CINEMA CINEMA CINEMA - THE IDEA TO STORY

  


 సినిమా సినిమా సినిమా - ఐడియా నుంచి కథ


మనలో సినిమా పిచ్చ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, రిలీజ్ ఐన ప్రతి సినిమా ని చూస్తూ ఏదో ఒక రోజు నేను కూడా సినిమా కి కథలు రాయాలి అని కలలు కనే వాళ్ళు ఉన్నారు. ఆశక్తి ఉండి ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎక్కడ మొదలు పెట్టాలో డిసైడ్ అవ్వలేని వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగ పడాలి అనే ఉద్దేశం తో నాకు తెలిసిన, నేను చదివిన, నేను విన్న సినిమా పరిజ్ఞానం గురుంచి టూకి  గా రాద్దాం అనే ఆలోచనే నా ఈ "సినిమా, సినిమా, సినిమా" ఆర్టికల్ సిరీస్ ముఖ్య ఉద్దేశం. చాలా రోజుల తర్వాత ఈ సిరీస్ లో ఇంకో ఆర్టికల్. ఇంతకు ముందు ఇందులో వచ్చిన ఆర్టికల్స్ గురుంచి తెలియని వాళ్ళ కోసం ఈ లింక్ లు







అప్పుడు ఎందుకు ఆపాల్సి వచ్చింది అనే కంటే, ఇప్పుడు ఎందుకు మళ్ళీ రాయాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న కాబట్టి, ఈ మధ్య వరసగా చూస్తున్న సినిమాలలో గమనిస్తున్న విషయాలు, కాన్సెప్ట్ పరంగానో, ఐడియా పరంగానో ఉత్తేజకరమైన అంశంగా అనిపించేవి, ఫైనల్ గా సినిమాకి వచ్చేసరికి పలచన అయిపోతున్నాయి, ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు కదా అనిపించినవి కూడా సెకండ్ హాఫ్ వచ్చే సరికి తేలిపోతున్నాయి. ఒక ఐడియా - కాన్సెప్ట్ - బేసిక్ లైన్ - స్టొరీ లైన్ ఎలా పిలుచున్న సరే, సినిమాకి అదే స్టార్టింగ్ పాయింట్. సినిమాలకు ఇలాంటి కథలే ఎంచుకోవాలి అని రూల్ ఎం లేదు, పేపర్ లో వచ్చే న్యూస్ ఐటెం కూడా ఒక్కోసారి మంచి కథ పుట్టటానికి ప్రేరణ కావొచ్చు. వేరే సినిమా చూస్తున్నప్పుడో, నవల చదువుతున్నపుడో, ఎప్పుడైనా - ఎలాగైనా.. కానీ అదే ఐడియా ని కథగా డెవలప్ చేసినప్పుడు గమనించాల్సిన విషయాలు ఏంటి అనేది చర్చించుకుందాం. 


ది ఐడియా ; అసలు మన ఐడియా కి సినిమా కథ అయ్యేంత సీన్ ఉందా అని చెక్ చేసుకోవాలి. కథలో కాన్ఫ్లిక్ట్ / సంఘర్షణ ఎక్కడ ఉందొ చూసుకోవాలి. బిగినింగ్-మిడిల్-ఎండ్ అనే మూడు విభాగాల్లో మన ఐడియా పూర్తిగా సెట్ అవుతుందా అని చెక్ చేసుకోవాలి. వీటి గురుంచి మనం ఆల్రడీ డిటైల్డ్ గా చెప్పుకున్నాం కాబట్టి, ఇక్కడ సింపుల్ గా  బిగినింగ్ లో సమస్య ఏర్పాటు చేసుకొని, మిడిల్ లో ఆ సమస్యతో సంఘర్షణ ని నడిపించి, ఎండ్ లో ఆ సమస్యకి పరిష్కారం దొరికిందా అని ఆలోచించాలి. ఐడియా కి కూడా స్ట్రక్చర్ ఉండాల్సిందే అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం


సింపుల్ గా కథ ఎలా రాసేద్దాం అనుకుంటే మాత్రం ఒక పాత్ర ద్రుష్టి కోణం లో కథని ఆలోచించటం మానేసి, ఒక సంఘటన / సందర్భం తో ఆలోచిస్తే కథ పుట్టే అవకాశం ఉంటుంది. ప్రకాష్ రాజ్ లాంటి ఒక పాత్ర ని కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర కొట్టే సంఘటన లేకపోతే ఒక్కడు కథ లేదు, మహేష్ పాత్ర లేదు. దానికి ముందు వెనక సినిమా మొత్తం ఉంటుంది. కాలేజీ లో JD చక్రవర్తి ని నాగార్జున కొట్టే సంఘటన తో శివ లో అసలు కథ మొదలవుతుంది. ఈ బలమైన సంఘటనలోంచి ఇప్పుడేంటి, ఏం జరుగుతుంది? అన్న ప్రశ్న ఆడియెన్స్ ఫీలై కంగారు పడేట్టు చూసుకోవాలి.. ఈ రెండు సందర్భాల్లో పుట్టే కంగారు - కొట్టాడు, కొట్టేశాడు - తర్వాత ఏంటి ?


