పుష్ప - కథ - కథనం - విశ్లేషణ
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్, లాస్ట్ వీకెండ్ ఎక్కడ చూసే ఇదే మేనియా, సినిమాకి ప్రమోషన్స్ మొదలు పెట్టిన నెల రోజుల క్రితం నుంచి, నార్త్ ఇండియా నుంచి సౌత్ లో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ ని కవర్ చేసుకుంటూ, ఆల్రెడీ సీక్వెల్ బుజ్ ఉన్న మూవీ హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు బన్నీ అనటం అతిశయోక్తి కాదు. గువ్వపిట్ట లాగ వానకు తడిసి, బిక్కుమంటు రెక్కలు ముడిసి, వణుకుతు వుంటే నీదే తప్పవదా? పెద్ద గద్దలాగమబ్బులపైన హద్దు దాటి ఎగిరావంటే, వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురిసెయ్‍దా అనే రీతిలోనే టికెట్ రేట్స్ - వైడ్ రిలీజ్ - ముందు రోజు ప్రీమియర్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నారు అండ్ అనుకున్నది సాధించారు అది అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ లో కనిపించాయి. ఇప్పటికి హిందీ వెర్షన్ చేస్తున్న అరాచకం చూస్తూ ఉంటె చూడ ముచ్చటగానే ఉంది. ఇంకా ఇంకా హద్దులు చెరిపేసి మరెంతో సాధిస్తే చూడాలని ఉంది. రేపొచ్చే వీకెండ్ కి ఎలాగూ మళ్ళీ కలెక్షన్స్ డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి, ఈ గ్యాప్ లో కథ - కథనం ని విశ్లేషించుకునే ప్రయత్నమే ఈ ఆర్టికల్ ఉద్దేశం
"సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం. ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు.
ఫస్ట్ పార్ట్ కి విశ్లేషణ రాయలేదు అప్పట్లో, అది జస్ట్ పుష్ప రాజ్ పాత్ర రైజ్ వరకు మాత్రమే అని చెప్పి, ఎమోషన్స్ ని పక్కన పెట్టి, కాంఫ్లిక్ట్స్ ని పక్కన పెట్టి, ఒక కూలోడు నుంచి సిండికేట్ లీడర్ వరకు ఎదిగే ఒడిదుడుకులు లేని ప్రయాణం మాత్రమే చూపించారు, అసలు కాంఫ్లిక్ ( ఆ పార్ట్ వరకు ) షెకావత్ అనుకుంటే, అది ఎంటర్ అయ్యే టైం కి సెకండ్ ఇంటర్వెల్ అని చెప్పి ముగించేశారు. ఓహో కథ మొత్తం సెకండ్ పార్ట్ లో చెప్తారు ఏమో అనుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చింది, ఇందులో ఏమైనా కథ కానీ సంఘర్షణ కానీ ఉండబోతుంది అనుకుంటే, ఒక ఫక్తు కమర్షియల్ టెంప్లేట్ లో లాగేసారు. ఉన్న కథ ఇందులో ఫిట్ అవ్వటం లేదు అని వదిలేసారో, ఎం చేస్తే పాస్ ఐపోతామో అది చేస్తే చాలు అనుకునే ఇలా తీశారో తెలియటం లేదు మరి. ఎలాగూ ఇప్పుడు వ్రాస్తున్నాను కాబట్టి ముందుగా ఫస్ట్ పార్ట్ గురుంచి కొంచెం డిస్కస్ చేసుకుందాం.
