తండేల్ - కథ - కథనం - విశ్లేషణ




 తండేల్ - కథ - కథనం - విశ్లేషణ 


15 సంవత్సరాల కెరీర్ లో హిట్లు చూసాడు, డిసాస్టర్ లు చూసాడు నాగ చైతన్య, కానీ తన కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ల గలిగే బ్లాక్ బస్టర్ కోసం మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎంత సేపు మన కెరీర్ లో హైయెస్ట్ లు అని రికార్డ్స్ మాత్రమే కాదు ఎదో ఒక రోజు తన లీగ్ లో ఉన్న హీరోస్ లో ఆల్ టైం హైయెస్ట్ కొడతాడు అని ఫాన్స్ పెట్టుకున్న అంచనాలు అలాగే మిగిపోయాయి. తండేల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఆశలు చిగురించాయి. గీతా కాంపౌండ్ నుంచి, సాయి పల్లవి కాంబినేషన్, దేవి మ్యూజిక్, కార్తికేయ 2 తర్వాత చందు డైరెక్షన్, సారీ ఖచ్చితం గా మేజిక్ జరిగి తీరుతుంది అని ఫాన్స్ అందరూ నమ్మకాలు పెట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకుల దగ్గర నుంచి నెగటివిటీ ఎలాగూ లేదు కాబట్టి, పైన చెప్పుకున్న కారణాల వలన ఎలాగూ సినిమా చూస్తారు అనే అనిపించింది. కసి గా కొట్టాలి అనుకున్న ఫాన్స్ మనోభావాలు మాత్రం రిలీజ్ కి ముందర ఎలా ఉండేవి అంటే,

 

బుజ్జి తల్లి - హైలెస్సో హైలెస్సా పాటలు వచ్చి రాగానే హిట్,  హమ్మయ్య, కానీ వైరల్ అయ్యే రేంజ్ లో హిట్ అవ్వలేదే - ఎం పర్లేదు ఎం పర్లేదు సినిమా వచ్చాక ఇంకా ఎక్కేస్తాయి.

 

పండగ లాంటి సీజన్లో సినిమా పడి ఉంటె లెక్క వేరేలా ఉండేది ఏమో - ఎం పర్లేదు ఎం పర్లేదు మనకి సోలో రిలీజ్ అండ్ ఫిబ్రవరి లో హిట్ ఐన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి

 

 ట్రైలర్ లో కొంచెం దేశ భక్తి అని ఎదో మొదలెట్టినట్టు ఉన్నాడు ఏంటి ప్యూర్ లవ్ స్టోరీ కదా సినిమా - ఎం పర్లేదు ఎం పర్లేదు, ఆరు నూరైనా, నూరు కోట్ల క్లబ్ లో సారి చేరటం ఎవరు ఆపలేరు

 

ఎప్పుడు లేనిది ఫాన్స్ గురుంచి ఇంతలా రాయటం ఏంటి అనుకుంటున్నారేమో, సినిమా వరకు సాధారణ ప్రేక్షకుడి కంటే సినిమా హీరో గారు, అక్కినేని అభిమానులు పెట్టుకున్న అంచనాలే సోషల్ మీడియా లో అతి పెద్ద టాపిక్ అయింది కాబట్టి, మిగతా జనాల వరకు ఒక మీడియం రేంజ్ సినిమా వస్తుంది టాక్ వచ్చాక చూద్దాం అనే ధోరణే కనిపించింది కాబట్టి. ఏదైతేనేం అన్ని మంచి శకునములు మధ్య రిలీజ్ అయింది తండేల్, చాలా వరకు మంచి టాక్ తెచ్చుకుంది, దానికి తగ్గట్టుగానే మొదటి మూడు రోజుల కలెక్షన్స్ కూడా.. ఇది ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుంది అనేది మనకి ఇంకో మూడు రోజుల్లో తెలిసిపోతుంది కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ఎక్కడో ఒక మూల అసంతృప్తి. అసంతృప్తి కి కారణాలు విశ్లేషించుకొనే ప్రయత్నమే ఆర్టికల్.