కథ చేస్తున్నప్పుడు అనుకున్న ఐడియాని ఎక్కడో వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కూడా జరుగుతూంటుంది. మనకొచ్చిన ఐడియా చుట్టూ ఏవేవో సందర్భాలు అల్లేసుకోవటం వలన కావొచ్చు, లేదా మనకి ఐడియా రావటం మొదలు డైరెక్ట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసి, వన్ లైన్ ఆర్డర్ ఏసేసుకొని అదే బౌండ్ స్క్రిప్ట్ అనుకోవటం సహజం గా జరిగే తప్పు, ఆలా కాకుండా, ఈ రెండికి మధ్య లో సినాప్సిస్ స్టేజి ని గుర్తు పెట్టుకోవాలి. ఒక నాలుగైదు లైన్స్ లో మొత్తం స్టోరీ కి బిగినింగ్-మిడిల్-ఎండ్ ని కలిపి ఒక కథగా చెప్పగలుగుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఒక ఆలోచన తో ప్రారంభం ఐన కథ, ఒక లైన్ గా, అక్కడ నుంచి నాలుగైదు లైన్ల కాన్సెప్ట్ గా, అక్కడ నుంచి నాలుగు పేజీల సినాప్సిస్ గా ఎలా అవుతుంది అని ఇంతకు ముందు చెప్పుకున్నాం


ఇంట్రస్ట్ ఉన్న వాళ్ళు చదవాల్సిన ఒక పుస్తకం Seven Elements of  a Viable Story by Erik Bork, అందులో ఎం చెప్పొచ్చారు అంటే  కొన్ని సినిమాలు సూపర్ హిట్ లు అవుతాయి కొన్ని అవ్వవు, ఎందుకు అని ఎనాలిసిస్ చేసుకుంటే కథలో / ఐడియా ఉండాల్సిన 7 క్వాలిటీస్ గురుంచి చెప్పారు 


Punishing

Relatable

Original

Believable

Life-Altering

Entertaining

Meaningful


కమర్షియల్ సినిమాలు అన్ని "punishing " చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి, ఈ కిందన చెప్పిన 8 రకాల ప్రాబ్లమ్స్ చుట్టూ అతి పెద్ద కమర్షియల్ యాక్షన్ మూవీస్ కథలు నడుస్తూ ఉంటాయి అన్నమాట 


  1. Someone or something is trying to kill me (or us).
  2. Someone or something is trying to destroy my life as I know it.
  3. I have a once-in-a-lifetime but incredibly difficult opportunity to rise up and be somebody, in a big way, that could forever change my sense of self.
  4. I have to rescue someone from a potentially terrible fate.
  5. I have to reach a distant and life-changing “prize,” which seems nearly impossible to do.
  6. I have to defeat powerful “bad guys” who have hurt and/or are threatening innocents.
  7. I have to escape a terrible situation, which prevents me from living freely and happily.
  8. I have to win over and/or hang on to a desired life partner, with whom I have a chance at my best life. But something is hugely in the way of that. 

ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఒక ప్రధాన సమస్య చుట్టూ మన కథ కథనం అల్లుకోక పోతే, నాలుగైదు సమస్యలు కలిపి కలగూర గంప కింద రాసేసుకుంటే అది గాథ అవుతుంది అంటే డాక్యుమెంటరీల్లో వాడే స్టార్ట్ అండ్ స్టాప్ నడక పద్ధతి అన్నమాట. ఒక సమస్య ఎస్టాబ్లిష్ చెయ్యటం, దానికి పరిష్కారం చూపి మరింకో సమస్య .....ఇలా నాలుగదు కవర్ చేసుకొని సినిమా అయిపోయింది అని చెప్పటం. ఈ పద్ధతిలో  ప్రధాన సమస్య చుట్టూ విషయం తిరగదు. అన్నీ విడివిడి సమస్యలే వుంటాయి. కానీ కమర్షియల్ సినిమాలకి ఒక ప్రధాన సమస్య వుండి  తీరాలి. 

అన్ని బాగానే ఉన్నాయ్ కానీ అసలు మనం ఐడియా సినిమాగా మారె అంత సత్తా ఉందాలేదా అని - సినాప్సిస్ స్టేజి లోనే ఐడెంటిఫై చేసుకోవటం ఎలా అని ఆలోచిస్తే. 

చెక్ లిస్ట్ - ఐడియా 

  • ఐడియా కి కథానాయకుడు పాత్ర కి సంబంధం ఏంటి ? అది మనం ఐడెంటిఫై చేసుకోగలిగే పాత్ర లేక లార్జర్ థేన్ లైఫ్ సూపర్ హీరో పాత్ర?
  • మన పాత్ర కి ఏదైనా ఆశయం ఉందా? 
  • ఆ ఆశయం చేరుకోటానికి ఉన్న ఇబ్బంది ఏంటి ?
  • ఆ ఇబ్బందిని ఎలా అధిగమించాలి అని కోరుకుంటున్నాడు 
  • వాడు అనుకున్నది సాదించేసాడే అనుకుందాం, వాడి తో పాటు మనం కూడా సంతృప్తిగా ఫీల్ అవుతున్నామా? 
పైన చెప్పుకున్న పాయింట్స్ కి సమాధానం మన సినాప్సిస్ లో దొరక్కపోతే, ఆ పాత్ర తో, ఆ కథతో మనం ప్రేక్షకులని అలరించలేము అని అర్ధం. 