పుష్ప - ది రైజ్
జనరల్ గా మనం చూసే గ్యాంగ్ స్టర్ సినిమాల జానర్లో రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ కథ. పరిస్థితుల ప్రభావం వలన, ఒక సాధారణ వ్యక్తి - నేర సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యి, అందర్నీ దాటేసుకొని దానికి అధిపతిగా ఎదగటం అనేది మనం చాలా సినిమాలలో చూసేసిన కథ. ఇక్కడ తేడా ఏంటి అంటే, అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ - రాయలసీమ యాస - హీరో ఆటిట్యూడ్. ఇంటి పేరు అనేది ఎమోషన్ అనుకుంటే - దాని చుట్టూ ఉండాల్సిన డ్రామా ఎలా పండించాలి అంటే? ఇంటి పేరు సాదించుకోవటమే పాత్ర లక్ష్యం అయ్యి ఉండాలి, దాని కోసం ఎం చెయ్యటానికి అయినా సిద్దపడే వాడికి సిండికేట్ లీడర్ గా ఎదగటం ఒక సొల్యూషన్ అయ్యి ఉండాలి, ఆలా పట్టుబట్టి దానిని సాధించే క్రమం లో ఒకానొక సిట్యుయేషన్ లో ఇంటి పేరా ? సిండికేట్ లీడర్ ఆహ్ ? అనే గొప్ప సందిగ్ధం ఏర్పడాలి, అప్పుడు డ్రామా కి స్కోప్ ఉంటుంది. పర్సనల్ గోల్ అండ్ ప్రొఫెషనల్ గోల్. ఇంటిపేరు లేక పోయిన పర్లేదు పుష్ప అనేది ఒక బ్రాండ్ గా ఎదగాలి అనేది ఫస్ట్ పార్ట్ కి ముగింపు అనుకుంటే, ఇంటి పేరు విషయం డైల్యూట్ అయిపోయి అసలు సెకండ్ పార్ట్ కి అదొక కథా వస్తువు అయ్యే అవకాశం కోల్పోతుంది. అది లేనప్పుడు ఎదిగిన హీరో పోరాటం దేని మీద అయ్యి ఉండాలి ? అందరి కంటే ఎక్కువ శక్తిమంతుడు ఎదురు పడాలి, కానీ అప్పటికే సిండికేట్ లీడర్ అయిపోయిన హీరో ఆశయం నెరవేరిందా అంటే అది అసలు ఆశయం కిందనే ఎస్టాబ్లిష్ అవ్వలేదు. హీరో కి ఎం కావాలో హీరో కి తెలియదు, జస్ట్ ఎం అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్లిపోవటమే,.. వాడి జర్నీ లోకి షెకావత్ ఎంటర్ అయ్యాడు, దీని వలన వచ్చిన నష్టం ఏంటి ? అప్పటి వరకు మనం చూసిన విలన్ లు అందరు వాడి ముందు చిన్నవారు గా కనిపించటం, అప్పటి వరకు చూసిన పోరాటాలు సాధించిన విజయాలు గొప్పవిగా కనిపించక పోవటం. అసలు ఫస్ట్ పార్ట్ మొత్తం జస్ట్ ఫస్ట్ ఆక్ట్ లో ముప్పావు వంతు గా మిగిలిపోవటం. ముప్పావు అని ఎందకు అంటున్నాను అంటే, అప్పటికే పాత్ర పరిచయం మాత్రమే జరిగింది, కాన్ఫ్లిక్ట్ కానీ - గోల్ కానీ ఏర్పడలేదు. ఈ విషయం మనకి సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఇంకా క్లియర్ గా అర్ధం అవుతుంది. అది ముందు ముందు చెప్పుకుందాం.
ఫస్ట్ పార్ట్ వరకు పర్సనల్ గోల్ ని అటకెక్కించేసి ప్రొఫెషనల్ గోల్ ని మాత్రమే చూపించారు. ఇంటి పేరు లేక పోవటం వలన కలిగే అవమానం గురుంచి రెండు మూడు బలమైన సీన్స్ ఉన్నా కూడా ఆ సీన్స్ వరకు పాత్ర పుష్పరాజ్ లా ప్రవర్తించడు. కాలుమీద కాలు వేసుకోవద్దు అన్నాడు అని ఓనర్ నే మార్చేసినాడు, నాకు ఇంటి పేరు నువ్వు ఇచ్చేది ఏంట్రా ? నేను మొల్లేటి పుష్పరాజ్ ఎం చేస్తావో చేసుకో అని తొడ కొట్టడు, అవతల ఏమైనా భయంకరమైన విలన్ ఉన్నాడా అంటే అతి సామాన్యుడు