2.0 - కథ కథనం - విశ్లేషణ
ఎనిమిది సంవత్సరాల క్రితం శంకర్ అండ్ రజిని కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమా ని ఇంకా మర్చిపోయి ఉండరు జనాలు, ఇప్పటికి టీవీ లో వస్తే సరదాగా కాలక్షేపం గా చూసేస్తూ ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. అదేమిటో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు డైరెక్టర్ కి ఆ రేంజ్ హిట్ లేదు, హీరో కి అసలు హిట్ ఏ లేదు. అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ పరం గా ఎన్నో మార్పులు, ఎన్నో డెవలప్మెంట్ లు, మన సినిమాలకి పెరిగిన మార్కెట్ విలువలు, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు మధ్య, ఇప్పుడు కాక పోతే ఇంకెప్పటికీ కాదేమో అని, ఇన్ని ఇయర్స్ తర్వాత ఇద్దరు కలిసి అప్డేటెడ్ వెర్షన్ 2.0 అంటూ 3D లో మన ముందుకి వచ్చారు. కమర్షియల్ సినిమాలలో మెసేజ్ ని జోడించి ప్రేక్షకులని మెప్పించటం లో శంకర్ ఒక జీనియస్, కానీ అదంతా ఒకప్పుడు - సుజాత లాంటి రైటర్ తన పక్కన ఉన్నపుడు. టెక్నాలజీ పరంగా ఎప్పుడూ రెండు అడుగులు ముందు ఉండే శంకర్ ఈ మధ్య కాలం లో ఆ టెక్నాలిజీ ని మాత్రమే నమ్ముకోవటం మొదలు పెట్టారు. తన ఊహ శక్తి కి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే అనేది అతిశయోక్తి కాదు కానీ, కట్టి పడేసే కథనం లోని ఒకప్పటి మెరుపులు ఇప్పుడు మిస్ అవుతున్నాం అనేది మాత్రం వాస్తవం. ఇక మన సినిమా విషయానికి వస్తే, భారీ బడ్జెట్ తో, విపరీతమైన గ్రాఫిక్స్ తో వచ్చిన 2.0 ఎంత వరకు అలరించింది అంటే - ఆహ ఓహో నుంచి ఆబ్బె అంత లేదు అని మిశ్రమ ఫలితం చెప్తున్న ప్రేక్షకులు ఒక వైపు - కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో లేవు అంటున్న ట్రేడ్ పండితులు ఇంకోవైపు, ఎలాగూ ఇంకో వారం రోజుల్లో ఈ సినిమా కమర్షియల్ ఫలితం ని తేల్చేస్తారు కానీ, మనం ఎప్పటి లాగానే కథ - కథనం గురుంచి విశ్లేషించుకుంటూ ఆ ప్రశ్న కి సమాధానం వెతుక్కుందాం....
స్ఫూర్తి : మన రెగ్యులర్ లైఫ్ లో పార్ట్ అయ్యిపోయిన సెల్ ఫోన్ మన చేతుల్లోంచి ఎగిరిపోతే? అలా ఎగిరిపోయిన సెల్ ఫోన్స్ అన్ని ఒక వికృత రూపం దాల్చి మానవాళి పై దాడి మొదలు పెడితే? అప్పుడు ఆ వికృత రూపాన్ని అంతమొందించటానికి చిట్టి ది రోబో వస్తే? అనే ఒక ఐడియా నుంచి పుట్టిన కథ ఈ 2.0 అనుకోవచ్చు ఏమో!. కానీ సెల్ ఫోన్స్ ఎగిరిపోవటం ఎలా, అవి మనపై దాడి చెయ్యటం ఎందుకు? ఎదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి కాబట్టి, ఆ రీజన్ గురుంచి గట్టిగా వర్క్ చేద్దాం అనుకుంటే, పక్షి రాజు క్యారెక్టర్ తట్టి ఉంటాడు ఏమో! వాడు కరెక్ట్ అవ్వాలి అంటే వాడు చేసే పోరాటం కరెక్ట్ అవ్వాలి కానీ ఆలా చేస్తే అప్పుడు వాడు హీరో అవుతాడు, మరి వాడి మీద పోరాటం చేసే వాడు ఏమవ్వాలి? అని కూడా అలోచించి ఉంటె బావుండేది అనిపించటం సహజం. అంత ఆలోచించకుండా ఉండి ఉండరు కాబట్టి ఇది ఇలా ఎంచుకు చేసి ఉంటారు అని మనం ఆలోచించటానికి ట్రై చేద్దాం.