"సినిమా చూడని వాళ్ళుచూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిదిఅని నా అభిప్రాయంఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు

 

కథ : తండేల్ అంటే నాయకుడు కాబట్టి, టైటిల్ పెట్టినందుకు, కథ ని " రాజు అనే ఒక తండేల్ తన తోటి మత్స్యకారులు తో పాటు పాకిస్థాన్ వారికీ దొరికి వాళ్ళ దగ్గర బందీ కాబడిన నేపథ్యం లో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల నుంచి స్ఫూర్తి పొందిన కథ" గా చెప్పుకోవాలి. తండేల్ వాళ్ళకోసం పాకిస్థాన్ లో ఎం చేసాడు, ఎలా నిలబడ్డాడు, బయటికి ఎలా తీసుకు రాగలిగాడు అనే సాహోసోపేతమై నాయకుడి కథ అనుకుంటే పొరపాటు. కానీ టైటిల్ అయితే అదే పెట్టారు కాబట్టి ఇది టైటిల్ పెట్టిన నేపథ్యం లో రాసుకున్న కథ అయితే, రాజు సత్య అనే ఇద్దరు ప్రేమికులు ఉన్నారు, వాళ్ళకి ఒకరు అంటే ఒకరికి ప్రాణం అని కథ మొదలు పెడితే చూసే వాళ్ళకి ఇంటరెస్ట్ ఏముంటుంది, మనం కథలోకి ఎలా వెళ్తాము, స్టార్టింగ్ కూర్చోబెట్టగానే టీవీ లో బ్రేకింగ్ న్యూస్, మన మత్స్యకారులు పాకిస్థాన్ వారికి దొరికారు, వాళ్ళని బంధించారు అని ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తే, అప్పుడు అయ్యో పాపం, ఎవరు వాళ్ళు, వాళ్ళ కథ ఏంటి అని వినటం మొదలు పెడతాం. కానీ టైటిల్ వరకే నాయకుడు, చెప్పాలి అనుకున్నది ప్రేమ కథ అయినప్పుడు, రాజు సత్య అనే ఇద్దరు ప్రేమికులు ఉన్నారు, వాళ్ళకి ఒకరు అంటే ఒకరికి ప్రాణం అని కథ మొదలు పెడితే చూసే వాళ్ళకి ఇంటరెస్ట్ ఏముంటుంది, మనం కథలోకి ఎలా వెళ్తాము, స్టార్టింగ్ కూర్చోబెట్టగానే హీరోయిన్ తో నాకు పెళ్లి చేసేయ్ డాడీ అంటే, ఇదేంటిది ఇంత మాట అనేసింది, ఏమైందబ్బా అని ఒక ఇంటరెస్ట్ కలిగించేలా స్టార్ట్ చెయ్యొచ్చు, ఆలా స్టార్ట్ చేసినప్పుడు - మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలవటం క్లైమాక్స్ అయినప్పుడు, మధ్య లో ఎంత సేపు ఏమేమి ఉండాలి ?  అప్పుడు తండేల్ అనే టైటిల్ పెట్టొచ్చా ? 

 

కథ : సత్య - రాజు ఒకరంటే ఒకరికి ప్రాణం, రాజు తండేల్ గా ఎదుగుతాడు, సముద్రం లో వేట కి వెళ్తే ఏమైనా ప్రమాదం జరగొచ్చు అనే భయం తో నువ్వు వెళ్ళకు మనం పెళ్లి చేసుకుందాం అని సత్య అడుగుతుంది - చిన్నప్పటి నుంచి చేస్తున్న పని ఇది, నాకేటి కాదు అని వినకుండా రాజు వెళ్ళిపోతాడు. వద్దు అని చెప్పినా / వెళ్ళను అని మాట ఇచ్చి కూడా వెళ్ళిపోయాడు కాబట్టి నాకు వీడు వద్దు అని వేరే పెళ్ళికి సిద్ధం అవుతుంది సత్య. అలా వెళ్లిన వాడు తన టీం తో సహా పాకిస్థాన్ వాళ్ళ బందీ అవుతాడు. తర్వాత ఏమైంది? కథ అక్కడి వరకే కుదిరింది, తర్వాత ఎటు తీసుకెళ్లాలి అనే దగ్గరే కన్ఫ్యూషన్ అంతా మొదలైంది, ఒరిజినల్ నుంచి బయటికి రాలేము, రాసుకున్న ప్రేమకథ కి న్యాయం చేయలేము. పెద్ద చిక్కుముడి పడిపోయింది. ఎలా అని కథనం లో చూద్దాం.