అసలు ఒక ఐడియా - సినిమా గా మారే క్రమం లో మెయిన్ గా ఈ కింద చెప్పుకున్న విషయాల్లో తడబాట్లు ఎక్కువ గా జరుగుతూ ఉంటాయి 

  • ఆల్రెడీ మనం చూసేసిన కేరక్టర్స్ లేదా సిట్యుయేషన్ లు రిపీట్ అవ్వటం
  • అప్పుడు నడుస్తున్న ట్రెండ్ ని బట్టి దానిని సక్సెస్ ఫార్ములా అనుకోని ఫాలో అయిపోవటం 
  • పాసివ్ పాత్రలు + బలం లేని సంఘర్షణ = నిస్తేజంగా అనిపించే సీన్స్ 
  • సీన్ మొదట్లో క్యారక్టర్లు ఎలా  ఉంటాయో ముగింపు లోనూ అదే స్థితిలో వుండడం
  • కథనం ప్రిడిక్టబుల్ గా మిగిలిపోవటం 

ఆర్టికల్ మొదట్లో చెప్పుకున్నట్టు ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు ఈ ఆర్టికల్ రాయటానికి ప్రేరణ అని చెప్పాను, వాటిని చూస్తున్నపుడు, వాటికీ ఉన్న potential కి తగ్గట్టు గా డెవలప్ చెయ్యలేదేమో అనిపించింది. ఇంకాస్త జాగ్రత్త గా వ్రాసుకొని ఉండాల్సింది అనిపించింది. 

సరిపోదా శనివారం : సోకులపాలెం జనాల్ని పట్టి పీడించుకు తింటున్న నరకాసురుడు లాంటి రాక్షసుడి నుంచి వాళ్ళని కాపాడటానికి నడుంకట్టిన ఒక కథానాయకుడు శనివారం సూర్య. ఒకటి "Punishing relatable meaningful " ఐడియా, ఇంకోటి "I have to defeat powerful “bad guys” who have hurt and/or are threatening innocents." కమర్షియల్ కథ కి కావాల్సినంత పవర్ఫుల్ ప్రాబ్లెమ్, ఇంకా చెప్పుకోవాలి అంటే "శనివారం మాత్రమే పోరాటాలు" అనే ఒక ప్రతిబంధకం. మరి ఇంకేంటి లేట్, అద్భుతంగా నటించే నటులు ఉన్నారు, బీభత్సమైన టెక్నిషియన్స్ ఉన్నారు, రాజి పడని నిర్మాత ఉన్నారు, ఇంచుమించు ఇదే కాన్సెప్ట్ తో ఇంతకు ముందు వచ్చిన సినిమాల రెఫెరెన్సులు కూడా ఉన్నాయి. ఎలా చూసుకున్న మినిమం గారంటీ సినిమా. దానికి ఎంత చక్కటి స్క్రీన్ ప్లే సెట్ అయితే అంత పెద్ద రేంజ్ అంతకు మించిన రేంజ్ కి వెళ్లాల్సిన సినిమా. 

రెగ్యులర్ కథా ఫార్మటు లో కాకుండా ఎపిసోడ్స్ గా చెప్పాలి అనుకున్నారు. 

మొదలు
మలుపు
పీటముడి
ఆటవిడుపు
మధ్యభాగం
దాగుడుమూతలు
ముగింపు

ఏది ఎంతలో చెప్పాలి, ఎక్కడితో ఆపాలి అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక్కో సారి తీపి అయిన కూడా ఎక్కువ అయితే తినలేం అనే అంత. 

సెటప్ - సినిమా సెట్ అప్ సోకులపాలెం కథ అని చెప్పటానికే అన్నట్టు ఎక్కడో మొదలు పెట్టి, అక్కడే ఇంటర్వెల్ వేసి, అదే క్లైమాక్స్ అని చూపించారు. మొదలు పెట్టడమే అనుకుంటాం కానీ, ఆ మొదలు చాలా సేపు తీసేసుకుంటుంది, డిటైల్డ్ గా చెప్పాలి అనే ఆలోచన మంచిదే కానీ, కొన్ని చోట్ల ఒక్క సీన్ తో లేపెయ్యల్సిన విషయాలు ఉంటాయి, వాటిని నాలుగు సీన్స్ కింద లాగితే అవి మంచి సీన్స్ అయినప్పటికీ కథ ముందుకి కదలకుండా అడ్డు పడుతూ ఉంటాయి. సినిమా కథ సోకులపాలెం ప్రాబ్లెమ్ అయినప్పుడు మన మొదలు లో ఎక్కడా దాని ప్రస్తావన రాకపోవటం మంచిది కాదు. 