క్యారెక్టర్ లాంటి అజయ్ ఏ ఉంటాడు, పోనీ నిజంగా వాడి తండ్రికి పుట్టలేదు అనే డౌట్ ఉంటె పాత్ర లో సంఘర్షణ వేరేలా ఉండేది, ఒక పక్క తిరగబడడు - ఇంకో పక్క పోరాటం చెయ్యడు - తల్లి గౌరవం ని నిలబెడతాను అని ప్రతిజ్ఞ చెయ్యడు. ఇవేవి లేకుండా సిండికేట్ లో ఎదగటమే లక్ష్యంగా ముందుకి వెళ్తాడు అంటే ఆ పవర్ వస్తే ఇవన్నీ అవసరం లేదు అనే ఫీలింగ్ ని కలిగించిన వాళ్ళు అయ్యారు. ఆ విధంగా ఫస్ట్ పార్ట్ వరకు కథలేని - కాన్ఫ్లిక్ట్ లేని ఫస్ట్ ఆక్ట్ మాత్రమే చూసాం. ప్రొఫెషనల్ గోల్ లో ఎంటర్ ఐన ప్లాట్ పాయింట్ "షెకావత్" అండ్ పుష్ప పరస్పర ఛాలెంజ్ తో ముందు ముందు ఉండబోయే సంఘర్షణ కి ఒక భీజం పడినట్టు. ఇక్కడ మళ్ళీ ఇంటి పేరు ప్రస్తావన తీసుకొచ్చారు సరే - అప్పటి వరకు పుష్ప తో పాటు మనం కూడా మర్చిపోయి ఉంటాం దీనిని - ఫైనల్ గా నేనే బ్రాండ్ అని పుష్ప తో చెప్పించి ఆ టాపిక్ ని అక్కడితో క్లోజ్ చేసేసారు అనుకోవచ్చా? అక్కడి వరకు చూసిన మనం, సెకండ్ పార్ట్ లో వీళ్లిద్దరి మధ్య ఎదో భీభత్సంగా ఉంటుంది, జాలి రెడ్డి వస్తాడు, మంగళం శీను రివెంజ్ ఉంటుంది ఇంకేదో ఉండే ఉంటుంది అని అంచనాలతో సెకండ్ పార్ట్ కి ఎంటర్ అవుతాం.
వేర్ ఈజ్ పుష్ప : ఈ మధ్యలో మనకి ఒక షో రీల్ వచ్చింది, దానికి భిన్నమైన రెస్పాన్స్ కూడా వచ్చింది, అది ఫైనల్గా సెకండ్ పార్టీలో లేదుకాబట్టి దాని గురుంచి లాస్ట్ లో మాట్లాడుకుందాం.
పుష్ప - ది రూల్
ఫస్ట్ పార్ట్ ఊహించిన దానికంటే పెద్ద రేంజ్ కి నార్త్ లో మిగతా స్టేట్స్ లో వెళ్ళిపోవటం వలన అనుకుంటా, సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి, కథ - కొనసాగింపు లాంటివి పక్కన పెట్టి ఎం చేస్తే వర్కౌట్ అవుతుంది, స్పాన్ ఇంకా ఎలా పెంచొన్చు, ఎంత వరకు బిజినెస్ చేసే పొటెన్షియల్ ఉంది, ఈ క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్లాలి లాంటి కమర్షియల్ లెక్కలు వచ్చేసినట్టు ఉన్నాయ్.
సరే ఎక్కడ ఆగిందో అక్కడ మొదలవుతుంది అనుకునే మనకి సినిమా జపాన్ లో మొదలవుతుంది ఒక యాక్షన్ ఎపిసోడ్ తో - కంటైనర్ లో టార్చ్ లైట్ ఏసుకొని ఇంకో పది రోజులు ఉండగానే ముప్పై రోజుల్లో జపాన్ బాష నేర్చుకొని దిగేసి ఫైట్ చేసేసి - లాంటి లాజిక్స్ అడగకూడదు అని అక్కడ నుంచి చైల్డ్ హుడ్ కి తీసుకెళ్లి ఇంటి పేరు టాపిక్ తెచ్చి అదొక కలలా ముగించారు. ఫాన్స్ ని సంతోష పెట్టటానికి యాక్షన్ ఎపిసోడ్ అని సరిపెట్టుకున్నా, ఈ సీన్ మళ్ళీ ఎక్కడ మనకి కనిపించక పోవటం వలన అసలు ఈ సీన్ ఎందకు పెట్టి ఉంటారు అని ఆలోచిస్తాం. కలలో - నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎదిగిపోతున్న పుష్ప ఒక్క సరి వెనక్కి తిరిగి చూసుకుంటే (అంత ఎత్తు నుంచి కిందకి పడితే) ఇంటి పేరు లేని లోటు (నిజం కంటే పీడకల) ఏమి లేదు, ఆ వెళితే జీవితం లో వెంటాడుతూనే ఉంటుంది. అంటే మళ్ళీ పర్సనల్ గోల్ అండ్ ప్రొఫెషనల్ గోల్. మళ్ళీ రెండు థ్రెడ్ లు.