కథ : ఒక పక్షి జాతి శాస్త్రవేత్త, పెరిగిపోతున్న ఫ్రీక్వెన్సీ / రేడియేషన్ వలన పక్షి జాతి అంతరించి పోతుంది అని, అది మనకి మంచిది కాదు అని చెప్పటానికి ప్రయతించి, విఫలమై, ఏమి చెయ్యలేని స్థితి లో ఆత్మహత్య చేసుకొని చనిపోతే, అతని ఆత్మ చనిపోయిన పక్షుల ఆత్మలతో కలిసి ఒక పెద్ద శక్తి గా అవతరించి, ఎంత మొత్తుకున్నా వినని ఈ మానవాళి పై పగతీర్చుకోవటం మొదలు పెట్టడం ఇతివృత్తం అయితే, ఆ శక్తి ని ఎదిరించడానికి మానవ వనరులు సరిపోక, చిట్టి ని తీసుకు రావాల్సిన అవసరం పడితే, అప్పుడు చిట్టి ఈ శక్తి ని ఎలా ఎదిరించాడు? మానవాళి ని ఎలా కాపాడేడు? అనేది కథ అయ్యింది.
కథనం : మనం ఎప్పుడూ చెప్పుకునేది, ప్రారంభం - సమస్యాత్మకం - ముగింపు అనే మూడు విభాగాల గురుంచి, అందులో ప్రారంభం అనేది పాత్రల పరిచయం తో మొదలు అయ్యి, సమస్య తో ప్లాట్ పాయింట్ ని సృష్టించి, మిడిల్ లో సమస్య అండ్ దాని పర్యవసానాలు చూపిస్తూ, ముగింపు ని ఫలప్రదం చేస్తూ ఉండే విధానం. కానీ ఇక్కడ ఆ స్ట్రక్చర్ మనకి కనపడదు - జనరల్ గా ఫ్లాష్ బ్యాక్ బేస్డ్ మూవీస్ కి ఈ స్ట్రక్చర్ ఉండదు కూడా - అయినా ఇక్కడ పార్ట్ 2 అవటం వలన పరిచయం చెయ్యాల్సిన పాత్ర ఒక్క పక్షి రాజు పాత్ర / నీలా (వెన్నెల) రోబో పాత్రలు మాత్రమే అయ్యింది. ఎక్కడ ఎటువంటి లాగ్ లేకుండా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోయింది. కథనం లో స్టార్టింగ్ ఏ సమస్య తో స్టార్ట్ అయ్యింది. కథలో లోపించిన స్ట్రక్చర్ సినిమాలో హై పాయింట్స్ ఇవ్వటం లో మాత్రం కరెక్ట్ గా మిస్ అవ్వకుండా చూసుకున్నారు, అంటే, ఏ టైం కి ఏ ఎపిసోడ్ ఉండాలి అనేది మాత్రం కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు, ఏది ఏమైనా ఫస్ట్ పార్ట్ కి ఈ పార్ట్ కి ఉన్న లింక్ ఏంటి అంటే ఫస్ట్ పార్ట్ లో హీరో ఆశయం తాను సృష్టించిన రోబో ఇండియన్ మిలటరీ కి సహాయం అందించటం ఈ పార్ట్ లో ఫలప్రదం అవుతుంది.