 అసలు బేసిక్ గానే శనివారం మాత్రమే కొడతాడు అంటే ఇంకా మిగిలిన 6 రోజుల్లో ఎదో ఒక రోజు నరికెయ్యొచ్చు - అన్ని రోజులు ఎలా తప్పించుకుంటాడు అనే కుతూహలం ఉండదు, అదే ఒక్క శనివారం మాత్రమే కొట్టడు అనుకోండి, అందరు ఆ శనివారమే ఈయన వెంట పడతారు కాబట్టి ఒక్క 24 గంటలు తప్పించుకుంటే చాలు, ఇదేదో కొంచెం ఒప్పించే విధం గా ఉంటుంది. 

స్మార్ట్ ఫోన్ లు సోషల్ మీడియా విస్తరించిన ఈ రోజుల్లో కూడా ఇంకా సోకులపాలెం లాంటి విలేజ్ లు ఉన్నాయని, అక్కడ జరుగుతున్న ఆగడాలు బయట ప్రపంచానికి తెలియదని ఒక రకమైన మూస ఫీలింగ్ కలిగించకుండా కొంచెం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకొని ఉండాల్సిది. 

హీరో సోకులపాలెం వాడు అయ్యి ఉండి, అక్కడ కష్టపడకూడదు అని తనకి తెలియకుండా బయట ఎక్కడో పెంచి ఉంటె, అప్పుడు వచ్చి వాళ్ళ కోసం పోరాటం చెయ్యటం ఒక పద్దతి, పోనీ ఎక్కడా ఉందొ తెలియని హీరో పెరిగిన ప్రాంతం సోకులపాలెం అయ్యి ఉండి, వాళ్ళు తనని జాగ్రత్తగా కాపాడి పెంచి ఉంటె హీరో వాళ్ళ కోసం పోరాటం చెయ్యటం ఒక పద్దతి. అసలు ఇవేవి లేకుండా, జస్ట్ నాకు కోపం వచ్చింది కాబట్టి వీళ్ళు నా వాళ్ళు అనుకుంటే, తన సిస్టర్ పెళ్లి సీన్ కానీ, నైట్ ఫైట్ పేరుతో హడావుడి చేసిన 15 నిముషాలు కానీ, సిస్టర్ కి చేసిన ప్రామిస్ కి కానీ, దేనికి వేల్యూ లేకుండా పోతుంది. ఆలా మొదలు అనే చాప్టర్ లో కొట్టిన ఒకడి బ్యాచ్ లో మూడు / నాలుగు ఫైట్ లు పెట్టుకోవటం కూడా కథకి సంబంధం లేని విషయం, ప్రేక్షకులు ఆ విషయాన్నీ అక్కడే మర్చిపోయి అసలు కథ ఏంటో తెలుసుకుందాం అనే ఉత్సుకత లో ఉంటారు. ఇంకొంచెం ముందుకి వెళ్దాం అని ఆలోచించకుండా ఎక్కడిక్కడ ఈ మాత్రం సరిపోదా అని అనుకున్నట్టు అనిపిస్తుంది. కథ హీరోది కానప్పుడు ప్రేక్షకుడు కథానాయకుడి పాత్ర తో ట్రావెల్ చెయ్యలేడు. 
దానికి ఎన్ని సెంటిమెంట్స్ జోడించి, అడిషనల్ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టించినా అవి మన కథలో మెయిన్ పార్ట్ కానప్పుడు ప్రేక్షకుడు ఆ కథ లో లీనం అవ్వలేడు.

ఎమోషన్ గురుంచి జనరల్ గా రెఫెర్ చేసే ఉదాహరణ డెంజిల్ వాషింగ్టన్ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ క్లైమాక్స్, గ్రామాన్ని పట్టి పీడిస్తున్న బందిపోటు టీం విలన్ ని చంపుతూ 'నా చిన్నప్పుడు  మా అమ్మనీ, ఇద్దరు చెల్లెళ్ళ నీ నువ్వు చంపావ్ గుర్తుందా?’ అంటాడు. అది తన పర్సనల్ పగ అని మనకి అప్పుడు తెలుస్తుంది అప్పటి వరకు చేసిన పోరాటానికి ఒక వేల్యూ వస్తుంది. 

In order to do something physical, you have to accomplish something mental; in order to accomplish something mental, you have to achieve something emotional – James Bonnet.


