లయన్ - సరదా సమీక్ష
లెజెండ్ సినిమా తో అద్బుత విజయం సొంతం చేసుకున్న బాలయ్య ఆ తర్వాత రాజకీయాల్లో కూడా విజయ కేతనం ఎగరేసారు. నందమూరి నామ సంవత్సరం అని ముందుగానే నామకరణం చేసి అటు అబ్బాయిలు వరుస అపజయాల నుంచి బయటికి వచ్చేసారు, బాబాయి కూడా వరస విజయాలతో దూసుకుపోతారు అని ఆశించారు. ఇలాంటి సందర్భం లో లయన్ లాంటి పవర్ఫుల్ టైటిల్ తో సినిమా వస్తుంది అంటే అభిమానుల సందడి ఎలా ఉండబోతుంది అని ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం ఊపు ఉన్నా కూడా ఆ తర్వాత వచ్చిన ట్రైలర్స్ అండ్ సాంగ్స్ కి కొంచెం అంచనాలు నార్మల్ అయిపోయాయి అని చెప్పుకోవచ్చు. ఏదైనా సమ్మర్ లో వచ్చిన పెద్ద సినిమా కాబట్టి రిలీజ్ రోజు అంచనాలకి మించి ఆదరణ లభించింది. కమర్షియల్ గా ఎక్కడ ఉండబోతుంది అని ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది (ఆల్రెడీ తేలిపోయింది అంటారా?) కాబట్టి, సినిమా పరం గా ఎలా ఉంది అని మాట్లాడుకుందాం.
రెగ్యులర్ గా వ్రాసే కథ కథనం విశ్లేషణ నుంచి బ్రేక్ తీసుకుంటూ రాస్తున్న సరదా ప్రయత్నం
కథ : ఒక సిన్సియర్ C.B.I ఆఫీసర్ అయిన బోస్, ఒక ఇంపార్టెంట్ కేసు సాల్వ్ చేస్తే తన ఉనికి కే ప్రమాదం అని, వృత్తి పరం గా తనని ఏమి చెయ్యలేక విలన్ చావు దెబ్బ కొడితే, అసలు విషయం తెలుసుకొని విలన్ నిజస్వరూపం ని ఎలా భయట పెట్టాడు అనేది కథ. అసలు ఇలా కథ చెప్తే ఎవడు అయినా ఎలా వొప్పుకుంటారు అందుకే ఇలా చెప్పి ఉండవచ్చు. 18 నెలలు కోమా లో ఉండి చనిపోయాడు అనుకున్న బోస్ లేచి వస్తే, అందరు తనని గాడ్సే అంటారు, తల్లి తండ్రులు, భార్య, కంపెనీ అన్ని తను గాడ్సే ఏ అని నమ్మేలా చేస్తాయి, అయినా సరే తను బోస్ ఏ అని నమ్మి నిజం అన్వేషణ కోసం హైదరాబాద్ వెళ్తాడు, అక్కడ తను పేరెంట్స్ అని నమ్మే వాళ్ళు, ప్రేయసి కూడా తనని నమ్మరు, ఆఖరికి DNA టెస్ట్ కూడా తను గాడ్సే ఏ అని చెప్తుంది. మనసు చెప్తునట్టు తను బోస్ ఆ? జనాలు చెప్తున్నట్టు తను గాడ్సే ఆ? ఒక వేల గాడ్సే అయితే బోస్ అని ఎందుకు ఫీల్ అవుతున్నాడు, నిజం గా బోస్ అయితే మరి ఇంత మంది చెప్తున్నా గాడ్సే ఎవరు?. అసలు నిజం ఏమిటి? అది తెలుసుకున్నాక శత్రువులపై సింహం (లయన్) లా ఎలా జూలు విదిలించాడు అనేది బాలన్స్. ఒక కొత్త దర్శకుడు, అది కూడా చాలా ఇయర్స్ గా అవకాశం కోసం వెయిట్ చేస్తున్న దర్శకుడు ఇదే కథ చెప్తే "ఎలా తీస్తాడో" అని అలోచించుకోవటం అనేది కామన్, మరి అంత నమ్మకం పెట్టి సినిమా అప్పచేప్తే దర్శకుడు ఎం చేసాడు ?