ప్రొఫెషనల్ గోల్ : ఫస్ట్ పార్ట్ లో దెబ్బ తిన్న షెకావత్ సర్ ఎం చేస్తాడో అని ఆలోచించినట్టు ఎక్కడ కనపడదు. అసలు వాడిని ఒక థ్రెట్ లాగానే భావించలేదు పుష్ప. ఎదగాలి అనుకునే వాడు శత్రువులని వదిలెయ్యడు, శత్రుశేషం ఉండకూడదు అనుకుంటాడు, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతాడు, అలాంటిది, వాడు వీళ్ళ మేకల గుంపులో కలిసి ఒక బ్యాచ్ మొత్తాన్ని పట్టుకునే వరకు తెలుసుకోలేక పోతాడు పుష్ప. పట్టుబడిన తన కూలి గుంపు కోసం స్టేషన్ మొత్తం కోనేసే ఎలివేషన్ సీన్ పెట్టె అవకాశం రాదూ అని ఏమో.
పర్సనల్ గోల్: నిద్రకూడా ప్రశాంతంగా పట్టనివ్వని చేదు నిజం - లేని ఇంటిపేరు - సంపాదించుకోటానికి ఏమైనా చేస్తాడా అంటే అది కూడా ఉండదు. శ్రీవల్లి కి అవమానం ఎదురైతే మా అయన దేవుడి తో సమానం అని చెప్పి ఇంటి పేరు అవసరమే లేదు అని నలుగురి మధ్యలో చిన్నగా చెప్పించారు. భార్య CM తో ఫోటో అడిగితే, అది కుదరక పోతే, సీఎం నే మార్చేసి తీయించుకున్న ఫోటో ని ఇంట్లో తగిలించుకోవటం ఆశయం అవుతుంది. ఈ ఆశయ సాధనలో కి షెకావత్ సర్ గోల్ ఒక చిన్న థ్రెట్ అవుతుంది.
షెకావత్ సర్ కి ఎం గోల్ ఉంది ? అప్పటి వరకు అయితే లేదు ? ఎందుకంటే ఒకానొక సందర్భం లో ఎం చేస్తే నా పగ తీరుతుందో తెలియక పోవటమే పెద్ద ప్రాబ్లెమ్ అంటాడు. పుష్ప తో సారీ చెప్పించుకోవటం ఒక గోల్ గా, అది ఫెయిల్ అయ్యాక, పుష్ప ని మళ్ళీ కూలోడిని చెయ్యటం ఆశయం గా పెట్టుకుంటాడు. ఒకరిని ఒకరు ఛాలెంజ్ చేసుకుంటారు, ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో ఇద్దరి మధ్య నడిచింది, ఇప్పుడు మొత్తం సిండికేట్ జనాలు చూస్తుండగా జరుగుతుంది. ఇది ఇంటర్వెల్.
మరి అప్పటి వరకు ఎం జరిగింది? సీఎం పుష్ప కి ఫోటో ఇవ్వను అని అవమానించే ఎపిసోడ్ (సీఎం కూడా ఇంటి పేరు లేదు అని అవమానించి ఉంటె - అతికినట్టు ఉండదు కానీ - ప్రొవొకింగ్ గా ఉంటుంది, ఆ సిట్యుయేషన్ లో ఆ క్యాంపు లో ఎవరో ఒకరు ఆ మాట అని ఉన్నా సరిపోయేది ఏమో). జస్ట్ ఫోటో కోసం స్టేట్ సీఎం ని మార్పించేయ్యటం అన్నది బిజినెస్ మాన్ క్లైమాక్స్ లో ఢిల్లీ ని గిఫ్ట్ గా ఇవ్వటం అంత హాస్యాస్పదం. ఎంపీలకి - ఢిల్లీకి సోఫా లో కోట్లు డెలివరీ చెయ్యటం అంత హాస్యాస్పదం. కానీ ప్రెసెంట్ చేసిన విధానం థియేటర్లో కుర్చున్నంత సేపు అలరించేలా ఉండటం - రెండు మూడు ఎలివేషన్స్ వేసుకోవటం చూస్తుంటే - ఏంటబ్బా పుష్ప ఇట్టా ఖర్చు పెట్టుకుంటూ పోతే సిండికేట్ (ప్రొడ్యూసర్స్) లెక్క కి సమాధానం చెప్పాలి కదా అంటే "పార్ట్ 2 " కి వచ్చే లెక్క (బిజినెస్) పెరుగుండాదిలే సారూ అని అన్నట్టు ఉంది.