డబుల్ ఇస్మార్ట్ : డబుల్ డిసాస్టర్ అయిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఏముంది నా మొహం అనుకునే ముందు ఇస్మార్ట్ శంకర్ సృష్టికర్త ని తక్కువ అంచనా వెయ్యొద్దు అనాలి అనిపిస్తుంది. క్యారెక్టర్ డ్రివెన్ సబ్జెక్త్స్ తో ఒకప్పుడు అల్లాడించిన పూరిగారు ఇప్పుడు నెమ్మదించిన మాట వాస్తవమే కానీ, ఇస్మార్ట్ శంకర్ కి ఎక్స్టెన్షన్ రాసుకోవచ్చు అని మొదలు పెట్టిన ప్రయత్నం నిజంగా సాహసం అనే అనుకోవాలి. కథ విషయానికి వస్తే, ప్రపంచాన్నే గడగడలాడించే ఒక పెద్ద డాన్ బిగ్ బుల్ ఇంకా ఎక్కువ రోజులు బ్రతకడని తెలుసుకుంటాడు, మెమరీ మార్పిడి చేయించుకుంటే అలా అయినా జీవించొచ్చు అని తెలుసుకుంటాడు. ఫస్ట్ పార్ట్ లో ఆల్రెడీ ఎక్స్పరిమెంట్ సక్సెస్ అయిన ఇస్మార్ట్ శంకర్ ఏ కరెక్ట్ ఛాయస్ అని ఫిక్స్ అవుతాడు. ఇంకో పక్క తన తల్లి చావుకి కారణం అయిన బిగ్ బుల్ ని ఇండియా కి రప్పించి ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని శంకర్ ఆశయం. మెమరీ మార్పిడి జరిగిన తరువాత ఉన్న టైం మహా అయితే నాలుగు రోజులు, ఆ నాలుగు రోజులు దాటితే గతం గుర్తుండదు, పగ గుర్తుండదు, అంటే ఇదొక టైం లాక్. సింపుల్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఐడియా. ఈ మాత్రం చాలదా? అంటే కొంచెం జాగ్రత్తగా వర్క్ చేసుకొని ఉంటె సరిపోయేదే. 

విలన్ అనేవాడు భయపెట్టేలా ఉండాలి కానీ, ఇంకో రెండు నెలల్లో పోతాడు అంటే ఇంకా కథలో థ్రెట్ ఏముంది? దానికి లాస్ట్ లో ఎన్ని ట్విస్ట్ లు పెట్టి ఎం లాభం? వాడంతటా వాడు పోయే దానికి ఇంక హీరో కి ఉండే గోల్ ఎం ఇంపాక్ట్ ఉంటుంది. చచ్చిపోతాడు అనే వాడి మీద కోపం కాదు జాలి కలుగుతుంది. అసలు చిన్నతనం లోనే తల్లి - పగ ఎస్టాబ్లిష్ చేసి ఉంటె, హీరో ఆశయం ప్లాట్ పాయింట్ దగ్గరే ఫిక్స్ అయిపోయి ఉండేది. ఎలాగూ ఫస్ట్ పార్ట్ లో చెప్పాల్సిన ప్రాసెస్ అంతా చెప్పేసారు కాబట్టి అక్కడ సీన్స్ రిపీట్ అవ్వకుండా చూసుకొని ఉండాల్సింది. దాని వలన ప్రీ ఇంటర్వెల్ లో జరిగిన మెమరీ మార్పిడి ప్లాట్ పాయింట్ 1 దగ్గర జరపాల్సి ఉండేది. కరెక్ట్ గా ప్రాసెస్ ఎండ్ అయ్యే టైంకి , క్లైమాక్స్ లో చెప్పిన ట్విస్ట్ ఇంటర్వెల్ లో పెట్టాల్సి ఉండేది. దాని వలన ఇదంతా ట్రాప్ అని తనకి చావు అప్పుడే రాదు అని ఇంటర్వెల్ కె విలన్ కి తెలిసిపోయేది. ఏవిధమైన ప్రాబ్లెమ్ లేక పోయిన నా మొగుడ్ని నేనే తయారు చేసుకున్నాను, ఇప్పుడు వాడిని ఎలాగోలా లేపెయ్యాలి అని విలన్ కి కూడా ఒక ఆశయం ఉండేది. ఇంత కష్టపడి వాడిని ఇండియా కి తీసుకొస్తే, ఇంకో నాలుగు రోజలు మాత్రమే నాకు మిగిలి ఉంది పగ తీర్చుకోటానికి అనే టైం లాక్ సిట్యుయేషన్ హీరో కి ఉండేది. ఈ గ్యాప్ లో నెమ్మదిగా విలన్ మెమోరీస్ అన్ని హీరో కి వస్తూ ఎక్కడ పగ గురుంచి మర్చిపోతానో అనే సంఘర్షణ కూడా కలిపించే అవకాశం ఉండేది.  వాళ్ళిద్దరి మధ్య hide and seek లేక cat and mouse గేమ్ ప్లే తో సెకండ్ హాఫ్ ని రక్తి కట్టించొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయితే మాత్రం అలీ ట్రాక్ మొత్తం లేపేసి ఉండాల్సిందే. 

