయినా ఆ పని చేసి పెట్టు అని అడగదు. తేరగా వచ్చింది కదా నాన్న CM అయిపో నాకు ఈ లెటర్స్ రాసే బాధ తప్పుతుంది అంటుంది.
సీఎం అయ్యే ఛాన్స్ లేదు అని సూర్య అడ్డుపడతాడు, అప్పుడు తన సస్పెన్షన్ ఎత్తివెయ్యమని సీఎం సీట్ ని బేరం పెడతాడు చరణ్. ఒప్పుకున్నట్టే ఒప్పుకొని తూర్పుకి తిరగమంటాడు సూర్య. ఈ సీన్ మొత్తం సూర్య పెర్ఫార్మన్స్ తో చరణ్ ని డామినెటే చేసి పడేస్తుంటే పాపం ఫాన్స్ ఎలా తట్టుకున్నారో. ఒక పక్క సూర్య సీఎం ప్రమాణ స్వీకారం, ఇంకో పక్క దేశం మొత్తం మీద ఐఏఎస్ ఆఫీసర్స్ అందరు చరణ్ కోసం లెటర్స్ పంపించేస్తారు. సంవత్సరానికి 150 నుంచి 200 మంది పోస్టింగ్ తీసుకుంటారు, మనోడు పోస్టింగ్ తీసుకొని 1 ఇయర్ కూడా అవ్వదు, 2000 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ లెటర్స్ రాసేస్తారు ఈడీకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వండి అని. ఇట్స్ ఏ శంకర్ సర్ మార్క్.
హీరో సమస్యలు అన్నీ అయిపోయాయి కాబట్టి మనం ఇంక క్లైమాక్స్ కి వెళ్లిపోవచ్చు.
ముగింపు : మన 1 ఇయర్ ఎక్సపీరియెన్స్డ్ చరణ్ ని స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ కింద నియమించి, ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది అని సీఎం ఆఫీస్ కి మెసేజ్ వస్తుంది. మనం ఏమో ఇంకా ముందు నుంచి న్యూస్ లు వస్తాయి, వాళ్ళేదో ప్రెస్ మీట్ పెడతారు, డేట్స్ చెప్తారు, ఫేజ్ వైస్ ఎలక్షన్స్ ఉంటాయి అని లాస్ట్ ఇయర్ ఏ చూసాం కానీ, అయినా అంత ఇన్ఫర్మేషన్ ఉంటె ఇంత ఖర్చు పెట్టి ప్రమాణ స్వీకారం ఎందుకు చేసుకుంటారు లెండి. లా అండ్ ఆర్డర్ పక్కన పెట్టండి, ఒక CM సభ ని సరిగ్గా నిర్వహించలేని ఐఏఎస్ ఆఫీసర్, మినిస్టర్ మీద చేయి చేసుకున్న కేసు లో FIR రిజిస్టర్ అయినా ఆఫీసర్, అదే మినిస్టర్ సీఎం అయిన స్టేట్ కి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ హెలికాప్టర్ - సాష్టాంగ ప్రమాణం పెట్టేసి థియేటర్ లో నుంచి వెళ్ళిపోయినోడు లక్కీ ఫెలో.
ఇంకొక పక్క ఎలక్షన్ లో అపోజిషన్ ఏ లేనట్టు సముద్రఖని గారు ఒక పార్టీ పెడతారు, అప్పన్న ఆశయాలతో. మనం ఎలక్షన్ చూసింది లాస్ట్ ఇయర్ ఏ కాబట్టి ఫ్రెష్ మెమోరీస్ ఏ కాబట్టి తెరపై జరుగుతున్నా విధ్వంసాన్ని చూడటం భరించటం చాలా కష్టమైన విధానం గా మనకి అనిపించటం మన తప్పు కాదు, శంకర్ సర్ డిక్షనరీ లోని సినిమాటిక్ లిబర్టీ అని సరిపెట్టుకోటమే. ఎలక్షన్ ప్రాసెస్ మొదలు అయిన తర్వాత ఒక గంట సేపు ఉంటుంది ఏమో సినిమా, అక్కడిక్కడే తిరుగుతూ. మధ్యలో ఒక పాట. తల్లి పాత్ర తో ఒక సెంటిమెంట్. కౌటింగ్ ప్రాసెస్ అక్కడ సునీల్ కి హీరోయిన్ కి ఏంటి పని అని అడగకండి. ఒక ఎలక్షన్ ఆఫీసర్ పవర్స్ ఏంటి అని అడగకండి, కౌటింగ్ రూమ్ లో కి వస్తే ఎం చెయ్యొచ్చు అని అడగకండి. ఇంత సేపు ఈ సినిమా కామ్ గా చూసిన మనకి అవి అడిగే అర్హత లేదు. అసలు శ్రీకాంత్ ని చంపింది సూర్య నే అని ఎక్కడ కంక్లూడ్ చేసినట్టుగా కూడా చూపించలేదు, ఆ విషయం మన హీరో కనిపెట్టినట్టు చూపించినా ఎంతో కొంత అలరించే ఎపిసోడ్ ఒకటి పడి ఉండొచ్చు