సమస్య: ఎందుకో తెలియదు కానీ ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని చుట్టూ పక్షులు తిరుగుతున్నాయి. పక్కన పెడితే, చెన్నై లో సెల్ ఫోన్స్ ఎగిరిపోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, ఏమవుతున్నాయి అని ఎవరికీ తెలియదు. కొత్త సెల్ ఫోన్స్ ఆర్డర్ చేసి తెప్పిస్తున్న ఒక సెల్ షాప్ ఓనర్ మర్డర్ అయ్యాడు. అది కూడా సెల్ ఫోన్స్ వలన. అసలు ఈ సెల్ ఫోన్స్ ఏమవుతున్నాయి అని తెలుసుకోవాలని వశీకరన్ తన పాత ఫోన్ లో ట్రాకర్ పెట్టి ట్రేస్ చేస్తే, అవి మాయం అయ్యే చోటు తెలుస్తుంది. తాను కనిపెట్టిన "డొమెస్టిక్ రోబో (అమీ)" సహాయం తో ఆ చోటు కి వెళ్తే, అక్కడ ఉన్న ఎదో కొత్త శక్తి గురుంచి తెలుస్తుంది. సెల్ ఫోన్స్ అన్ని ఒక రూపం దాల్చి సెల్ టవర్ ని కూల్చెయ్యటం కళ్లారా చూడటం జరుగుతుంది అక్కడ డొమెస్టిక్ రోబో తన ప్రాణాన్ని కాపాడుతుంది. దీనిని ఎదిరించడానికి తాను సృష్టించిన చిట్టి ని మళ్ళీ తీసుకురావటమే మార్గం అంటాడు వశీకరన్, కానీ చనిపోయిన ప్రొఫెసర్ బోరా కొడుకు అండ్ ప్రభుత్వం ఒప్పుకోవు మిలిటరీ సహాయం తీసుకుంటాయి. సెల్ టవర్స్ అధినేత హత్య జరుగుతుంది, మిలిటరీ ఉండగా మినిస్టర్ హత్య జరుగుతాయి, తప్పని సరి పరిస్థితుల్లో చిట్టిని తీసుకు రావటానికి ప్రభుత్వం అంగీకరిస్తుంది.
నిజమే, అప్పటికి ఇవన్నీ ఎందుకు జరుగుతూన్నాయో తెలియని ప్రేక్షకులం అయిన మనం ఒక సాటి సెల్ ఫోన్ యూసర్ గా చిట్టి ని కోరుకుంటాం. సరిగ్గా 40 నిమిషాల తర్వాత చిట్టి వస్తాడు (మనకి ప్లాట్ పాయింట్ రావాల్సిన సమయం). అప్పటి వరకు ఎం జరుగుతుందో తెలియక పోయినా శంకర్ గారి ఊహాజనిత శక్తి కి, తెరపై కనిపించే విన్యాసాలతో నోరు వొదిలేసి 3D గ్లాస్సెస్ లో ఆస్వాదిస్తూ ఉన్న మనకి, ది సూపర్ హీరో చిట్టి ఎంట్రన్స్ గూస్ బంప్స్. జనాలు అందరు "చిట్టి యు అర్ బ్యాక్" అంటుంటే హాలీవుడ్ లో కూడా అంతేలే స్పైడర్ మాన్ , సూపర్ మాన్ పార్ట్ 2 3 4 లో ఇదంతా కామన్ రియాక్షన్ ఏ అనుకోని సరిపెట్టుకోవాలి. నాన్ స్టాప్ గా జరిగితే విజువల్ వండర్ ని ఆస్వాదిస్తూ, పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీ ఫిజిక్స్ లెసన్స్ వింటూ, న్యూట్రలైజేషన్ ప్రాసెస్ లోకి వెళ్తాము. న్యూట్రలైజేషన్ ప్రాసెస్ లో చిట్టి విన్యాసాలు అసలు ఆలా ఊహించిన శంకర్ ప్రతిభ అబ్బురపరుస్తాయి. చిట్టి వచ్చిన తర్వాత ఈ మొత్తం ప్రాసెస్ 40 నిముషాలు ఉంటుంది.ఇదంతా ఇంటర్వెల్ బాంగ్ అనుకోవటమే. మెచ్చుకోవాల్సిన విషయం తెరపై కనిపించే సన్నివేశాలు - గ్రాఫిక్స్. అంతలోనే ఇంటర్వెల్ కార్డు.