రాయన్ - గ్యాంగస్టర్ డ్రామా సినిమాలు అందులోను ధనుష్ ఎక్కువగా చేసేసిన సినిమాలు చాలా ఉండటం వలన ఇంకా కొత్తగా ఏముంటుంది లే అనుకోవటం సహజం. కానీ 50 వ సినిమా అందులోను సొంత డైరెక్షన్ లో కాబట్టి అంచనాలు గట్టిగానే పెట్టుకోవటం కూడా సహజం. ఈ "Life-Altering " ఐడియా లో "I have to escape a terrible situation, which prevents me from living freely and happily. " ఇంకో రెండు లైన్స్ లో చెప్పుకుంటే The “mission” to rise to the central story challenge is of huge importance to characters the audience has come to care about. If it doesn’t get solved, life will be unthinkably worse for them. అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల వలన రాయన్ ఫామిలీ పేస్ చెయ్యాల్సిన సందర్భాలు - నమ్మక ద్రోహాలు - ప్రతీకారం. కానీ రాసుకున్న సీన్స్ కానీ - సెట్ అప్ కానీ అన్ని మనం ఇంతకు ముందు చూసేసిన ఎదో ఒక సినిమాని తలపించిన కూడా ఫక్తు కమర్షియల్ ఫార్మటు లో వెళ్లిపోయే ఫస్ట్ హాఫ్ మనల్ని విసిగించదు . చిన్నప్పుడే తల్లితండ్రులు వదిలేస్తే బాధ్యత తీసుకొనే పెద్ద కొడుకు - సైలెంట్ గా ఉంటూ సామాన్యం గా బ్రతికేసే బాషా లాంటి ఎలేవేషన్ - గాంస్టర్స్ కొట్టుకు చస్తుంటే మిగిలిన వాళ్ళని మనం చంపెయ్యోచ్చు అని ప్లాన్ చేసే పోలీస్ ఆఫీసర్ - చెల్లికి పెళ్లి చెయ్యాల్సిన సందర్భం అన్ని అనుకున్నట్టు జరుగుతున్నాయి అనుకునే సమయం లో ఒక సమస్య - బీభత్సమైన ఇంటర్వెల్ బాంగ్ .  

ఈ కథలో ధనుష్ గారికి USP లా అనిపించిన సందర్భం "తమ్ముడే పొడిచెయ్యటం" ఎత్తుగడ బాగానే ఆలోచించారు కానీ, దానికి సరైన కారణాలు చూపించటం లో ఇంకో మూవీ రిఫరెన్స్ ఏదైనా తీసుకొని ఉండాల్సింది. అన్నయ్య కి ఎదురు తిరిగి విలన్స్ తో చేతులు కలిపే తమ్ముళ్లు మనం తెలుగు తమిళ్ సినిమాలో చాలా మంది ఉన్నారు. ఆస్తి పోతుంది అనో, అవమానం భరించలేకనో, తగిన గుర్తింపు రావటం లేదు అనో, కానీ వాళ్ళు తర్వాత వాళ్ళ తప్పు తెలుసుకొని మళ్ళీ కలిసిపోయి సంతోషం గా బ్రతికేస్తారు. అప్పుడు ప్రేక్షకులు కూడా హ్యాపీ గా బయటికి వచ్చేస్తారు. ఇక్కడ క్రియేటివిటీ ఇంకా ఎక్కువ అయిపోయి, చెల్లికి ఒక సమస్య, దాని గురుంచి తెలిసిన తర్వాత కూడా మారని తమ్ముళ్లు, వాళ్ళని చంపేసి అసలు మనం చిన్నపుడు ఎక్కడ మొదలు పెట్టామో ఇంకో 20 తర్వాత కూడా అదే సందర్భం లో ఊరు విడిచే వేరే ఊరు వెళ్ళిపోవటం అనేది కథకి ప్రశాంతమైన ముగింపు ని ఇవ్వలేక పోయాయి. అయ్యో పాపం అనాల్సింది పోయి ఎడిసినట్టు ఉంది అనాల్సి వచ్చింది.  ఎత్తుగడ తర్వాత ముందుకి తీసుకెళ్లడానికి ఎంచుకున్న విధానం బలంవంతంగా రుద్దినట్టు ఉంది తప్ప సహేతుకంగా అనిపించలేదు. అయినా కూడా మెచ్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయ్ - తన 50 వ సినిమాలో సందీప్ కి ఇంత పెద్ద రోల్, ఒక సాంగ్ ఇచ్చే ధైర్యం ఇంక ఎవరు చెయ్యగలరు ? - కథ విషయానికి వస్తే, సడన్ గా ఒక రోజు మిమ్మల్ని మీ తమ్ముళ్ళని వదిలేసి మీ పేరెంట్స్ మాయం అయిపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ? తెలిసినోడు దగ్గరకి సాయం కి వెళ్తే, వాడు మీ చెల్లిని అమ్మెయ్యటానికి ప్లాన్ చెయ్యటం చూసి ఎలా రియాక్ట్ అవుతారు? వినటానికి షాకింగ్ గా ఉండదు? అదే సినిమాలో ఫస్ట్ సీన్ అయితే ముందు ముందు ఇంకా ఎంత ఆశించవచ్చు. (ప్రామిసింగ్ గా మొదలు అయిన సినిమా ఒక స్టేజి కి వచ్చేసరికి చిన్న చిన్న కారణాలు సాకులుగా చూపించి పాత్రల స్వభావాలు మార్చేసుకుంటాయి అని ఎవరు ఊహించగలరు ? ). కమర్షియల్ ఫార్మటు లో మొదలు పెట్టిన సినిమా కమర్షియల్ గా రెగ్యులర్ ఫార్మటు లోనే ముగించేసి ఉంటె ప్రేక్షకులకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరికినట్టు అవుతుంది, లేదు ఇలాగె చేస్తా అంటే , దానికి కావాల్సిన డ్రామా బిల్డ్ చేసుకొని ఉండాల్సింది, మొత్తం మీద వెట్రిమారన్ గారి స్టైల్ ఫాలో అయినట్టు అనిపిస్తుంది, అదేదో ఆయనకే డైరెక్షన్ ఇచ్చేసి ఉంటె సెకండ్ హాఫ్ లో బిల్డ్ అప్ వేరే లెవెల్ లో ఉండేది. 