ఇప్పుడు టైం ఎంత అయ్యింది
కథనం - అననగానగా ఒక హాస్పిటల్, అందులో ఒక మార్చురీ, అందులో బోలెడు డెడ్ బాడీస్, బయట ఉరుములు మెరుపులు వాన, కరెంటు లేదు, ఇంతలో ఒక ఎలుక, చీకటిని చీల్చుకుంటూ ఒక బెడ్ ఎక్కి శవం కాలు కొరికితే, ఆ శవం కి ప్రాణం వచ్చి అది బాల కృష్ణ అని మనకి తెలిస్తే? డాక్టర్ చెప్పినట్టు ఇది మెడికల్ మిరాకిల్ కాదు తెలుగు సినిమా చరిత్ర లో నే మిరాకిల్ - విజయేంద్ర వర్మ లో కొండమీద ఎక్కుతూ బద్ధకం గా చేతులు విరుచుకునే దానికంటే మిరాకిల్. ఇదే స్టార్టింగ్ సీన్ అని చెప్పినప్పుడు కానీ, అది తీస్తున్నప్పుడు కాని దాని విలువ ని అంచనా వెయ్యక పోవటం ఒక ఎత్తు అయితే, సీన్ ఏమైనా, ఎలా తీసినా తన వంతు గా చిత్తశుద్ధి తో నటించటం బాలయ్య కి కొత్త కాదు. ఇంతకు ముందు, అల్లరి పిడుగు లో, విజయేంద్ర వర్మ లో, పరమ వీర చక్ర లో ఇంకా చాలా సినిమాల్లో అయన పెర్ఫార్మన్స్ లో డెడికేషన్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అది చాలా మందికి కామెడీ గా అనిపిస్తుంది కానీ నా లాంటి కొంత మందికే ఆ డెడికేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్కడ నుంచి ఎటు వెళ్ళిపోతున్నాం, ఎక్కడ ఉన్నాం మనం, ఓహ్ , ఎలుక కరిచిన దగ్గర, నిజం గా కరిచిందా అని అడగకండి, నెక్స్ట్ సీన్ లో ఆ గాయం కూడా ఉండదు, కరిచింది - లేచాడు, మిరాకిల్ అంతే.
బాల కృష్ణ ని తను బోస్ గా గతం గుర్తుకు వస్తూ ఉంటుంది, ఇంతలో తన పేరెంట్స్ అండ్ డాక్టర్స్ అందరు గాడ్సే అంటూ ఉంటారు. అర్ధం కాని అమాయకత్వం లో తను గాడ్సే ఏ నా అని చెక్ చేసుకుందాం అని ఆ రోజు రాత్రే బయటికి వచ్చేస్తాడు. ATM లో డబ్బులు డ్రా చేస్తాడు, తను పని చేస్తున్నా అనే కంపెనీ కి కూడా వెళ్తాడు, అందరు తను గాడ్సే ఏ అంటారు. అయినా తను బోస్ ఏ అని నమ్మి, హైదరాబాద్ బయల్దెరతాడు. అమ్మాయిల గురుంచి లెక్చర్ ఇచ్చి ఫైట్ చేసి డాన్సు కూడా చేస్తాడు. హైదరాబాద్ వెళ్లి తన ఇంటికి వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది - బాల కృష్ణ కి కాదు - మనకి, నిజం ఏంటి అంటే బోస్ / గాడ్సే పుట్టింది 1980 లో అని. ఇంతలో రోడ్ మీద తన లవర్ కనిపిస్తుంది, వెళ్లి హాయ్ అంటే, ఎవరు నువ్వు అంటుంది. గుణ సినిమా లో కమల్ విగ్ టైపు గెట్ అప్ లో ఉన్న బాల అమాయకత్వం తో కూడిన అసహాయ తనం తో, తన లవ్ స్టొరీ చెప్తాడు. అప్పటి వరకు ఉన్న థ్రిల్లింగ్ థ్రెడ్ కాస్త లవ్ థ్రెడ్ గా మారుతుంది. విగ్ మారుతుంది, డ్రెస్సింగ్ మారుతుంది, టైమింగ్ మారుతుంది, ప్రేక్షకులు కూడా ఆ థ్రిల్లింగ్ ఈ బెటర్ అని ఫీల్ అయ్యేలా లవ్ థ్రెడ్ ఉంటుంది. కట్ చేస్తే తను పేరెంట్స్ అనుకుంటున్న వాళ్ళు కూడా తను ఎవరో తెలియదు అంటారు. లవర్, ఇల్లు, పేరెంట్స్ ట్రై చేసినట్టే ఆఫీసు కూడా ట్రై చేస్తాడు ఏమో అని మనం అనుకుంటాం, కాని ఫ్లాష్ బ్యాక్ మీద లో రొమాంటిక్ కామెడీ మీద ఉన్న శ్రద్ధ వలన ఈ విషయం మర్చిపోతాం. పోలీస్ సెట్టిల్మేంట్, DNA టెస్ట్, రిజల్ట్ మళ్లీ గాడ్సే. నా తప్పు తెలుసుకున్నాను, ఇంత మంది చెప్తున్నారు కాబట్టి నేను గాడ్సే ఏ, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని బాలయ్య అన్నప్పుడు మనం కూడా తప్పు తెలుసుకొని ఇంటికి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది, కాని సీట్ నుంచి గేటు కి వెళ్ళే లోపు మంచి సన్నివేశం పడుతుంది. అసలు విషయం తెలిసే సీన్ ని బాగానే స్టార్ట్ చేసినా, అతిగా చేసిన ఫైట్ అండ్ ప్రకాష్ రాజ్ తో వచ్చే డైలాగ్ లో పస లేక మళ్లీ చల్లబడిపోతుంది. కానీ అప్పటి వరకు సినిమా లో ఉన్న ఫ్లో లో ఒక షిఫ్ట్ వస్తుంది, సెకండ్ హాఫ్ అయినా ఏమైనా ఉండక పోదా అని ఆశ కలుగుతుంది.
ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో బెటర్ సీన్స్ రాసుకున్నారు, కాని ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ వరకు లాగటం వలన సెకండ్ హాఫ్ ఎం జరుగుతుంది అని తెలుసుకునే లో పు నెక్స్ట్ సీన్స్ వచ్చేసి గజి బిజీ గందరగోళం చేస్తాయి. అతి తెలివిగా ప్రకాష్ రాజ్ ని ట్రాప్ చేసిన బోస్, నిన్ను ఇప్పుడే చంపను అంటాడు. అక్కడే విలనిజం తేలిపోవటం తో ఇంక సింహం వేట వన్ సైడ్ అయిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ మొదలు అవుతుంది
ఛార్జ్ తీసుకోక ముందే ఒక కేసు సాల్వ్ చేసి అవినీతి పరుడిని చంపేసిన బోస్, CBI లో JD అని తెలుస్తుంది. 1980 లో పుట్టిన బోస్, కోమా కి వెళ్ళిన 18 నెలలు, ఆ తర్వాత వెతికిన రోజులు, అంతకు ముందు గడిపిన రోజులు లేక్కేసుకుంటే, 32 ఏళ్ళకే CBI లో JD అయిన ఫస్ట్ ఆఫీసర్ ఇన్ ఇండియా అయ్యి ఉండాలి. అన్నిటికి మించి బాలయ్య ఏజ్ ఆ టైం కి 32 ఇయర్స్ ఏ అయ్యి ఉండాలి. 32 ఏళ్ళ లేత వయసులో లవ్ స్టొరీ ఉండటం పెద్ద క్రైమ్ ఏం కాదు కాబట్టి మాస్ సాంగ్ తో ఫాన్స్ ని అలరించాడు. ఆ తర్వాత ఇంపార్టెంట్ కేసు బోస్ కి రావటం, దానిని సాల్వ్ చేస్తూ ఫైల్ కి ఫైర్ వాల్ కట్టడం, టెక్నాలజీ ని యూజ్ చేసుకోవటం అబ్బురపరిచే విన్యాసాలు అవుతాయి. బోస్ పై అధికారులు కూడా ప్రకాష్ తో చేతులు కలిపేస్తారు, తెలివిగా తను చనిపోయిన కూడా కేసు సాల్వ్ అయ్యేలా టెక్నాలజీ ని వాడుకుంటాడు బోస్. అసలు విషయం తెలుసుకున్నప్రకాష్ రాజ్ బోస్ ని గాడ్సే చేసేస్తాడు.