ఫస్ట్ హాఫ్ లో ఏముంది ? శంకర్ ఎం తీసాడు తెలుసా అసలు, కనీ విని ఎరుగని గ్రాఫిక్స్, మన ఇండియన్ సినిమా లో ఊహించని గ్రాఫిక్స్, 3D ఎఫెక్ట్స్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే . ఎం జరిగిందో మనకి తెలియదు కాబట్టి ఎదో ఉంది అనే కుతూహలం ఉంటుంది, ఇదంతా చూస్తున్న మనకి ఫస్ట్ హాఫ్ అయ్యిపోయినట్టే తెలియదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఎప్పుడూ మొదలు అవుతుందా అనే ఆత్రంలో ఒక అద్భుతాన్ని ఆస్వాదించేసిన ఫీలింగ్ మిగిలిపోతుంది. అసలు నిజంగా పర్పస్ తెలియని పోరాటం ని ఆస్వాదించటం జరుగుతుందా? రోడ్ మీద ఇద్దరు కొట్టుకుంటున్నారు అంటే - ఎందుకు కొట్టుకొంటున్నారు అనే కుతూహలం ఉంటుందా ? అది తెలియకుండా ఎంత బాగా కొట్టుకుంటున్నారు అనే ఆస్వాదించటం ఉంటుందా?
ఫ్లాష్ బ్యాక్: శంకర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కి ఉండే ఇంపార్టెన్స్ ఏ వేరు, అయన గత సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ లో అయన స్టైల్ ఉండేలా చూసుకున్నారు. ఈ మొత్తం సినిమా కి ఆయువు పట్టు లాంటి ఎమోషన్ ని పెట్టుకున్నారు. పక్షులు తనని ఎలా ఎంచుకున్నాయి అనే బ్యాక్ స్టోరీ తో, పక్షులు అంటే ప్రేమ ఉన్న ఒక పక్షి రాజు తన జీవితాన్ని వాటికీ అంకితం చేసేసి శాస్త్రవేత్త అయ్యాడు. సెల్ టవర్స్ అధినేతలు, కంపిటేషన్ లో నిలబడటం కోసం, నిబంధనలు గాలికి వదిలేసి, ఫ్రీక్వెన్సీ పెంచటం వలన పక్షులు చనిపోతున్నాయి, దాని వలన ఫ్యూచర్ లో మానవాళి కి కూడా చాల నష్టం జరగబోతుంది అని తన వంతు గా చెప్పటానికి ప్రయత్నిస్తాడు. సెల్ ఫోన్స్ అమ్మే వాడి నుంచి, టవర్స్ యజమాని, మినిస్టర్, ఆఖరికి కోర్ట్ లో కూడా న్యాయం జరగక, తాను పెంచిన పక్షులు తన కళ్ళ ముందే చనిపోతుంటే తట్టుకోలేక సెల్ టవర్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. 25 నిమిషాల ఈ కథలో భావోద్వేగాలు పండించటం లో అక్షయ్ కానీ, చూపించటం లో శంకర్ కానీ ప్రతిభ కనపరిచారు. అసలు రజిని సినిమాలో అయన లేకుండా అంత సేపు బోర్ కొట్టకుండా కూర్చుబెట్టడం అనేది బహుశా శంకర్ కె సాధ్యం అని చెప్పుకోవాలి ఏమో. శంకర్ మార్క్ ఫ్లాష్ బ్యాక్ ఇట్ ఈస్
ఈ మొత్తం ఎపిసోడ్ వలన కొంత లాభం, ఊహించలేనంత నష్టం జరిగాయి మొత్తం కథ - కథనం కి. అప్పటి వరకు ఎం జరుగుతుంది అని తెలియని మనకి, ఇది జరిగింది అని తెలిసిన తర్వాత, అక్షయ్ పాత్ర కి కనెక్ట్ అవ్వటం మొదలు అవుతుంది. చిట్టి విన్యాసాలు ఎంజాయ్ చేసిన మనమే, పక్షి పాత్రకి సానుభూతి ప్రకటించటం మొదలు పెడతాం. అతను ప్రయత్నించింది మంచి పనే, ప్రాధేయ పడింది మంచి పని కోసమే, పాపం ఒక్కరు అయినా మాట విన్నారా? మరి అలాంటి వాళ్ళకి ఇలా చేస్తే తప్పు ఏంటి ? అనే ఆలోచన మొదలు అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ అయ్యాక కూడా చిట్టి చెప్పే డైలాగ్ "నీ కథలో న్యాయం ఉంది - కానీ మనుషులని చంపటం తప్పు". అక్కడ కూడా పక్షి రాజు వాదన బలం గా వినిపించినా న్యూట్రలైజేషన్ జరుగుతుంది. (ఈ ప్రాసెస్ లో కూడా "డొమెస్టిక్ రోబో" చిట్టి ని కాపాడుతుంది). మరి ఇక్కడ నుంచి ఈ ఎమోషన్ ని కంటిన్యూ చేస్తూ వెళితే చిట్టి పోరాటానికి న్యాయం ఉండదు కదా? అందుకే ఏమో సడన్ గా కట్ చేసినట్టు కట్ చేసి పారేసారు.