కొసమెరుపు : ఇది మాత్రం హైలైట్. ఎలక్షన్స్ కండక్ట్ చేసిన ఆఫీసర్ రాజీనామా చేసి గెలిచిన పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రమాణం చెయ్యటం. "స్విగ్గి ఏ సుజుకి లో వస్తుంటే సీఎం సైకిల్ మీద వస్తున్నాడయ్యా"
చివరిగా: నిజంగానే ఇంత రాయాల్సిన అవసరం లేదు, ఇంకొంచెం ఎక్కువ రాసి తక్కువ చేసినా తప్పు లేదు, ఎందుకంటే, సినిమా చూస్తూ అనుభవించిన మానసిక వేదన అలాంటిది. ఒకప్పుడు ఎంతో గౌరవించిన దర్శకుడి నుంచి ఇలాంటి స్క్రాప్ చూడాల్సి వస్తుంది అని అనుకోలేదు. నేను ఒక్కడు పోకిరి లాంటి వేగవంతమైన కథనం తో మంచి కమర్షియల్ సినిమా తీశాను అని అయన చెప్పారు, అదేంటి మనం అయన తీసిన సినిమాలు చూసి కదా ఆయన్ని ప్రేమించింది మనకి కావాల్సింది అది కదా అని ఒక సగటు తెలుగు ప్రేక్షకుడు ఎక్కడ ఫీల్ అవుతాడో అని అయన ఇంతకు ముందు చేసిన సినిమాలు కూడా గుర్తు తెచ్చేలా ఇక్కడ సీన్స్ ని నింపేశారు, అంతకు మించి ఇంక అయన ఆలోచించలేరు అనుకోవాలో, అంత కంటే ఎక్కువ ఆశించొద్దు అని మనకి చెప్తున్నారో మనమే డీకోడ్ చేసుకోవాలి.
సినిమాలో సామజిక సందేశం, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అనేవి శంకర్ సర్ కి ఒకప్పుడు కొట్టిన పిండి, గ్రాండ్ నెస్ అనేది తెరపై ఆవిష్కరించటం లో ఆయనకి ఆయనే సాటి, అలాంటిది అయన కూడా పట్టించుకోని విషయం ఏంటి అంటే గ్రాండ్ నెస్ అనేది మన కథలో ఉండాలి, భావోద్వేగాలు పండాలి,
ఈ సినిమా నిజమైన గేమ్ ఛేంజర్ ఎప్పుడు అవుతుంది ? హీరో కానీ తనకి కావాల్సిన వాళ్ళు కానీ రాజకీయాల ద్వారా భారీగా నష్టపడినప్పుడు, దానిని సమూలంగా ప్రక్షాళించి అలాంటి రాజకీయ నాయకులకి భవిష్యత్ లేకుండా చేసేలా సిస్టం లో ఉంటూ మార్పులు తీసుకొచ్చేలా నిర్ణయాలు తీసుకోగలిగితే అప్పుడు ఆ ఆఫీసర్ ఒక గేమ్ ఛేంజర్ అవ్వగలుగుతాడు. దాని ద్వారా తనతో పాటు జనాలకి కూడా మంచి చేసిన వాడు అవుతాడు. అసలు సినిమా మొత్తం మీద ఐఏఎస్ ఆఫీసర్ కి జనాలతో కనెక్ట్ అయ్యేలా కొన్ని సీన్స్ కానీ, వాళ్ళ సమస్యలు తెలుసుకొనేలా కొన్ని సందర్భాలు కానీ, తాను కండక్ట్ చేసేలా కొన్ని వర్కుషాప్స్ కానీ ప్లాన్ చేసుకోకపోవడం ఏంటి? ఒక పవర్ఫుల్ అధికారికి మానవీయ కోణం ఎస్టాబ్లిష్ చెయ్యాల్సిన అవసరం ఉందా లేదా?
మన సినిమాలో ఎం కథ చెప్పాలి అనుకుంటున్నాం?
మన కథ కానీ పాయింట్ కానీ సమకాలీన పరిస్థితుల్ని ప్రతింబించేలా ఉందా?
మన సినిమాని ప్రేక్షకుడు ఎందుకు చూడాలి?
అనే మూడు ప్రశ్నలు స్క్రిప్టింగ్ దశలోనే వేసుకుంటే కొన్ని సినిమాలు పేపర్ మీదనే ఆగిపోతాయి అలా ఆగిపోవటమే బెటర్ కూడా. సినిమా మొత్తం మీద ఒక్క హై ఇచ్చే సీన్ లేకపోవటం ఈ సినిమా ప్రత్యేకత. ప్రొడ్యూసర్, హీరో తో పాటు ప్రేక్షకులని కూడా గ్రాంటెడ్ గా తీసుకుంటే గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలే వస్తాయి. ఏది ఏమైనా కూడా శంకర్ సర్ - గేమ్ ఓవర్.
1 comments:
superb article sir kani meru ranu ranu baga late chesthunnaru, okkosari writing or not kuda teliyatam ledhu. please konchem regular ga rasthu undandi
Post a Comment