సినిమా సినిమా సినిమా - కథనం - టూల్స్ అండ్ టెక్నిక్స్
మనలో సినిమా పిచ్చ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, రిలీజ్ ఐన ప్రతి సినిమా ని చూస్తూ ఏదో ఒక రోజు నేను కూడా సినిమా కి కథలు రాయాలి అని కలలు కనే వాళ్ళు ఉన్నారు. ఆశక్తి ఉండి ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎక్కడ మొదలు పెట్టాలో డిసైడ్ అవ్వలేని వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగ పడాలి అనే ఉద్దేశం తో నాకు తెలిసిన, నేను చదివిన, నేను విన్న సినిమా పరిజ్ఞానం గురుంచి టూకి గా రాద్దాం అనే ఆలోచనే నా ఈ "సినిమా, సినిమా, సినిమా" ఆర్టికల్ సిరీస్ ముఖ్య ఉద్దేశం.
డైరెక్ట్ గా టాపిక్ లో కి వెళ్ళిపోయే ముందుగా కథ రాసే అప్పుడు మనం గుర్తు ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటి అని ఆలోచిస్తే,
వినోదం/ఎంటర్టైన్మెంట్ - ఒకప్పుడు, ఇప్పుడు, లేక ఎప్పటికైనా ప్రేక్షకాదరణ పొందటం లో వినోదం ని మించిన ఆయుధం ఇంకోటి ఉండదు. మనం రాసుకునే కథలో వినోదం పండించటానికి ఉన్న అవకాశాల్ని ముందుగానే భేరీజు వేసుకోవాలి, వినోధానం పండించే ఏ చిన్ని అవకాశాన్ని వదులుకోకూడదు. సగటు ప్రేక్షకుడు ఆశించేది వినోదమే, సందేసాత్మక సినిమా అయిన, విప్లవ భావాలూ ఉన్న సినిమా అయినా, వినోదం తో పాటు చెప్పాల్సిందే. లేక పోతే ఒక సెక్షన్ కె పరిమితం అయిపోయే అవకాసం ఉంది. వినోదం అంటే కామెడీ మాత్రమె అని కాదు, ఎంటర్టైన్మెంట్ అనేది ఆక్షన్ సీన్స్ ద్వారా కూడా పండించొచ్చు, పెర్ఫార్మన్స్ తో వినోదం పండించొచ్చు, అద్బుతమైన పెర్ఫార్మన్స్ ని జనల నుంచి చప్పట్లు ఈలలు పడ్డాయి అంటే వినోదం/ఎంటర్టైన్మెంట్ పండినట్టే
కమర్షియల్ వాల్యూస్: ఎంత సినిమా ఒక కళ అయినా ఎండ్ అఫ్ ది డే పైసా వసూల్ ఏ సగటు నిర్మాత లక్ష్యం. జనరంజకమైన కథ వ్రాసే ముందు ఈ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. సినిమా కథ కి ఉండాల్సిన ముఖ్య లక్షణం "ప్రేక్షకులు ఐడెంటిఫై చేసుకునే పాత్రలు, లేదా ప్రేక్షకుల సింపతీ ని పొందగలిగే పాత్ర తాలూకు కథ ఐ ఉండాలి" అప్పుడప్పుడు సూపర్ మాన్ లు, లార్జెర్ థెన్ లైఫ్ రోల్స్ కూడా వస్తు ఉంటై కానీ ఎక్కువ మనం ముందు చెప్పుకున్న కోవ కి సందందించిన కథలే చూస్తూ ఉంటాం. కాలం తో పాటు మారుతున్న ప్రేక్షకుల అబిరుచులు కూడా మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈజీ గా కనెక్ట్ అయిపోయే బేసిక్ ఎమోషన్స్ చుట్టూ అల్లుకున్న కథ కి