అప్పటి వరకు మంచికి చెడు కి జరిగే పోరాటం లా అనిపించేది, సడన్ గా మంచి కి మంచి కి జరిగే పోరాటం అయ్యింది. మన కమర్షియల్ సినిమా విషయానికి వస్తే జనరల్ గా ఇద్దరు హీరోస్ ఉంటారు అనుకుందాం, ఒకడు మంచివాడు, ఇంకొకడు చెడ్డవాడు లా కనిపించే మంచివాడు, చెడ్డవాడిని మంచి వాడు ఎదిరిస్తాడు, పోరాడుతాడు, ఆ తర్వాత చెడ్డ వాడు కూడా మంచి కోసమే పోరాడుతున్నాడు అని తెలుసుకుంటాడు, ఇద్దరు కలిసి చెడుని అంతమోదిస్తారు. ఇంతకు మించిన కమర్షియల్ ఫార్ములా ఏముంది? దానికి ఈ విజువల్ వండర్ తోడు అయితే ఇంకా హద్దు ఏమైనా ఉందా? ఇక్కడ అక్షయ్ పోరాటం లో న్యాయం ఉంది అని చిట్టి తనకి తోడు అయ్యి వ్యవస్థ మీద పోరాటం చెయ్యటం న్యాయమా? లేదా అక్షయ్ ని అంతమొదించింది లాస్ట్ లో వశీకరన్ ఏమో అక్షయ్ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది సో అయన చెప్పినవి ఇంప్లీమెంట్ చెయ్యండి అని ప్రభుత్వాన్ని ఒప్పించటం న్యాయమా? రెండు దారులు కమర్షియల్ ఎండింగ్ కి దారి చూపే అవకాశాలు ఉన్నాయి, ఒకటి మనం చూసిన సినిమాలో జరిగే విషయాలు, ఇంకొకటి మన ఊహకి మాత్రమే అందే విషయాలు.
మనం చూసిన దాని గురుంచి ముందుగా మాట్లాడుకుంటే, సమస్య తీరిపోయింది అని, చిట్టి ని మిలటరీ కి ఎంపిక చేసి ఫస్ట్ పార్ట్ లోని ఆశయం కి ఫలప్రాప్తి ఇక్కడ కల్పించారు. ఇక్కడితో అయిపోయిన సినిమా ని బోరా కొడుకు పగతో క్లైమాక్స్ కి తీసుకెళ్లారు.