ఫ్లాష్ బ్యాక్ అయ్యాక బోస్ ప్రకాష్ రాజ్ తో, నేను మొదటి అడుగు వేస్తే నీకు కిందన ఏం కనపడదు , రెండో అడుగు వేస్తే పైన ఎం కనపడదు, మూడు అడుగు వేస్తే నువ్వే మిగలవ్ అంటాడు, అబ్బ ఇంకా మూడు అడుగులు ఉన్నాయా అని మనం అనుకుంటాం కాని ఏదో ఆవేశం లో చెప్పినట్టు ఆ విషయం బోస్ అక్కడే మర్చిపోతాడు. సిగ్నల్ సరిగ్గా లేక ఇనార్బిట్ మాల్ రూఫ్ ఎక్కి, ఆఫీసు లో కంటే గెస్ట్ హౌస్ లో ఎక్కువ ఉండే ప్రకాష్ రాజ్ కి ఫోన్ చేస్తాడు, అది ప్రకాష్ కి తెలిసిపోతుంది, ఎలా అని డౌట్ వచ్చిన బోస్ పొట్ట కోసి చిప్ కనిపెడతాడు. అసలు ఆ చిప్ పొట్టలోకి ఎలా వెళ్ళింది అనే విధానం చూస్తే 35 ఏళ్ళ బోస్ స్పర్శ గ్రంధుల వర్కింగ్ పై అనుమానం వస్తుంది. గాజు పెంకు తో పొట్ట కోసుకొని చిప్ తీసి జేబులో వేసుకుంటాడు. సింహం వేట మొదలు పెడుతుంది అనుకుంటే ఆట మొదలు పెడుతుంది. నేను చచ్చిపోతా, చావకుండా కాపాడుకో అని ప్రకాష్ తో ఛాలెంజ్ చేస్తాడు, మళ్లీ మిరాకల్ అఫ్ ది ఇయర్ అనిపిస్తుంది కదా. ఒక భారి చేజ్ లో కంటైనర్ లారీ వెనక నుంచి వెళ్లి ముందు నుంచి వచ్చేస్తుంటే ధియేటర్ లో విజిల్ వెయ్యాలి వాళ్ళు ఉండరు. హెలికాప్టర్ నుంచి తాడు కట్టి లేపేస్తే ఆ తాడు కట్ చేస్తే విధానం కి చెప్పట్లు కొట్టని వాడు ఎవ్వడు, ట్రైన్ కి ఎదురుగా పరిగెడుతుంటే, కంటైనర్ లారీ టైపు లో ట్రైన్ లో నుంచి కూడా వెనక్కి వచ్చేస్తే అని భయపడిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మొదట్లో చెప్పుకునట్టు ఇలాంటి సీన్స్ లో కూడా నాకు బాలయ్య నటన లోని డెడికేషన్ ఏ కనిపించింది మరి.
థ్రిల్లర్ గా మొదలయి, లవ్ స్టొరీ తో, ఫ్యామిలీ సెంటిమెంట్ గా మరి రివెంజ్ డ్రామా గా ముగుస్తుంది. సినిమా బేసిక్ లైన్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఇంత పేలవం అయిన నరేషన్ తో ఈ లయన్ ఏ సందర్భం లో ను లయన్ లా గర్జించదు. సింహ లాంటి టైటిల్ తో, లెజెండ్ తర్వాత ఇంగ్లీష్ టైటిల్ తో ఆ రెండు సినిమాలలో చేసిన హుందా పాత్రలు ఒక వైపు ఈ లయన్ పాత్ర ఒక వైపు. అటు వంటి పాత్రలు చేసిన బాలయ్య ఏనా ఈ పాత్ర ఎంచుకున్నది అని అనుమానం కలిగేలా ఉంటుంది. డైలాగ్ లు పేలక, సీన్స్ పండక, ఒకటి రెండు సందర్భాలు తప్ప మిగతా అంత బాలయ్య డెడికేషన్ మాత్రమె కనిపిస్తుంది.