దానిని వాళ్ళు కూడా గట్టిగా నమ్మినట్టు ఉన్నారు, ఇంకొక ఎలివేషన్ తర్వాత 2000 టన్నుల సప్లై కి డీల్ ఓకే చేసుకుంటారు. మళ్ళీ హెలికాప్టర్ ఎలివేషన్ ఐసింగ్ ఆన్ ది కేక్. మాల్దీవ్స్ లో హెలికాప్టర్ ఎక్కేసి చిత్తూర్ లో దిగిపోయినంత ఈజీ కాదు DGCA అప్రూవల్ అని ఒకటి ఉంటుంది అని దానిని సినిమాటిక్ లిబర్టీ ముసుగులో పట్టించుకోవాల్సిన పనిలేదు అని సర్దిచెప్పుకోటానికి. ఇంతకీ శివ మాల ఎందుకు వేసుకున్నట్టు దాని గురుంచి మళ్ళీ ఎక్కడ ప్రస్తావన ఎందుకు లేనట్టు? ఏదైతేనేం, అందరు ఆశ్చర్యపడేలా రెండు వేల టన్నుల సేకరణకి సిండికేట్ మీటింగ్ పెట్టి - ఫీలింగ్స్ సాంగ్ ఏసుకున్నాక - ఎర్ర చందనం పోగేసే పనిలో పడతాడు. పుష్ప ని అడ్డుకోటానికి అనసూయ - షెకావత్ ఏకమై ఒక సిండికేట్ మెంబెర్ చావు కి కారణం అవుతారు. పంచాయితీ పుష్ప సారీ చెప్పటం వరకు వెళ్తుంది. ఇంత బిల్డ్అప్ ఇచ్చి క్లోజ్ చేసిన ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్, ఒక సారీ దగ్గర ఆగుతుంది అని అస్సలు ఊహించని ట్విస్ట్. పుష్ప వచ్చి సారీ చెప్తాడు అక్కడ ఇంటర్వెల్ పడి ఉండే ఛాన్స్ లేదు కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చి - వార్నింగ్ ఇచ్చి - ఒకర్ని ఒకలు ఛాలెంజ్ చేసుకోవటం తో ఇంటర్వెల్ పడుతుంది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో మొదలు అవ్వాల్సిన కాన్ఫ్లిక్ట్ - సెకండ్ పార్ట్ ఇంటర్వెల్ కి మొదలయినట్టు. ఇక్కడికి ఫస్ట్ ఆక్ట్ పూర్తి అయినట్టు. దమ్ముంటే పట్టుకో - సిండికేట్ వదిలేస్తా అని ఛాలెంజ్ అయితే చేసాడు కానీ, పొరపాటున మిస్ అయ్యావ్ అనుకో - అదే నీకు ఆఖరి రోజు అని గుర్తుపెట్టుకో అని కూడా అనడు మన హీరో. అప్పుడు షెకావత్ సైడ్ నుంచి కూడా కొంచెం ప్రెషర్ లేక టెన్షన్ ఉండేది ఆ పాత్ర కి. షెకావత్ మిస్ అయితే పోయింది ఎం లేదు, ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్ళిపోవటం తప్ప, దాని వాళ్ళ ఆ పాత్ర ఉనికి కి వచ్చే ప్రమాదం కూడా లేదు, కనీసం యూనిఫామ్ వదిలేస్తా అనే ఛాలెంజ్ కూడా ఉండదు.
కానీ అంతకు ముందు స్విమ్మింగ్ పూల్ సీన్ కే షెకావత్ ని మానసికం గా చంపేసినట్టే ? ఇంక అక్కడ నుంచి మళ్ళీ విలనిజం పుడుతుంది అనుకోవటం మన భ్రమ. ఒకవేళ నిజంగా పుష్ప సరకు పట్టేసుకుని అప్పుడు పుష్ప మళ్ళీ కూలీగా అయ్యిపోయి అడవుల్లో తిరుగుతుంటే అప్పుడు వేర్ ఈజ్ పుష్ప షో రీల్ స్టోరీ ఉంటుంది ఏమో అని ఎదురుచూడటం అత్యాశ.