ముగింపు : బయటికి వచ్చిన నెగటివ్ ఎనర్జీ, వశీకరన్ రూపం తీసుకొని చిట్టి ని నాశనం చెయ్యాలి అని చూస్తుంది. అప్పటికే ప్రోగ్రాం చేసిన 2.0 ని "డొమెస్టిక్ రోబో" తీసుకు వచ్చి, పక్షి మీద యుద్ధం చెయ్యమని ప్రకటిస్తుంది. అతను సృష్టించిన 3.0 సహాయం తో పక్షి ని అంతమొదించటం తో కథ ముగుస్తుంది. ఈ మధ్య లో 40 నిమిషాల నాన్ స్టాప్ యాక్షన్ తో, హాలీవుడ్ ని తలపించే విజువల్ వండర్స్ తో భీకర పోరాటం జరుగుతుంది. రజిని సర్ డ్రైవర్ సీట్ తీసుకొని తన అసమాన నటనా ప్రదర్శన తో మంత్రముగ్ధుల్ని చేస్తూ రంజింప చెయ్యటం మొదలు పెట్టాక, ఇంక కథ - కమామిషు ఆలోచించే వాళ్ళు ఉండరేమో అనిపిస్తుంది. శంకర్ సర్ ఊహకి లాల్ సలాం కొడుతూ, ఇది మన సినిమా అని గొప్పగా ఫీల్ అయ్యేలా సాగే క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం, థియేటర్ లో కుర్చున్నంత సేపు కట్టి పడెయ్యటం ఖాయం. బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతూ ఇదిగో ఇలాంటివి వ్రాసుకోవటం ఎలాగూ జరిగేదే లెండి. పక్షిరాజా పాత్ర మచిందే అని చూపెడుతూ తాను చిట్టి ని ఎదుర్కోటానికి వశీకరన్ ని వాడుకునట్టు , అదే పక్షి రాజా ని ఎదుర్కోటానికి పక్షులని వాడుకుంటూ 3 . 0 (ఈ ప్రాసెస్ లో కూడా "డొమెస్టిక్ రోబో" సహాయం గుర్తించదగ్గ విషయం) పేరుతో క్లైమాక్స్ లో చేసిన హడావుడి ఫాన్స్ ని అలరించటం పక్కన పెడితే కథకి న్యాయం చెయ్యటం లో తప్పటడుగు అనేది మాత్రం నిజం. ఇది పక్షి రాజా పోరాటాన్ని వెక్కిరించటం కాక పోతే ఇంకేంటి ?
మనల్ని మనం కన్విన్స్ చేసుకోవాలి అంటే, ఇలా అనుకుందాం, అంతా బాగానే ఉంది కానీ పక్షి రాజు పగ సెల్ ఫోన్ ఓనర్స్, సెల్ టవర్ ఓనర్స్, నెట్వర్క్ ప్రొవైడర్స్, మినిస్టర్స్ మీద ఉంటె ఓకే, అంతే కానీ సెల్ ఫోన్ వాడే ప్రతి వాడు హంతకుడే అని నన్ను కూడా ఆ లిస్ట్ లో కలిపేస్తే ఎలా ? ఈడీని లేపెయ్యటమే కరెక్ట్ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటె, చిట్టి వార్ అండ్ యాక్షన్ కి మంచి జస్టిఫికేషన్ దొరికినట్టే. నేను ఒక సెల్ ఫోన్ యూజర్ అండ్ పక్షి రాజు నన్ను చంపేస్తా అంటే ? అదే స్టేడియం లో ఒక మెంబెర్ గా నేను ఉంటె? కచ్చితం గా నా సపోర్ట్ 3 . 0 కే అంటానేమో ?
ఇక మన ఊహకి మాత్రమే అందే విషయానికి వస్తే , ఇప్పుడు ఇంత చేసి పక్షి రాజు ని అంతం చేసాక వశీకరన్ చెప్పేది ఏంటి? పక్షి రాజు చెప్పినవి మంచి విషయాలు అవి ఇంప్లీమెంట్ చెయ్యండి అనేగా? అంతోటి దానికి వాడిని నాశనం చెయ్యటం ఎందుకు? వాడు చేసింది తప్పు అయితే మన దగ్గర ఆల్టర్నేట్ సొల్యూషన్ ఉండాలి.. వాడు చేసింది తప్పు సో వాడిని చంపేస్తా, కానీ వాడు చెప్పింది కరెక్ట్ అది ఫాలో అవ్వండి అనటం ఎంత వరకు న్యాయం? ఇక్కడ పక్షిరాజు పోరాటం లో న్యాయం ఉన్నపుడు "అతనికి కావాల్సింది కేవలం పక్షుల్ని రక్షించటం అండ్ దానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ మెజర్స్ అందరు పాటించాలి అని కోరుకోవటం" అతన్ని చంపినా కూడా హీరో అయ్యేది అతడే కానీ చిట్టి కాదు కదా? అలాంటప్పుడు పక్షి రాజు గతం తెలిసాక చిట్టి కూడా తనతో కలిసి, నువ్వు చేస్తుంది తప్పు రా, కానీ నీ ఆలోచన మంచిది అని చెప్పి, కార్పొరేట్ దిగ్గజాలపై పోరాటం చేసి (అవసరం అయితే బోరా కొడుకు ని వాళ్ళకి తొత్తు గా చూయించి) ఒక సొల్యూషన్ ఇచ్చి పక్షి రాజు ఆత్మా కి శాంతి జరిగేలా చేస్తే?