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ : తండ్రి కొడుకుల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్, ఒక పెద్ద ఘర్షణ.  ఒకరు హీరో ఇంకొకరు విలన్, ఆ ఇద్దరిగా ఒకరే నటిస్తే, అందులో ఇంతవరకు మనం అలా చూడని విజయ్ లాంటి హీరో అయితే (ATM సినిమాలో చేసాడు కొంతలో కొంత) ఇది ఒక బేసిక్ ఐడియా గా మొదలై ఉండొచ్చు. ముందు ఇద్దరు హీరోస్ అనుకున్నా కూడా మధ్యలో తెలిసిన డీ ఏజింగ్ టెక్నిక్ ని ఉపయోగించి ఒక హీరో తోనే తీసేయొచ్చు అని అప్పుడు విజయ్ సర్ కి తగ్గట్టు గా ఎలా మార్చుకుందాం అని మార్చేసినట్టు ఉన్నారు. SATS ఆఫీసర్ ఐన తండ్రి విజయ్ ఒక ఆపరేషన్ లో జరిగిన ప్రమాదం లో తన కొడుకు ని కోల్పోతే - అదే కొడుకు ని విలన్ చేరదీసి తండ్రి మీద పగ పెంచి ఒక ఆయుధం గా హీరో మీదకి వదిలితే - తిరిగొచ్చిన కొడుకు పగతో రగిలిపోతున్నారు అని తెలియని తండ్రి, కసి తో పగతీర్చుకుందాం అనుకునే కొడుకు మధ్య ఘర్షణ. బోలెడు ట్విస్ట్ లు తో మంచి ఇంటరెస్టింగ్ గా అనిపించాల్సిన కథనం - సహన పరీక్ష లా తయారు అయ్యింది. కారణం - మనం ప్రతి సీన్ ని ఎక్కడో చూసేసిన అనుభూతి కలగటం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎప్పుడు ఎం జరగబోతుందో ఆల్రెడీ మనకి తెలిసినట్టే అనిపించేలా ప్రెసెంట్ చెయ్యటం. అన్నిటికి మించి స్ట్రాంగ్ విలన్ పాత్ర లేకపోవటం. 

ఒక ఆపరేషన్ లో భాగంగా విలన్ తన ఫ్యామిలీని కోల్పోయి హీరో మీద పగ తీర్చుకుందాం అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అతనికి హీరో టీంలో ఒకడు సహాయపడతాడు. ఇంకొక ఆపరేషన్ లో అవకాశం దొరికితే హీరో కొడుకుని కిడ్నప్ చేసి చచ్చిపోయినట్టు నమ్మిస్తారు. ఇక్కడ కిడ్నప్ సన్నివేశం లో హీరో బాధ్యత లేకుండా (అంత పెద్ద ఫైట్ జరిగిన తర్వాత కూడా కొడుకుని ఒంటరిగా వదిలి వెళ్ళటం) పిల్లాడిని వదిలేసి వెళ్ళిపోయినట్టు కాకుండా తన కళ్ళ ముందే వేరేవాళ్లు ఎత్తుకెళ్ళి, వెంట పడే టైం కి ఆక్సిడెంట్ అయినట్టు ఉంటె బావుండేది. ఎలాగూ హీరో గ్రూప్ లో ఒకడు హెల్ప్ చేసాడు అనే ట్విస్ట్ లాస్ట్ లో ఉంటుంది కాబట్టి. హీరో పాత్ర పూర్తిగా పాసివ్ గా మారిపోయింది ఇక్కడ నుంచే. అక్కడ హీరో తన తప్పు కి తానే శిక్ష వేసుకొని ఫ్యామిలీ కి దూరం గా ఉంటూ వస్తాడు. తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. 15 ఇయర్స్ తర్వాత కొడుకు ఎదురుపడతాడు. ఇంటికి తీసుకొస్తాడు. ఎలా ఉన్నావ్, ఎం చేసావ్, ఎక్కడ ఉన్నావ్ అని ఇంట్లో వాళ్ళు అడగరు SATS కనెక్షన్స్ ఉపయోగించి హీరో కూడా కనుక్కోవాలని ట్రై చెయ్యడు, తన తోటి వాళ్ళు ఒకరు ఒకరు చనిపోతూ ఉంటారు, క్లైమాక్స్ వరకు ఆక్టివ్ అవ్వకుండా చూస్తూ ఉండిపోయే పాసివ్ పాత్ర అయిపోయింది. 