చివరిగా: మంచి కాన్సెప్ట్, అనుభవ రాహిత్యం వలన, అతిగా అలోచిన్చేయ్యటం వలన అతి గా తయ్యారు అయింది. విజయేంద్ర వర్మ కి ఎక్స్టెండెడ్ వెర్షన్ లా అనిపించే లయన్ లో ఆ సినిమా కి సరి తూగే సన్నివేశాలు బాగానే ఉంటాయి. అన్ని తానై మోసిన బాలయ్య కోసం ఫాన్స్, అదే బాలయ్య డెడికేషన్ కోసం మనం ఒక సారి చూసేయ్యోచ్చు. ఎవ్వరని డిసప్పాయింట్ చెయ్యదు, ఎవరికీ కావాల్సింది వాళ్ళకి దొరుకుతుంది.
ఇప్పుడు టైం ఎంత అయ్యింది
ఈ మూడు గంటలు, నోట్ బుక్ లో, బాల కృష్ణార్పణం అని రాసుకోండి
నందమూరి నామ సంవత్సర రాశి ఫలములు :
పటాస్ రాశి :
ఆదాయము: 16 రాజపూజ్యము: 5
వ్యయము: 9 అవమానము: 1
ఈ రాశి వారికీ ఎల్నాటి శని తొలగి, అరిష్టములు దూరమై, అనూహ్య విజయము వరించును. అన్ని విధముల లాభదాయకము గా ఉండును. గురుడు పంచమ స్థానమున ఉండుట వలన గౌరవ మర్యాదలకు లోటు ఉండదు, ధనాదాయం సిద్దించును. వీరు ప్రేక్షకులకి ఇటు వంటి కమర్షియల్ సినిమాలు దానం ఇచ్చుకొవలెను.
టెంపర్ రాశి :
ఆదాయము: 43 రాజపూజ్యము: 3
వ్యయము: 43 అవమానము: 3
ఈ రాశి వారికి ఇంతకు ముందు కంటే బాగుండును, గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సాధించలేనిది అందినట్టే ఉన్నాను అందని ద్రాక్ష వలె ఊరించును. ఆరంభము (ఫస్ట్ వీకెండ్) ఉన్న చురుకు ధనము క్రమేనా తగ్గుతూ ఉండును. రాహువు అష్టమ మందు, కేతువు జన్మ మందు ఉండటం వలన అవమానములు తప్పవు. చేసుకునే స్క్రిప్ట్ ల పై శ్రద్ధ అవసరం. లేనిచో మానసిక ఆందోళన, అపనిందలు పడుట తప్పదు.
లయన్ రాశి :
ఆదాయము: 15+ రాజపూజ్యము: 2
వ్యయము: 24 అవమానము: 5
ఈ రాశి వారికీ గౌరవ మర్యధాలకి లోటు ఉండదు, ధనాదాయం కు లోటు ఉండదు, కానీ ఖర్చు కి తగ్గ ఆదాయము కనిపించదు. గురుగు ద్వాదశామందు, రాహువు ద్వాదశ, జన్మము లందు ఉండటం వలన, అపనిందలు పడుట, డెడికేషన్ గుర్తించక పోవుట, కామెడీ చేసుకొనుట జరుగును. ప్రేక్షకులని ఇంకొక్క సినిమా తో మేనేజ్ చెయ్యగలిగితే 100 వ సినిమా విజయము సిద్దించే అవకాశము బోయపాటి చేతుల్లో కలదు.
గమనిక : ఇది సరదా ప్రయత్నమే తప్ప నాకు రాశి ఫలముల పై నమ్మకము లేదు, వాటిని అపహాస్యము చేసే ఉద్దేశము లేదు అని సవినయం గా మనవి చేసుకుంటున్నాను.
3 comments:
Guruvugaru enni reviews vachina mee blog lo review matram different ga untundi sir. eppudu edo oka kothadhanam choopistharu ee sari Rasi Falamulu kummesaru. mee dedication ki ma salaam
Hahha lol
first scene lantivi TFI Lo balayya babu okkade cheyagaladu no body can reach him in that kind of daring shots/scenes :D
Funniest review :) HARI is BACK
Post a Comment