ఎక్కువ రీచ్ ఉంటుంది. హీరో ఇమేజ్ కి తగ్గట్టు గా కథ ఉండాలి. ఒకప్పుడు ప్రేక్షకులు తాము చెయ్యలేనిది హీరో చేస్తున్నాడు అని ఊహించుకొని ఆరాదించే వారు, ఆదరించే వారు, ఆ రోజులు ఇప్పుడు లేవు. బంగారు కుటుంబాలు, జాయింట్ ఫమిల్య్ లు, పెదరాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, దమ్ము లు దాటి పోయి లివింగ్ రిలేషన్ కథలు చూస్తున్న రోజులు ఇవి. ఆల్రెడీ చూసేసిన సినిమా అయినా కొంచెం ట్రెండీ గా మార్పులు చేస్తే జనాలు ఎగబడి చూడటానికి రెడీ గా ఉన్నారు. ఆ మద్య ఇంటర్వ్యూ లో ఒక రచయిత గారు చెప్పినట్టు, ప్రతి సినిమా కి కొత్త కథ అంటే ఎక్కడ నుంచి వస్తుంది? ఉన్న కథలనే మార్చుకొని బెటర్ కథలని వండాలి. స్టేట్ రౌడీ ని మారిస్తే పోకిరి అవ్వలేదా? టూ టౌన్ రౌడీ - వర్షం అవ్వలేదా? పసి వాడి ప్రాణం - భజరంగి అవ్వలేదా? ఇవన్ని కాకుండా కొత్తదనం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కొంచెం రిస్క్ ఏ అయినా కథను నమ్మి ఒకటికి పది అభిప్రాయలు తెలుసుకొని జాగ్రత్త గా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. మిగిలిన వాళ్ళు మాత్రం, ఒకరు కొత్త గా ట్రై చేస్తే మిగతా అందరు ఫాలో అయిపోతున్నారు, మళ్లీ కొత్తగా ఎవరు చేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు.
తెలుగుదనం/నేటివిటీ - సొంత కథలు అయినా, వేరే బాష లో మనకి నచ్చిన కథలు అయినా, మన తెలుగు సినిమా వరకు నేటివిటీ చాలా ఇంపార్టెంట్. ఏ కథని అయిన మనం ఎంత వరకు తెలుగీకరించాం అనే దానిపై సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి పక్క లాంగ్వేజ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు అలాగే తీసేసినా తెలుగు లో ఫ్లాప్ అయ్యాయి. అక్కడ హిట్ అయితే ఇక్కడా అవ్వాలి అని లేదు? అక్కడి ప్రేక్షకుల అభిరుచులు వేరు, మనం తెలుగు ప్రేక్షకుల సెన్సిటివిటీస్ వేరు. ఇప్పుడంటే సాంబార్ అలవాటు అయ్యి తమిళ్ సినిమాలు డైరెక్ట్ గా నే ఆదరిస్తున్నాం. అలా అని అన్ని సినిమాలు ఆదరించం. బేసిక్ ఎమోషన్స్ వరకు నేటివిటీ కి సంబంధం లేక పోయినా, క్యారెక్టర్ డిజైన్, అది బిహేవ్ చేసే తీరు ఇంపార్టెంట్. మోహన్ లాల్ కెరీర్ లోనే బీబత్సమైన హిట్ అయిన "నరసింహం" తెలుగులో అధిపతి గా, శివ రాజ్ కుమార్ కి బిగ్గెస్ట్ హిట్ అయిన "జోగి" తెలుగు లో "యోగి" గా, విక్రం కి కమర్షియల్ సక్సెస్ అయిన "జెమిని" అదే పేరు తో వచ్చి తెలుగులో ఏమయ్యాయి? ఇలాంటి ఉదాహరణ లు చాలా ఉంటాయి.