ఇంక సమస్యాత్మకం అవ్వాల్సిన సెకండ్ హాఫ్ లో - షికవాత్ సర్ అడవిని అష్టదిగ్బంధనం చేసేస్తే, ఆయన్ని మస్కా కొట్టి మొత్తం సరుకు బోర్డర్ దాటించేస్తాడు పుష్ప. లెక్కల మాస్టారు నుంచి అస్సలు ఎదురుచూడని ఎపిసోడ్ ఇది. ఎంత సినిమాటిక్ లిబర్టీ అనుకుందాం అన్నా కూడా, ఇదే సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒకొక్కడు మోసుకొచ్చిన దుంగ వెయిట్ లెక్క కూడా చూపించారు. యావరేజ్ గా ఒక దుంగ 50 KG అనుకుంటే, మొత్తం 2000 టన్నులు కి 40,000 దుంగలు. ఒక లారీ బెస్ట్ కండిషన్ లో మంచి రోడ్ మీద 25 టన్నులు తీసుకెళ్తుంది అనుకుంటే 80 లారీలు. ఇంత చేస్తే సరుకు లారీ లో వెళ్లకుండా ఎడ్లబండి రూపం లో వెళ్తుంది, ఒక బండి చెయ్యటానికి 350 నుంచి 400 KG చెక్క వేసుకుంటే 5000 బండ్లు, ఒక రాత్రిలో బోర్డర్ దాటేశాయి - రామేశ్వరం వరకు వెళ్లిపోయాయి. షెకావత్ గారు ఇంత సరకు పెట్టుకుందాం అనే ప్లాన్ లో ఉన్నాయని ఫోర్స్ ఎంత అవసరమో ఆలోచించరు, పక్క స్టేట్స్ నుంచి సపోర్ట్ తీసుకుందాం అని కూడా ఆలోచించరు, బోర్డర్ దాటిపోతే మొత్తం అయిపోయినట్టే. పది ఇరవై ముప్పై టన్నుల సరుకు అయితే ప్రశ్న లేదు కానీ రెండు వేల టన్నులు. అసలు క్రైమ్ డైరీస్ మురళీధర్ గారి CI సాదిక్ అలీ ఇంటర్వ్యూ చూసి ఉన్నా కూడా షెకావత్ క్యారెక్టర్ ని ఇంక బాగా డెవలప్ చేసి ఉండేవారు, LINK స్టేట్ బోర్డర్ సంగతి పక్కన పెడితే కంట్రీ బోర్డర్ వరకు వెళ్లి మరీ సరుకు పట్టుకున్న హీరోస్ ఉన్నారు మనకి, ఇక్కడ మన హీరో కి అపజయం ఉండకూడదు కాబట్టి - ఎలివేషన్ ముసుగులో లేపుకుంటూ పోవటమే. పట్టుకున్న సరుకు నకిలీ అని తెలిసి షెకావత్ తో పాటు అనసూయ ని కూడా అపహాస్యం చేసేశాక ఇంక ఏముంటుంది సినిమాలో - జాతర ఎపిసోడ్.
ఎందుకొచ్చింది అనేది పక్కన పెడితే - బాగా స్టేజి చేసిన ఎపిసోడ్. ఒక మంచి సెట్ అప్ - అందులో ఒక మంచి సందర్భం - పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న ఈటీవీ వారి ఢీ డాన్స్ పెర్ఫార్మన్స్ - దానికి వివరణ - డ్యూయెట్ - అయ్యాక ఫైట్ - మనం ఫస్ట్ హాఫ్ లో మర్చిపోయిన ఇంటిపేరు అవమానం - శ్రీవల్లి సమాధానం. మొదటి నుంచి లాస్ట్ వరకు నీట్ గా ఎగ్జిక్యూట్ చేసిన 20 నిముషాలు ఒక ట్రాన్స్ లోనికి తీసుకెళ్లిపోయే రేంజ్ పెర్ఫార్మన్స్లు - సినిమా మొత్తం మీద పైసా వసూల్ ఎపిసోడ్ అన్నమాట.