కథనం : మిడిల్ : కథని హుక్ పాయింట్ కోసం అని మిడిల్ నుంచి మొదలుపెట్టారు కానీ, అది అవసరం లేదు. ఇది మా సినిమా కథ అని ఆల్రెడీ ట్రైలర్ లో చెప్పేసారు. సినిమా ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకులని కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు మరి అలాంటప్పుడు అనగనగా ఒక ఊరు అని మొదలు పెట్టేసినా పర్లేదు, టైమింగ్ పరంగా ఎక్కడ ఉండాల్సిన ప్లాట్ పాయింట్స్ అక్కడ ఉండేవి. స్టార్ట్ చెయ్యటమే విడిపోవటం తో స్టార్ట్ చేసారు. తాను చెప్పిన వినకుండా వెళ్లిపోయిన రాజు మీద కోపం, తనలోని బాధ / భయం తో వేరే పెళ్ళికి రెడీ అవుతుంది సత్య. పెళ్ళికొడుకు కి తన గతం చెప్పటం తో అసలు కథ మొదలవుతుంది.


కథనం : ప్రారంభం : మంచి జీవనోపాధి కోసం తరతరాలుగా సంవత్సరం లో 9 నెలలు శ్రీకాకుళం నుంచి గుజరాత్ కి వెళ్లే మత్స్యకారులు గ్రూప్ లో రాజు ఒకడు. మిగతా మూడు నెలలు మాత్రమే ఫామిలీ తో కలిసి ఉండే వాళ్ళకి మిగతా టైం లో నెలకి ఒక సారి సిగ్నల్ దొరికినప్పుడు మాత్రమే ఫోన్ మాట్లాడుకునే అవకాశం. ఇవన్నీ కుటుంబాలకి, ఊరిలో వాళ్ళ కోసం ఎదురు చూసే వాళ్ళకే అలవాటు అయిన జీవితం. ఒక ఫోన్ కాల్ తో వీళ్ళమధ్య ప్రేమని మనకి పరిచయం చేస్తూ ఒక ఫైట్ తో హీరో ఇంట్రో. ఇక్కడ హీరో ఫైట్ చెయ్యకపోయినా వచ్చిన నష్టం లేదు, కానీ హీరోయిజం ఉండాలి కాబట్టి తండేల్ కాబట్టి ఫైట్. వెంటనే సాంగ్. చిన్నపాటి నుంచి ఎడబాటుతో సాగిన వీళ్ళ ప్రేమ. అలా వేట నుంచి ఒక సారి ఊరికి వచ్చిన రాజు, పక్క ఊరిలో అక్రమంగా జరగుతున్న ఇసక తవ్వకాల మాఫియా కి ఎదురు తిరిగి రాజు - తండేల్ అవుతాడు. ఒక ఫైట్ - ఒక పాట.  మళ్ళీ వేటకి వెళ్తాడు రాజు - కాక పోతే సారి తండేల్ గా.


 

కథనం: మలుపు : సంఘర్షణ కి దారి తీసే పరిణామం: ఊరిలో రాజు ఆలోచనలతో ఉన్న సత్య కి - వేటకి వెళ్లిన వేరొకరి చావుతో - భవిష్యత్ తో తన పరిస్థితి ఏంటి అని తలచుకొని ఒక భయం మొదలవుతుంది. ఒకసారి తన తండ్రి వేటకి వెళ్ళినప్పుడు, తిరిగొచ్చేసరికి తల్లి చనిపోతే కనీసం చివరి చూపుకి కూడా నోచుకోలేదని కూతురి కోసం వేట మానేసి ఇక్కడే ఉండిపోవటం గురుంచి తెలుసుకొని బాధ పడుతుంది. ఎప్పుడు నెల తిరిగే సరికి కాల్ చేసే రాజు నుంచి కాల్ రావటం ఈ సారి లేట్ అవుతుంది, ఒక పక్క బాధ ఇంకోపక్క అక్కడ ఏమైందో అనే బెంగ తో సత్య ఒక నిర్ణయం తీసుకుంటుంది.