పైన చెప్పుకున్న మూడు అంశాలు జస్ట్ కొన్ని మాత్రమె, వాటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నా కూడా అన్నిటికంటే లిస్టు లో పైన, అండ్ ఆదరికంటే ముందు ఉండేది మాత్రం ప్రేక్షకుడు. వ్రాయబోయే కథ ని మన సైడ్ నుంచో, హీరో సైడ్ నుంచో, ప్రొడ్యూసర్ సైడ్ నుంచో కాకుండా, ముందుగా ప్రేక్షకుడు సైడ్ నుంచి ఊహించుకోవాలి. ఆ ప్రేక్షకుడి నాడి పట్టుకోవాలి అంటే ఫస్ట్ సిరీస్ లో చెప్పుకున్నట్టు మన ముందు ఉన్న ఎన్నో తెలుగు సినిమాలని అధ్యయనం చెయ్యాలి ముఖ్యంగా చాలా ఓపిక కావాలి. ఒక్కో సారి మనకి అర్ధం కాదు సినిమాలు ఎందుకు ఆడుతున్నాయో, ఎందుకు పోతున్నాయో? అసలు ఏముంది అనుకున్న సినిమా ని ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టిన సందర్భాలు కోకొల్లలు. సినిమా ఫేట్ డిసైడ్ చేసేది క్రిటిక్స్, డైరెక్టర్స్, హీరోస్, కాంబినేషన్స్ కాదు ఆడియన్స్ కాబట్టే మనం కథ ని వ్రాసుకునే అప్పుడే ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మందితో అన్ని రకాల వ్యక్తులతో డిస్కస్ చెయ్యాలి, అభిప్రాయాలూ తెలుసుకోవాలి, కన్విన్సు అయితే దానికి తగ్గట్టు గా మార్పులు చేసుకోవాలి. కాకి పిల్ల కాకికి ముద్దు అని, మనం వ్రాసుకునేది ఏది అయినా మనకి నచ్చుతుంది, కానీ నచ్చాల్సింది ఎదుటివాళ్ళకి కూడా అనేది దృష్తి లో పెట్టుకోవాల్సిన విషయం.
ఇంతకు ముందు ఇదే సిరీస్ లో, స్టొరీ స్ట్రక్చర్ గురుంచి - 3 ఆక్ట్ గురుంచి, పాత్రలు - లక్ష్యాల గురుంచి చెప్పుకున్నాం. ఇక స్టొరీ లైన్, సినాప్సిస్, సీనిక్ ఆర్డర్ గురుంచి కూడా డిస్కస్ చేసుకునే ముందు స్క్రీన్ ప్లే లో మనం చూస్తున్న టూల్స్ అండ్ టెక్నిక్స్ గురుంచి కొంచెం చెప్పుకుందాం. కథని ఆశక్తికరమైన కథనం గా మలచటం లో ఉపయోగ పడే కొన్ని టూల్స్ అంతే :
టైం లాక్: బాగా ఫేమస్, ఏ విధమైన ఇంట్రడక్షన్ లేకుండా అందరికి అర్ధం అయ్యే టెక్నిక్కే టైం లాక్. అప్పటి వరకు ఉన్నా కథ కి ఊపు తెప్పించి, కథనం ని పరిగెత్తించే లా చేసే శక్తి ఉన్నా టూల్ ఇది. సందర్భం కి తగ్గట్టు గా కథలో అతికితే తిరిగు ఉండదు. ఇంకోత సేపట్లో ఏదో జరబోతుంది లేక జరిగి తీరాలి అని ప్రేక్షకుడు కి, పాత్ర కి తెలియజేసి, ఆ టైం లోపల ఎలా జరగబోతుంది అనేది చూపిస్తూ ప్రేక్షకుడు ని ఇన్వొల్వె చెయ్యటానికి వాడుకొనే అద్బుతమైన టూల్ ఇది. నెల రోజుల్లో డబ్బులు సంపాదించటం, వారం రోజుల్లో ప్రేమని వోప్పించటం, ఇంకో గంట లో నాలుగు చోట్ల పెలబోయే బాంబు లు, పెళ్లి ఆపటం, లేపుకు వెళ్ళిపోవటం, ఇలా సందర్భం ఏమైనా కథ కి సరిపోయే లా అతికితే చాలు. అలా అని మరీ డ్రమాటిక్ గా అయిపోయినా, అవుట్ అఫ్ ది బాక్స్ అయిపోయినా మొత్తం బెడిసి కొట్టే అవకాశము లేక పోలేదు. కథ ఎలాంటి స్టేజి లో ఉన్నా, ఈ టైం లాక్ తో టెంపో ని పెంచుకోవచ్చు. లెవ్ హంటర్ చెప్పినట్టు "you inject an urgency into your story that can give it additional drive to heighten audience involvement and anxiety ". టైం లాక్ లాగానే ఆప్షన్స్ లాక్ కూడా ఒక టూల్. ఉదాహరణ కి కొన్ని సినిమాలలో వీడు చేసాడు అని అనుమానం వచ్చిన ప్రతి వాడు చచ్చిపోతు ఉంటాడు, ఫైనల్ గా అసలు హంతకుడిని పట్టుకునే దారులు అన్ని మూసుకు పోతు ఉంటాయి. క్రైమ్ థ్రిల్లెర్స్ లో ఇది ఎక్కువ గా ఉపయోగపడుతుంది.