విలన్ గా చూపించిన చిన్న విజయ్ కి - తప్పి పోయిన తర్వాత - భయం తో కూడిన ఒక సంఘర్షణ. ఇది మంచి ఐడియా ఏ అయినప్పటికీ ఇలాంటి భయాలు పెద్ద అయినా తర్వాత కూడా వెంటాడుతూ ఉంటె ఆ పాత్ర కి ఎమోషన్ ఉంటుంది, ఎదో జస్ట్ చూపించి మమ అనిపించేసారు. పెంచిన తండ్రికి విధేయం గా ఉంటూ, అయన పగ ని తన పగ అని ఫీల్ అవుతూ కన్న తండ్రి ని అంతం చెయ్యాలని చూసే పాత్ర కి కావాల్సిన భావోద్వేగం సరిపోలేదు, ఒకవేళ ఈ విలన్ గాడికి ఎమోషన్స్ లేవు ఒక సైకో అనుకోటానికి కూడా లేకుండా పెంచిన తండ్రి కోసం విలవిలలాడిపోయే సీన్స్ కొన్ని పెట్టుకున్నారు, ఈ పాత్ర ఇలాగె ఉండిపోవాలి అంటే ఎమోషన్ పండాలి, లేదు అంటే, పాత్ర ని మార్చేసి, అపరాధ భావం కలిగించి తండ్రి తో కలిపేసి ఇద్దరు కలిసి ఒక ఆశయం కోసం పాటు పాడేది అయ్యి ఉండాలి, ఈ రెండు సరిగ్గా కుదరకపోవడం అతి పెద్ద మైనస్ అయ్యింది. జైలర్ లో భారతీయుడు లో మహా యాక్టీవ్ గా ఉండే హీరో పాత్రలు తప్పు చేసింది కొడుకే అని తెలిసినప్పుడు చివరిగా ఒక అవకాశం ఇచ్చి మారకపోతే అప్పుడు చెయ్యాల్సింది చేస్తారు. ఇక్కడ కూడా అలాంటి చక్కటి అవకాశం ఉంది అయినా ఉపయోగించుకోలేదు ఏమో అనిపించింది.    

ఒక పాత్ర పాసివ్ అయ్యి - ఇంకో పాత్ర కి భావోద్వేగం లేకపోవటం వలన, సరైన విలన్ లేక పోవటం వలన టైటిల్ లో మాత్రమే GOAT మిగిలింది. హీరో అండ్ విలన్ ఇద్దరు ఒకరే చేసినప్పుడు ఏ పాత్ర తో ట్రావెల్ చెయ్యాలి, ఏ ఎమోషన్ కి కనెక్ట్ అవ్వాలి అనేది మనం కథలో ముందునుంచే ప్రేక్షకుడిని ప్రిపేర్ చేసుకోవాలి. హీరో ఏ ఇది కాకుండా నేను ఇంకొక సినిమా మాత్రమే చేస్తాను అని డైరెక్టర్ ని కూడా అనౌన్స్ చేసాక, ఓపెన్ ఎండెడ్ క్లైమాక్స్ తో ఇంకో పార్ట్ ఉంది అని ఊరించటానికి మనసెలా వచ్చిందో VP కి, దీనినే టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు 

ఒకపక్క హీరోయిన్ చచ్చిపోయింది, అమ్మ కనిపించటం లేదు, నాన్న అన్నయ్య ఇంట్లో లేరు ఆ టైం లో చెల్లి ఎం చేస్తుంది - క్రికెట్ మ్యాచ్ చూడటానికి స్టేడియం కి వెళ్తుంది 

విలన్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాచిపెట్టిన టీం తో వెళ్లిన హీరో, అతి పెద్ద స్టేడియం లో అతి పెద్ద బాంబు ని ఆపటానికి మాత్రం ఒక్కడే వెళ్తాడు 

స్టోరీ లో ఎం మార్చిన మార్చక పోయిన ఈ టైపు ఆఫ్ అతిని మార్చి ఉండకపోతే సినిమా నచ్చని ప్రేక్షకులని CSK హేటర్స్ అని కవర్ డ్రైవ్ వేసుకోవచ్చు 

మిస్టర్ బచ్చన్ కానీ, భారతీయుడు 2 కానీ చూస్తున్నప్పుడు మనకి ఎం అనిపించదు, ఎలాగూ వచ్చాము - దొరికిపోయాము అనుకోని ఊరుకుంటాం. కానీ ఇవన్నీ ఐడియా నుంచి కథగా సినిమాగా ట్రాన్సఫార్మ్ అయ్యే స్టేజి లో డైల్యూట్ అయిపోయినట్టు నాకు అనిపించింది ఇంకొంచెం బెటర్ గా చేసుకుని ఉంటె ఇప్పుడు ఉన్న రిజల్ట్ కంటే ఒక మెట్టు పైన ఉండేవి అని నా అభిప్రాయం. 



2 comments:

Anonymous said...

Excellent writeup raju garu

Anonymous said...

informative article sir ji

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views