సమస్యాత్మకం :  ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మధ్య మధ్య లో హింట్స్ ఇస్తుంది కానీ ఆ విషయాల్ని అంత సీరియస్ గా పట్టించుకోడు రాజు. మొత్తం మీద ఇంకా టైం అంత అయిపోయాక "వేటకి వెళ్లొద్దు రాజు" అంటుంది. నువ్వు అనవసరంగా బెంగెట్టుకోకు నాకేటి కాదు అని లైట్ తీసుకోమంటాడు. అయినా వినకపోయేసరికి సరే నేను వెళ్ళను అని మాట ఇస్తాడు. కానీ మాట తప్పుతాడు. బయలుదేరడానికి సిద్ధం గా ఉన్న రాజు ని రైల్వే స్టేషన్ లో నిలదీస్తుంది. తండేల్ ని నేనే ఎల్లకపోతే ఎలాగా ? రాగానే మన పెళ్లి అంటాడు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నన్ను మర్చిపో అంటుంది సత్య. తనని నమ్ముకున్న వాళ్ళ కోసం వేటకి వెళ్ళటానికి డిసైడ్ అవుతాడు రాజు. తండేల్ కాబట్టి అలాగే డిసైడ్ అవ్వాలి. ఇంత చెప్పినా కూడా నా మాట వినలేదు అని ఫీల్ అవుతుంది సత్య. తన స్టోరీ ఏ కాబట్టి తాను అలాగే ఫీల్ అవ్వాలి. ఇదే మనం సినిమా స్టార్టింగ్ లో చూసిన మిడిల్ ప్రారంభం. వెళ్లిన దగ్గర నుంచి ఎప్పుడు సిగ్నల్ దొరికితే అప్పుడు మాట్లాడటానికి రాజు కాల్ చేస్తూ ఉంటాడు, సత్య స్పందించదు. పంతానికి పోతుంది. 


కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే ; వేటకి వెళ్లకుండా రాజు ఉండలేడు, వాడు వెళ్తే వాడికి ఏమవుతుందో అని భయం తో సత్య బ్రతకలేదు. అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ని క్రియేట్ చేసుకోవటం కోసం పాత్రల స్వభావాలు మార్చేసి ఔచిత్యమ్ దెబ్బతినేలా చేసారు. అంతలా ప్రేమించిన రాజు అసలు మాట ఇవ్వటం ఎందుకు, అది ఇచ్చిన తర్వాత తప్పించుకొని పారిపోవటం ఎందుకు? తండేల్ గా తన టీమ్ ఎంత ముఖ్యమో తాను ప్రేమించిన సత్య సంతోషం కూడా అంతే ముఖ్యం కదా? మూడు నెలలు తనతో ముభావంగా ఉన్న సత్య ఇది కారణం అని చెప్పిన తర్వాత తనకి తప్పుడు ప్రమాణం చేసి మాట తప్పటం ఏంటి? అలంటి వాడి కోసం అసలు తను ఎందుకు ఎదురు చూడాలి ? ఈ సరి వచ్చి రాగానే మన పెళ్లి అంటాడు కానీ మాటిచ్చేసాను ఇదే లాస్ట్ వేట అని ఉంటె తను కూడా ఎదురు చూసేది కదా? అప్పుడు కదా తనలోని ప్రేమికుడు మనల్ని కదిలించగలడు. అప్పుడు కదా ఆ పాత్ర కి ఒక గోల్ ఏర్పాటు అవుతుంది, అదేం లేకుండా నీ పాట్లు నువ్వు పడు అని వదిలేసి పారిపోవటం అంటే జీవితం లో బాధ్యతల నుంచి పారిపోవటం కూడా. సరే పోనీ సత్య పాత్ర ఏమైనా ఉత్తమంగా తీర్చిదిద్ద బడిందా అంటే? తన తండ్రి అంత క్లియర్ గా చెప్పిన తర్వాత మరి రాజు విషయం లో నన్ను ఎందుకు ఆపలేదు అని అడిగినప్పుడు ఆ తండ్రి అది నీ ఇష్టానికి వదిలేసాను అంటాడు. మరి అలాంటి తండ్రి కోసం తను ఎం చేసింది? అసలు అప్పటి వరకు సత్య కి తన తల్లి ఎలా చనిపోయిందో ఆ టైం లో నాన్న పరిష్టితి ఏంటో తెలియకుండా ఎందుకు ఉంది? చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద అయ్యే వరకు ఎన్ని చావులు చూసి ఉంటుంది, అయినా కూడా రిస్క్ గురుంచి తెలిసి కూడా రాజు ని ప్రేమించింది, విరహాన్ని అస్వాధించింది తప్ప తండ్రి గురుంచి ఎందుకు ఆలోచించలేక పోయింది. తండ్రి కోసం వేరే పెళ్ళికి రెడీ అయ్యింది, మరి ఆ తండ్రి గౌరవానికి తగ్గట్టుగా ప్రవర్తించిందా ? దాని గురుంచి లాస్ట్ లో చెప్పుకుందాం. ఏది ఏమైనా కూడా అప్పటి వరకు మనం సత్య తో నే ఏకీభవిస్తాం  మనం కూడా ప్రేమ కథని ఆస్వాదించే మూడ్ లో ఉంటాం కాబట్టి ఇవ్వన్నీ ఆలోచించం. ఆడు వేరే పని ఏదైనా చేసుకొని తనతోనే ఉండిపోతే బావుణ్ణు అని. అదే రాజు కి కూడా అనిపించి తల్లిని సత్య ని చూసుకొటమే నాకు ముఖ్యం ఇదే నా లాస్ట్ వేట ఇంక మళ్ళీ రాను అనిపించి ఉండాల్సింది. అప్పుడు కథ ప్రేమ వైపు సైడ్ తీసుకునేది. అలా వచ్ఛేద్దాం అనుకునే వాడు ఎక్కడో బంధీ అయిపోయాడు అంటే అప్పుడు భావోద్వేగాలు వేరేలా ఉండేవి. పోనీ రాజు కాల్ ఆన్సర్ చేసి లేదంటే రాజు కి ఒక మెసేజ్ చేసి  తాను చెప్పాలి అనుకున్నవి చెప్పేసి అప్పుడు పెళ్ళికి రెడీ అయిపోయి ఉంటె, ఆ విషయం పాకిస్థాన్ లో సిగ్నల్ వచ్చాక రాజు కి తెలిసి ఉంటె, మళ్ళీ అర్జెంటు గా వెనక్కి వెళ్ళిపోవాలి లేదంటే సత్య కి దూరం అయిపోతాను అనే భయం తో కథ రాజు సైడ్ నుంచి ఉండి ఉండేది ఇక్కడ ఆ అవకాశం కూడా లేకుండా చేసారు. వర్షం పడిన ఆ రాత్రి - ఇంటర్నేషనల్ బోర్డర్స్ క్రాస్ చేసిన నేరానికి రాజు అండ్ అతని బృదం మొత్తం పాకిస్థాన్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు - ఇంటర్వెల్.


ఫస్ట్ హాఫ్ వరకు సాయి పల్లవి తో మనం ట్రావెల్ చేస్తూ ఉండటం వలన సంతృప్తికరమైన ఫీలింగ్ తో నే ఉంటాం. పాపం తాను బాధ పడినట్టే అయ్యింది, చెప్తే వినలేదు వాడు, విని ఉంటె ఎంత బావుండేది వరకు సరే, కానీ ఈమె వేరే వాడితో పెళ్ళికి రెడీ అయిపోవటం మాత్రం ఒక మూలాన కొంచెం లాగుతూ ఉంటుంది. బలవంతంగా వేరే పెళ్లి చెయ్యటం వేరు ఎందుకంటే అక్కడ కూడా మనం తన స్థితి కి జాలి పడతాము కానీ తనంతట తానే అలా డిసైడ్ అవ్వటం, ఆ పెళ్లి అనేది కథనం కి ఒక థ్రెట్ కాకపోవటం తో ఆ తర్వాత తర్వాత స్క్రీన్ ప్లే అతలాకుతం అయ్యిపోయింది. రాజు యాక్షన్ ఎపిసోడ్స్ బదులు వీళ్లిద్దరి లవ్ ఎపిసోడ్స్ ఇంకా డెప్త్ ఉండేలా రాసుకుంటే బావుంటుంది అనిపిస్తుంది. 9  నెలలు సముద్రం మీద, మూడు నెలలు ఊరిలో కూడా 5 - 10  నిమిషాల పాటలతో లాగేసారు, వాళ్ళతో ట్రావెల్ చేసే టైం ని తగ్గించేశారు. 