ట్రాన్స్ఫర్మేషన్ / Paradigm Shift : కథ ని కథనం గా మార్చుకున్నప్పుడు పాత్ర ని డెవలప్ చేసే అప్పుడు ముఖ్యం గా చూసుకోవాల్సింది ట్రాన్స్ఫర్మేషన్. దీనినే క్యారెక్టర్ ఆర్క్ అని కూడా అంటూ ఉంటారు. సినిమా మొత్తం ఒకేలా ఉండే క్యారెక్టర్ లు బోర్ కొట్టేస్తారు. character change is the essence of story telling. మనకి బాగా తెలిసిన ఫార్మటు లో ఒక సగటు మనిషి తన కంటే పవర్ఫుల్ శక్తి ని ధీ కొట్టి నిలబడటం (చాల కథలు ఉన్నాయి). అండర్ డాగ్ నుంచి రైజ్ అవ్వటం (చాల కథలు ఉన్నాయి). మంచి నుంచి చెడు (గణేష్) అవ్వొచ్చు, చెడు నుంచి మంచి అవ్వొచ్చు (అతడు) ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అన్నది అవసరం. తను చేసే పోరాటం లో న్యాయం ఉన్నంత వరకు జనాలు యాక్సెప్ట్ చేస్తూనే ఉంటారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో వాడే టెక్నిక్కే Paradigm Shift - అప్పటి వరకు ఉన్నా అంచనాలు అన్ని తలక్రిందులు అయిపోయేలా నిజం బయటికి రావటం, మన తెలుగు సినిమా బాష లో ట్విస్ట్ ఇన్ ది టేల్. జనరల్ గా ఇంటర్వెల్ బాంగ్ లాగానో, ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ కి లీడ్ కిందనో వాడుకుంటూ ఉంటారు. అప్పటి వరకు అబ్బులు ఫ్లాష్ బ్యాక్ లో సమర, అప్పటి వరకు అమాయకురాలు కట్ చేస్తే గుండెల్లో గునపం గుచ్చేస్తుంది, అప్పటి వరకు రౌడీ కట్ చేస్తే కృష్ణ మనోహర్ IPS, అప్పటి వరకు ఆటో డ్రైవర్ మాణిక్యం విషయం ఏంటి అంటే ఆయనకి ఇంకో పేరు ఉంది, అప్పటి వరకు మాస్టర్ కానీ అసలు పేరు రాజ్ కుమార్. ఇంకా రీసెంట్ గా అయితే అప్పటి వరకు విధేయుడు క్లైమాక్స్ లో "వెన్నుపోటు పొడిచిన పాపాత్ముడు కట్టప్ప"
ఫోర్ షాడోయింగ్/ముందస్తు సూచిక: ఈ టెక్నిక్ కూడా ఆడియన్స్ ని సినిమా లో ఇన్వొల్వె చెయ్యటానికి ఉపయోగ పడేదే. ఎం జరగబోతుంది అనే విషయం గురుంచి ముందుగా ఒక రకమైన హింట్ ఇచ్చెయ్యటమె ఈ ముందస్తు సూచిక. దీనిని రక రకాలుగా వాడుతూ ఉంటారు. ఒక్కోసారి సినిమా మొత్తం ఇది అని మొదట్లోనే వాయిస్ ఓవర్ ద్వారా చెప్పించేస్తారు. ఉదాహరణ కి ఖుషి సినిమా తీసుకుంటే మొదట్లోనే కథ చెప్పేస్తారు. అంతెందుకు ఈ మద్యనే వచ్చిన భలే భలే