ఇప్పుడు తమిళనాడు లో రామేశ్వరం నుంచి శ్రీలంక కి సరకు తరలించటం - డబ్బులు ఉన్న కంటైనర్ కలకత్తా నుంచి చిత్తూర్ కి అన్ని చెక్ పోస్ట్ లు దాటుకొని వచ్చేయ్యటం. షెకావత్ కి ఎంత బుర్ర తక్కువ అంటే - సరుకు ఎలాగూ మిస్ అయింది, కనీసం ఆ డబ్బులు ఐన అడ్డు పడితే ఇటు సరుకు పోయి అటు డబ్బు అందక పుష్ప గాడి పని అయిపోద్ది అనే కనీసం ఆలోచన కూడా చెయ్యడు. అలాంటోడు హీరో కి థ్రెట్ అవుతాడు అని ఎలా అనుకుంటాం అసలు.
సీఎం మారిపోతే సినిమా అయిపోయినట్టే - శుభం కార్డు కూడా ఏసేసుకోవచ్చు. రిలీజ్ డేట్ ఇచ్చేయొచ్చు. అయ్యో మరి పర్సనల్ గోల్ మర్చిపోయాం, దానికి స్టార్టింగ్ లో దేవుడు అనేసాం, జాతర అయ్యాక బ్రాండ్ అని పెద్ద డైలాగ్ చెప్పించాం, ఇంక ఇంటి పేరు ఎందుకు ? ఆల్రెడీ బ్రాండ్ అయిపోయాక ? లేదబ్బా పుష్ప కి వచ్చే లెక్క మారుండాది, ఒక పెద్ద ఫైట్ ప్లాన్ చెయ్యొచ్చు. ఎవర్ని కొట్టాలి ? జాతర లో దెబ్బ తిన్నోడిని మళ్ళీ కొట్టాలి. కొట్టేసినోడిని మళ్ళీ ఎం కొడతాం లే ? అందుకే ఈ సారి వాళ్ళతో కట్టించేసుకొని మళ్ళీ వాళ్లనే కొట్టేద్దాం. ఇక్కడ ఒక అరగంట స్టాండ్ అలోన్ ఎపిసోడ్ అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ తో - ప్రత్యేకం గా నార్త్ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని తీశారా అనేవిధంగా ఆవిష్కరించబడింది.
పర్సనల్ గోల్ విషయానికి వస్తే, జాతర లో ఇచ్చిన డైలాగ్ ప్రకారం ఆ ప్లేస్ లో ఏ ఆడబిడ్డ ఉన్న పుష్ప ఇలానే పోరాటం చేసేవాడు కాబట్టి ఇంటి పేరు గురుంచి కానప్పుడు, ఇప్పుడు క్లైమాక్స్ లో పోరాటం చేసిన తర్వాత ఇచ్చిన ఇంటి పేరుని సున్నితం గా తిరస్కరించి ఉండాల్సిందే ? లేదంటే ఇదంతా ఆ ఇంటి పేరు కోసం చేసిన సాహసం అయిపోద్ది అలా కాదు అనుకుంటే జాతర ఎండ్ లో ఇచ్చిన ఎలివేషన్ వేస్ట్ అయిపోద్ది. అసలు శ్రీవల్లి ద్వారా కానీ, తన తల్లి ద్వారాగాని ఆ గౌరవం ని నిలబెట్టడం అనేది ఒక అవసరం గా ఆవశ్యకతగా ఎక్కడ చూపించనే లేదు. అలా చూపించి ఉంటె, లాస్ట్ ఆ కార్డు పట్టుకొని ఏడ్చే సన్నివేశం కి ఒక అర్ధం ఉంటుంది, పెళ్ళిలో అందరు కలవటానికి ఒక పరమార్థం ఉంటుంది. మరి దానిని ముగింపుగా ఎలా పెట్టుకున్నారో అర్ధం కాలేదు. అసలు ఈ థ్రెడ్ ని టచ్ చెయ్యక పోయినా కూడా ఫస్ట్ పార్ట్ లాగానే ఇది కూడా పాస్ అయిపోయి ఉండేది.