 

ఇది కొంచెం ఈ మధ్యనే చూసిన అమరన్ కి దగ్గర్లో ఉండే కథలా అనిపిస్తుంది. ఆర్మీ మీద ప్రేమతో ఆఫీసర్ అవ్వాలన్న హీరో, అది ఎంత కష్టమైన విషయం అని తెలిసి కూడా అతని ఇష్టం ని అతనిమీద ప్రేమతో వెనక ఉండి నడిపించే భార్య, సెలవులకి మాత్రమే కలవటం, మిగతా టైం లో దిన దిన గండం. అక్కడ ఇంట్లో వాళ్ళు వద్దు అంటుంటే వాళ్ళతో పోరాడిన సాయి పల్లవి ని చూసిన మనం ఇక్కడ సెల్ఫిష్ గా ఫిషింగ్ వద్దు అని మారిపోయిన పల్లవి ని చూస్తాం. ఆ ప్రేమ లో నిజాయితీ ఉంది, ఇక్కడ స్వార్ధం ఉంది. అక్కడ దేశభక్తి ఉంది, ఇక్కడ .................. సెకండ్ హాఫ్ ఉంది. అమరన్ సినిమా దేశభక్తి - పాకిస్థాన్ ఎపిసోడ్స్ వలన ఆడేసింది అని ఎవరైనా అనుకోని ఉంటె అది పొరపాటు, అదొక క్యూట్ లవ్ స్టోరీ. ఇక్కడ కూడా ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, ఇంకా ....... సెకండ్ హాఫ్ ఉంది.

 

సెకండ్ హాఫ్ : సమస్యాత్మకం : ఒకే సారి హీరో పాత్ర, హీరోయిన్ పాత్ర పాసివ్ మోడ్ లోకి వెళ్లిపోయిన సందర్భం ఆ ఇంటర్వెల్ అన్నది. రాజు ఉన్న సిట్యుయేషన్ నుంచి బయటికి రావటానికి తను ఎం చెయ్యలేడు, లెటర్స్ రాయటం తప్ప, అది తన చేతుల్లో  లేదు అక్కడితో తండేల్ పాత్ర పాసివ్ అయిపోయింది. పోనీ సత్య ఏమైనా చేయగలదా? గవర్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే తప్ప తన చేతుల్లో కూడా ఏమి లేదు, ఇలా తన పాత్ర పాసివ్ అయిపోయింది. డాకు మహారాజ్ లో గ్రామం లో జనాలు ఇంజనీర్ సీతారాం కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చెయ్యటమే ఏమో ఇంక ఈ ఊరి జనాలు కూడా. పేరు తండేల్ కాబట్టి ఆ పాత్ర తన సమస్య కి పరిష్కారం సాధించుకోవాలి, పోనీ సత్య లవ్ స్టోరీ కాబట్టి తాను అయినా పరిష్కారం సాధించేదిలా ఉండాలి, ఈ సమస్య కి పరిష్కారం సాధించటం రెండు పాత్రల పరిధి లో లేనప్పుడు కథ ముందుకి ఎలా వెళ్తుంది? అసలు ఆ గవర్మెంట్ యాక్షన్ తీసుకునే వరకు ఎం జరిగింది మధ్యలో? రియల్ లైఫ్ లో అయితే 13 నెలలు జైలు లో ఉండాల్సి వచ్చింది. డైరెక్ట్ గా 13 నెలల తర్వాత అని ఒక టీవీ లో న్యూస్ చూపించి వాళ్ళని వదిలేసి ఉంటె అయిపోయేది కదా అనిపించేలా సాగుతుంది ఈ పాకిస్థాన్ ఎపిసోడ్ మొత్తం. అది పాకిస్థాన్ ఐన అండమాన్ అయినా ఆ దొరికిన సందర్భం ని "ప్రేమ" ని రక్తి కట్టించటానికి వాడుకొని ఉంటె డ్రామా కలిసొచ్చేది. దేశభక్తి జెండా ఎత్తుకుంటే మాత్రం, మాకేంటి ఈ నస అనేలా చేస్తుంది. ఈ మధ్యలో గుజరాత్ వెళ్లి సేటు దగ్గర డబ్బులు తెచ్చుకోవటం లాంటి మౌన పోరాటాలు ఉన్నా కూడా అవి ఎలివేట్ అవ్వలేక పోవటానికి కారణం జైలు ఎపిసోడ్స్. ఆ జైలు ఎపిసోడ్స్ ద్వారా రాజు పాత్ర మీద సింపతీ క్రియేట్ చేయగలగాలి, కానీ టైటిల్ తండేల్ కాబట్టి హీరోయిజం పెంచాలి అనుకున్నారు. ఫైట్ లు డాన్స్ లు కాశ్మీరీ కలహాలు అని గతి తప్పారు.