సినిమా లో, అప్పట్లో వచ్చిన బొమ్మరిల్లు లో, ఇలా చాల మూవీస్ లో ముందుగానే కథ చెప్పెయ్యటం వలన ప్రేక్షకులకి వాళ్ళు చూడబోయే దానిపై ఒక క్లారిటీ ఉంటుంది. ఎస్ జె సూర్య మూవీస్ లో ఎక్కువ గా ఇలా మొదట్లోనే చెప్పేస్తూ ఉంటాడు. అలాగే మొత్తం అంతా ఒకేసారి చెప్పెయ్యకూడదు. " The person who tells you everything about himself rightaway is a bore " - Alfred Hitchcock. ఎం జరగబోతుంది అని పూర్తిగా చెప్పెయ్యకుండా జస్ట్ హింట్ ఇస్తే ఏదో జరగబోతుంది అనే ఆశక్తి ని కలిగించటానికి ఇదొక టెక్నిక్. కొందరు వ్రాసే రివ్యూ లో అయినా సరే , ఫస్ట్ లైన్ లో నే సినిమా హిట్ / యావరేజ్ / ఫ్లాప్ అని చెప్పేస్తే ఇంకా రివ్యూ ఎవరు చదువుతారు? అలా కాకుండా మొత్తం చదివేలా చెయ్యటానికే మొదట్లో ఒక రకమైన హింట్ ఇస్తూనే తెలుసుకోవాలి అంటే ఇక చదవండి అని మొదలు పెడుతూ ఉంటారు. ఒక్కొక్క సారి ప్రేక్షకులని ప్రిపేర్ చెయ్యటానికి ముందుగానే హీరో కి ఫైట్ వచ్చినట్టు చూపించటానికి ఇంట్రడక్షన్ ఫైట్ పెట్టినట్టు, అలాగే ఏదైనా స్పెషల్ టాలెంట్ గురుంచి ఎస్టాబ్లిష్ చెయ్యటానికి కూడా ఈ టెక్నిక్ వాడుతూ ఉంటారు. తేజ మూవీస్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
Planting & Payoff : దీనికి పైన చెప్పుకున్న దానికి పెద్ద తేడా ఉండదు. ఇది ఒక రకమైన ఫోర్ షాడోయింగ్ టూల్. ఫోర్ షాడోయింగ్ లో మొత్తం ఓపెన్ గా చెప్పేస్తే, ప్లాంటింగ్ లో ప్రేక్షకులకి తెలిసి తెలియనట్టు, అదేదో ఇంపార్టెంట్ విషయం కాదు అన్నట్టు గా జరగాలి. అప్పుడు పే ఆఫ్ అందం గా ఉంటుంది. ఉదాహరణ కి నిజం సినిమా లో తండ్రి చావు బ్రతుకుల మద్య ఉన్న సీన్ లో, అర్ధ రాత్రి వర్షం లో హీరో సైకిల్ తొక్కుతూ పడిపోతే, ఆ సైకిల్ ని పక్కన దాచి పెట్టి, దాని పై కంపలు వేస్తాడు. హీరో క్యారెక్టర్ అలా ఎస్టాబ్లిష్ చెయ్యటం వలన ఆ సీన్ కి నవ్వుకుంటాం. ఒక పక్క తండ్రి పోతుంటే వీడి సైకిల్ గోల వీడిది అని. కానీ అదే సెకండ్ హాఫ్ లో సైకిల్ బయటికి తీసినప్పుడు చప్పట్లు కొట్టి విజిల్ వేసారు. చత్రపతి లో తమ్ముడు విసిరేసిన చెంబు, పీక్ ఫైట్ టైం లో ప్రభాస్ కి దొరకటం, వెంటనే ముసలావిడ డైలాగ్ అండ్ ధియేటర్ లో రెస్పాన్స్ గుర్తు తెచ్చుకోండి. అతడు లో తుపాకి లో ఉండి పోయిన గోలి గా ప్లాంట్ అయిన సీన్ క్లైమాక్స్ లో పే ఆఫ్ అయ్యింది. అత్తారింటికి దారేది లో కూడా నాకు ఇదంతా ముందే తెలుసు అని అత్త ఇచ్చిన వివరణ లో సంధర్భాలు అన్ని మన కళ్ళ ముందు లో జరిగినవే కదా? పెట్రోల్ కొట్టించ మంటే డబ్బులు అడగకుండా వెళ్లిపోవటం సీన్ ని ఫర్స్ట్ టైమ్ చూసినప్పుడు నోటీస్ చేసే వాళ్ళు ఎంత మంది ఉంటారు? అలా నోటీస్ చెయ్యకుండా ఉండటానికి ఇంపార్టెంట్ సీన్ లో సింపల్ గా కట్ చేశారు అదే సీడ్ అయ్యింది. ప్లాంటింగ్ ఎంత స్మూత్ గా జరిగిపోతే, జనాలు అంత త్వరగా మర్చిపోతారు, పే ఆఫ్ కి ఎక్సైట్ అవుతారు. అందుకే ప్లాంటింగ్ అండ్ పే ఆఫ్ మద్య దూరం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇదే టూల్ ని లాజిక్ కర్రెక్షన్ కి కూడా వాడుకోవచ్చు. సడన్ గా ఇలా ఎలా అయిపొయింది అని అనుమానం రాకుండా దాని గురుంచి ముందుగానే చెప్పేసో, చూపెట్టేసో, చెప్పించేసో లాగించెయ్యొచ్చు
ఇలాంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ చాలా ఉంటాయి, మన వరకు ఎక్కువ గా వాడుకునే వాటి గురుంచి చెప్పుకుంటే ఈజీ గా క్యాచ్ చెయ్యొచ్చు కదా అని ఇవి చెప్పటం జరిగింది. ఒక్కొక్క టూల్ కి ఉదాహరణలతో ఒక్కొక్క పోస్ట్ లా చెప్పుకోవచ్చు, కానీ నాకు దొరికే టైం కి అది ఎప్పటికి పూర్తి అవుతుంది అని చెప్పలేను అందుకే వాటి గురుంచి టూకీగా చెప్పటం జరిగింది.
మీరు చూసిన సినిమాలలో మీరు అబ్సర్వ్ చేసిన టూల్స్, వాటిని వాడిన విధానం, అది సినిమా కి ఎంత వరకు ఉపయోగ పడింది? దానికి వచ్చిన రెస్పాన్స్ వంటివి బేరీజు వేసుకోండి. ఎఫెక్టివ్ గా వాడటం ఎలాగో మన సినిమాల నుంచే నేర్చుకోండి :)
స్టొరీ లైన్, సినాప్సిస్, సీనిక్ ఆర్డర్ లాంటి విషయాలు టైం చూసుకొని నెక్స్ట్ పార్ట్ లో రాయటానికి ట్రై చేస్తాను.
6 comments:
thanks baa ila istune undu maaku helping hand laaga untadi :)
Simple ga effective ga explain chesaru sir. superb work
Adbutham adyakasha
Superb Raju Gary :-)
Series lo all posts adiripoyayi sir. next posts gurunchi waiting
Good one sir
Post a Comment