ఇంత తిక మక గందరగోళం మధ్య నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, లెక్కల మాస్టారు ఈ సారి పూర్తిగా కమర్షియల్ మీటర్ లెక్కలో తీసేసారు
2 థ్రెడ్ లు - 3 కామెడీ సీన్ లు - 4 యాక్షన్ ఎపిసోడ్ లు - 5 పాటలు - 6 ఎలివేషన్ లు
మళ్ళీ ఇలాంటి కమర్షియల్ మీటర్ లో ఎపిసోడ్స్ అండ్ ఎలివేషన్ లు రాసుకుంటే, పార్ట్ 3 ఏంటి పార్ట్ 10 వరకు కూడా చేసుకోవచ్చు. ఎలాగూ కథ కాకరకాయ లాంటివి అవసరం లేదు కాబట్టి. ఇదే టెంప్లేట్ లో మా వినయ్ గారో, బోయ సారో తీస్తే ఇంత ఆలోచించే పని లేదు కాకపోతే ఈయన కూడా ఈ ఎపిసోడ్స్ ని వాళ్ళ స్థాయి లోనే ఎపిసోడ్ ఎపిసోడ్ గా - గూస్బంప్స్, ఎలివేషన్ పరంగా - విజిల్స్ వేయించేలా తీసి మెప్పించటం జరిగింది, వీటికి తోడు అల్లు అర్జున్ విశ్వరూపం తోడు అయితే ప్రేక్షకుడు కి పైసావసూల్ అయిపోయినట్టే కదా ? కానీ లెక్కల మాస్టర్ నుంచి కొంచెం ఎక్కువగానే ఆశించటం జరిగింది. నిజంగానే ఇవేవి పట్టించుకునే స్టేజిలో ప్రేక్షకులు లేరు, థియేటర్ లో కూర్చున్న మూడు గంటలు ఎంటర్టైన్ అయ్యామా ? లేదా ? మొబైల్ వైపు చూడకుండా సినిమా మనల్ని కూర్చోబెట్టిందా లేదా ? ప్రతి పావు గంట కి ఒక ఎలివేషన్, మధ్య మధ్య లో కమర్షియల్ హై వోల్టేజ్ ఎపిసోడ్స్, అలరించే సాంగ్స్ ఉండటం వలన మూడు గంటల పైగా ఉన్న సినిమాకూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఎల్లిపోవటం అన్నిటికంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు - ఒక్క స్ట్రాంగ్ విలన్ లేడు అనే లోటు ని మాత్రం ఎం చేసినా పూడ్చలేక పోయారు. సినిమా చూస్తున్నంత సేపు మనలోని ప్రేక్షకుడు అలెర్ట్ గా ఉంటె చాలు, సినీ ప్రేమికులకు సీతారామం, అమరన్ లాంటి సినిమాలు ఎలాగూ ఉన్నాయి.
" ఫస్ట్ పార్ట్ టైపు లో నే ఈ పార్ట్ కి కూడా కేశవ వాయిస్ ఓవర్ లో కథ చెప్పి ఉంటె, పైన ఉన్నవి అన్ని ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ గా, ఆ పొద్దు ఎం జరిగింది, ఈ పొద్దు ఎం జరిగింది, జపాన్ ఎందుకెళ్ళాడు - జాతర ఎందుకొచ్చింది అని మనకి కూడా తెలిసి ఉండేది "
వేర్ ఈజ్ పుష్ప : ఇంతకీ ఈ షో రీల్ కి అర్ధం లేకుండా ఎందుకు పోయింది, షూటింగ్ అయితే చేసినట్టే కనిపిస్తుంది మరి ఈ పార్ట్ లో పెట్టకుండా మూడో పార్ట్ కోసం దాచి పెట్టారేమో. నేనైతే జపాన్ లో బుల్లెట్ తగిలి, సముద్రం లో పడిపోయి, సరుకు పోయి, డబ్బులు పోయి, సిండికేట్ కి సమాధానం చెప్పలేక అండర్గ్రౌండ్ కి ఎల్లిపోతే, పుష్ప లేక జనాలకి వర్క్ లేక వాళ్ళు అందరు బాధలు పడుతుంటే, పుష్ప కోసం పోరాటాలు చేస్తుంటే, ఇదే టైం పుష్ప గాడిని అంతం చెయ్యటానికి అని కూంబింగ్ పెడితే, పులి తిరిగే ప్రదేశం లో పుష్ప జాడలు తెలిసే ఎపిసోడ్ వస్తుంది ఏమో అనుకున్నా, కానీ అంత ఓపెనింగ్ ఫైట్ తర్వాత ఇంత లాగ్ పెడితే టెంపో సస్టైన్ చెయ్యటం కష్టం అని లేపేసినట్టు ఉన్నారు మరి.
పుష్ప 1 లో కాంఫ్లిక్ ఒక్కటే మిస్ అయ్యింది - 2 కి వచ్చే సరికి కాన్ఫ్లిక్ట్ తో పాటు "సుక్కు మార్క్" కూడా మిస్ అయ్యింది.
0 comments:
Post a Comment