 

జరుగుతున్న పరిణామాల మధ్య రెండు పాసివ్ పాత్రలు అయిపోవటం వలన చూస్తూ ఉండటం తప్ప ఏమి చెయ్యలేవు, రోజా సినిమాలో మధుబాల గారు చేసిన ప్రయత్నాలు అయినా గుర్తు తెచ్చుకొని అటువైపు నడిపించి ఉండాల్సింది, కానీ ఇక్కడేమో, ఆడు రిలీజ్ అయిపోతాడు అవ్వగానే ఇంకొకడితో నా పెళ్లి అని సత్య వెయిట్ చెయ్యాల్సిన పరిస్థితి కలిగించారు. ఈ సినిమా వరకు సాయి పల్లవి ని నాగ చైతన్య డామినెటే చేసి పడేసాడు అని తొడలు కొట్టడం అంటే, అది సాయి పల్లవి పాత్ర చిత్రణ లో లోపమే కానీ నటనలో కాదు అని గమనించాల్సింది గా మనవి. వాళ్ళు ఎప్పుడు విడుదల అవుతారు, వీళ్ళు ఎప్పుడు కలుస్తారు, ఆ తర్వాత ఎంత హ్యాపీ గా ఉంటారు అని ఎదురు చూడాల్సిన ప్రేక్షకులు, హీరోయిన్ కి తన ఇష్టం మీద సెట్ అయిన పెళ్లి ఏదైతే ఉందొ అది కుదురుగా కుర్చోనివ్వదు. సరేలే ఫైనల్ ఆ కలిసేది వీళ్ళే అనే విషయం తెలుగు సినిమా ప్రేక్షకులుగా మనకి తెలుసు కాబట్టి ఆ ముగింపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం.


ముగింపు: అంతకు ముందు ఫోన్ కాల్ తో తీసుకొచ్చిన లవ్ ఫీల్ తో మళ్ళీ హీరోయిన్ మనసు మారుతుంది అనుకుంటే, పెళ్లి బట్టల్తో వెళ్లి మినిస్టరుగారిని కలిసాక విడుదల డిసైడ్ అవుతుంది.  ఇంకేముంది హీరో వచ్చేస్తాడు సత్య పెళ్లి భోజనం తింటాడు అని ఎదురు చూస్తున్న మనకి ఒక ట్విస్ట్. ఒక వేళ హీరో రాకపోతే పెళ్లి జరిగిపోయేది ఏమో ? ఇంతకంటే దారుణమైన టెన్షన్ థ్రిల్లర్ మూవీస్ లో కూడా ఉండదు. రాజు కి కూడా తెలిసిపోతుంది సత్య కి పెళ్లి అని, ఇంతలో సడన్ గా టైటిల్ తండేల్ అని గుర్తుకొచ్చి, దానికి ఎలివేషన్ ఇచేలా ఒక సీన్. పెళ్లి అయిపోతే అయిపోని నేను తండేల్ అంటాడు. కన్వీనియెంట్ గా రాసేసుకుని, పాత్రల భావోద్వేగాలు - ప్రేక్షకుల అభిరుచులు పక్కన పెట్టి, కేవలం పాత్రల పెరఫార్మన్సెస్ వలన నిలబడిన క్లైమాక్స్ కొంత లో కొంత ఉపశమనం. సరే నీ రాజు వచేసాడు కదా, నువ్వు చెప్తాను అన్నవి చెప్పేసి ఎలిపొచ్చే మనం పెళ్లి చేసుకుందాం అని అక్కడ పెళ్లి కొడుకు అడిగి ఉంటె ఎం చేసేది సత్య ? తన తండ్రి కోసం వేరే పెళ్ళికి ఒప్పుకున్నా సత్య మరి అదే తండ్రి కి ఇంత అవమానం చేసి మళ్ళీ రాజు ని చేసుకోటం ఏంటి? ఇప్పుడు ఇంతకీ తండేల్ రాజు వేట మానేశాడా ? లేక సత్య భయం పోయిందా ? ఇంటర్వెల్ ముందు ఏదైతే కాన్ఫ్లిక్ట్ అన్నారో దానికి రెసొల్యూషను ఏమైనట్టు? క్లైమాక్స్ లో మేడ మీద కూర్చొని మాట్లాడుకునే సీన్ మనం మొట్ట మొదటికి సారి వాళ్ళని అక్కడ కూర్చున్నప్పుడు చూసిన సీన్ ఏ, అక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టారు అంతే. అది అక్కడే బావుండేది ఏమో, ఇక్కడ మాకు ఫైనల్ జస్టిఫికేషన్ ఇచ్చి ఉంటె ఇంకా బావుండేది ఏమో. పుష్ప రాజు గా ఎదిగిన బన్నీ ని ఆరాధించే శ్రీ వెళ్లి లాగ, నాకు కాబోయే వాడు తండేల్ అని సత్య కూడా గౌరవంగా నిలబడితే, రాజు పక్కన నిలబడ్డ సత్యగా పవర్ఫుల్ అయ్యేది, ఆ పాత్ర కి హుందాతనం కూడా వచ్చేది, అంతే కానీ లాస్ట్ మినిట్ వరకు వేరే వాడికి పెళ్లి మాత్రం నీతోనే అనే ఆశ కలిగించి ఊరించి ఉడికించి చులకన అయ్యేది కాదు. మళ్ళీ ఆ పాత్ర తో రాజు మీద ప్రేమ చచ్చిపోయింది - భయం దానిని చంపేసింది అనే టైపు లో ఎదో డైలాగ్ కూడా చెప్పించినట్టు గుర్తు. 