మన ప్రతి ఆత్మ సినిమాలో జరిగేది ఇదే కదా? హీరో ఉంటాడు .. అతనికి ఒక ఆత్మ పరిచయం అవుతుంది, ఆ ఆత్మ తనకి అన్యాయం చేసిన వాళ్ళని చంపేస్తూ ఉంటుంది, దాని వలన మొదట్లో ఇబ్బంది పడతాడు, దానితో పోరాడతాడు కానీ ఆ ఆత్మ కి జరిగిన అన్యాయం తెలుసుకొని హీరో ఆ ఆత్మ కి సహాయం చేస్తూ చెడుని అంతమొందిస్తాడు. ఈ మొత్తం ప్రాసెస్ ని ఎంత క్రియేటివ్ గా ప్రెసెంట్ చెయ్యాలి అనేది దర్శకుడి ఊహ కి వదిలేస్తూ ఎంజాయ్ చెయ్యటమే కమర్షియల్ హిట్ ఫార్ములా.
ఇదంతా ఎదో చెప్పేద్దాం అని కాదు కానీ, సినిమాలో ఇవన్నీ కూడా అలోచించి కొంచెం కేర్ తీసుకొని ఉంటె ఇంకా బావుండేది ఏమో అనే తపన అంతే. మనం గుర్తించామో లేదో కానీ ఈ సినిమా వరకు అసలైన హీరో "డొమెస్టిక్ రోబో" - వశీకరన్ ని కాపాడి, చిట్టి కి MPU అరువు ఇచ్చి, 2 . 0 ని సృష్టించి, 3 . 0 ని కరెక్ట్ టైం లో స్టేడియం కి తీసుకువచ్చి, మళ్ళీ లాస్ట్ లో హాస్పిటల్ లో వశీకరన్ కి సేవలు చేస్తూ తన ఉనికిని అన్ని ముఖ్యమైన సందర్భాల్లో చాటుకుంది. గుడ్ జాబ్ నీలా / వెన్నెల . డాట్
చివరిగా : ఇదొక హై కాన్సెప్ట్ మూవీ, హాలీవుడ్ సినిమాలని తలపించే సూపర్ హీరో మూవీ, ఇందులో కథకి కథనం కి ఇచ్చే ప్రాధాన్యం కంటే, భారీ చిత్రణ కి ఇచ్చే మర్క్స్ ఎక్కువ. 3D లో టికెట్ పై పెట్టిన డబ్బులకి ఎంటర్టైన్మెంట్ ని పుష్కలం గా అందించే బొమ్మ. ట్విస్ట్ లు, డ్రామాలు , న్యాయాలు అన్యాయాలు పక్కన పెట్టి మసాలాలు దట్టించిన యాక్షన్ మూవీ. దర్శకుడి ఊహకి (బహుశా అందులో 50 % స్క్రీన్ మీద ఆవిష్కరించబడింది ఏమో) సలాం కొడుతూ, 3D ఎఫెక్ట్స్ ని 4K స్క్రీన్ లో డాల్బీ సౌండ్ లో పాప్ కార్న్ తో కూల్ డ్రింక్ తో ఎంజాయ్ చేస్తూ అనుభవించాల్సిన ఎక్స్పీరియన్స్ అని అర్ధం చేసుకోవాలి. బహుశా ఇలాంటి విజువల్ వండర్ మన తెలుగు / తమిళ్ సినిమాలలో ఊహించి ఉండవేమో, ఇంచుమించు ఇలాగె వచ్చిన హాలీవుడ్ సినిమాలకి వెతకని లాజిక్ లు మన సినిమాకి వెతకటం తప్పు ఐ సే. ఎస్ శంకర్ సర్ ఈస్ ప్రైడ్ అఫ్ ఇండియన్ సినిమా అండ్ హి ఈజ్ బ్యాక్ విత్ ఆ బ్యాంగ్ - గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1 comments:
as usual very good analysis raju garu. chala rojula tarvata malli writing start chesinanduku thanks
Post a Comment