 

చివరిగా: మంచి భావోద్వేగాలు పండించగల నేపథ్యం ఉన్న కథే అయినా కూడా ఇలాంటి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవటం లో దర్శకత్వ ప్రతిభ లోపించినట్టు అనిపించింది. తెరమీద పాత్రల ఫీలింగ్స్ అక్కడే ఆగిపోతాయి, దాటి ముందుకివచ్చి మనసుని కూడా హత్తుకునేలా ఉంటె ఇంకా బావుండేది. ఫస్ట్ హాఫ్ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్న సినిమా సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది. ప్రేమ కథని పూర్తి స్థాయి ప్రేమ కథ కింద తీసి ఉంటె చూడ ముచ్చటగా ఉండేది. పేరు తండేల్ అని రాజు గురుంచే అయినా, కథ సత్య ది, బాధ సత్య ది, తాపత్రయం సత్య ది పోరాటం సత్య ది అందుకే సినిమా వరకు తండేల్ అని పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఆలోచించాల్సిన విషయం. 


ఈ సినిమాకి, ఈ విశ్లేషణ కి, ఈ పోస్టర్ కి సంభందం ఇల్లే అని ఎవరికైనా అనిపిస్తే.  ఇంటర్వెల్ కి ముందు తన తండేల్ రాజు సాహసోపేతమైన ఎపిసోడ్ లో పాకిస్థానీ మత్స్యకారులు ని కాపాడతాడు, మరి అక్కడ కోర్ట్ లో అలాంటిది ఒకటి జరిగింది అని, కావాలంటే వాళ్ళని పిలిచి అడగండి అని, కనీసం సాయం పొందిన వాళ్ళు అయినా సాక్ష్యం చెపుదాం అని, వాళ్ళని చెప్పనివ్వలేదు అని కానీ ఎందుకు ఎక్స్టెండ్ చెయ్యకుండా వదిలేసారు? ఒరిజినల్ గా జరగలేదు కాబట్టి దానిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని తెలియలేదా? కనీసం ఒక డైలాగ్ రూపంలో అయినా రిఫరెన్స్ లేని దానికి అంత పెద్ద ఎపిసోడ్ ఎందుకు పెట్టినట్టు? కనీసం దానిని కొంత అయినా గౌరవించుకుందాం అని ఈ పోస్ట్ కి పోస్టర్ గా పెట్టడం జరిగింది.



0 comments:

 

Labels

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views