వకీల్ సాబ్ - కథ, కథనం - విశ్లేషణ


 వకీల్ సాబ్ - కథ కథనం - విశ్లేషణ 

మూడేళ్ళ క్రితం అజ్ఞాతవాసి తర్వాత సినిమాల నుంచి అజ్ఞాతవాసం ప్రకటించుకొని రాజకీయాల్లో బిజీ అయిపోయిన కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చెయ్యాలి అని నిర్ణయం తీసుకోవటం అభిమానులకి ఊపు ఇచ్చే అంశమే అయినప్పటికీ పింక్ సినిమా రీమేక్ చేస్తే ఏముంటుంది మాకు ఇందులో అనే అభిమానుల అనుమానాల్ని - ఈ సినిమా రీమేక్ చేస్తే ఎవరు చూస్తారు అనే సగటు ప్రేక్షకుల అపోహల్ని ఒకే ఒక్క ట్రైలర్ రిలీజ్ తో పటాపంచలు చేసేసారు. ఆ ట్రైలర్ రిలీజ్ మేనియా తో ఒకప్పటి రోజులు గుర్తు చేసారు. ఒక ఫుల్ లెంగ్త్ కమర్షియల్ బొమ్మ పడితే ఎలా ఉండబోతుందో అనే ఆలోచన తోనే గూస్ పింపుల్స్ తెప్పించారు. 


అభిమానుల కోలాహలం ఒక వైపు, సమ్మర్ సీజన్లో ఒక పెద్ద సినిమా అనే అంచనాలు ఒక వైపు. ఇవన్నీ పక్కన పెట్టేసినా  కూడా, మొదటి నుంచి, ఈ సినిమా వరకు రెండు భిన్నమైన అభిప్రాయాలూ వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ పింక్ ఏంటి ఇక్కడకి వచ్చేసరికి వకీల్ సాబ్ ఏంటి అనేవాళ్ళు కొందరైతే - పసుపు అనో ఎరుపు అనో పెట్టుకోటానికి ఇది ------ సినిమా అనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ అంటే ఆ మాత్రం టైటిల్ లో పవర్ ఉండాలి అనేవాళ్ళు మరి కొందరు.  ఒరిజినల్  చూసి అది నచ్చిన వాళ్లకు - కమర్షియల్ హంగులు పెట్టి చెడగొడుతున్నారు అని కొందరైతే, తమిళ్ లో అజిత్ కోసం చిన్న మార్పులు చేస్తేనే ఫాన్స్ రెచ్చిపోయారు - అదే పవన్ కళ్యాణ్ కి తగ్గట్టు మార్పులు చేస్తే అల్లాడించేస్తారు ఏమో అని మరి కొందరు. లాస్ట్ మినిట్ లో టికెట్స్ రేట్స్ విషయం లో - స్పెషల్ షోస్ విషయం లో కన్ఫ్యూషన్లు ఒక్కొక్క వర్గానికి ఒక్కో రకమైన డిస్కషన్స్ కి ఆస్కారం - చూసే వాళ్ళకి వినోదం అందించాయి.  


ఏదైతేనేం, గ్రాండ్ రీఎంట్రీ తో మన ముందుకొచ్చిన ఈ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గొడవలు - ఆ లెక్కల మేజిక్ లు - ఎంజాయ్ చేస్తూ, పనిలో పనిగా ఈ సినిమా ని విశ్లేషించుకుందాం అనే చిరు ప్రయత్నమే ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం. ఈ మధ్య మనకి కూడా బ్లాగ్ లో గ్యాప్ వచ్చింది కాబట్టి మన రీ ఎంట్రీ కి కూడా ఈ రీఎంట్రీ బొమ్మ అయితేనే బెటర్ ఏమో అని ...... 


"సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం. ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు. 


కథ : హిందీ లో అయినా తమిళ్ లో అయినా  - ముగ్గురు యువతులు అనుకోని ఘటనలో  నేరానికి పాల్పడినప్పుడు, రిటైర్డ్ న్యాయవాది వారి పేర్లను క్లియర్ చేయడంలో సహాయపడటానికి ముందుకు వస్తాడు. ఒక సింపుల్ అండ్ స్ట్రెయిట్ కేసు, ఒకడి తల పగలకొడితే - అది ఆత్మరక్షణ కోసం కొట్టింది అని నిరూపించాల్సిన కేసు. కానీ అది ప్రూవ్ చేసే ప్రాసెస్ లో, వాళ్ళకి ఎదురుగా సాక్ష్యాలు, వారి క్యారెక్టర్ మీద నిందలు, వారిపై జరిగే దాడులు - నేటి సమాజంలో జరిగే ఎన్నో వాస్తవిక సంఘటనలను టచ్ చేస్తూ ఫైనల్ గా జనల మైండ్ సెట్ ని ప్రశ్నిస్తూ, నో అంటే నో అని - అన్ని మూసుకు కూర్చోవాలి అని అద్భుతమైన మెసేజ్ ని పాస్ చేస్తుంది. 


 ఇక్కడ కూడా ఇదే కథ అనుకోని చెప్పుకోవాల్సి ఉంది కానీ టైటిల్ వకీల్ సాబ్ అయ్యే సరికి, కథ లాయర్ది అయ్యింది, లాయర్ కథలోకి అమ్మాయిల కేసు వచ్చి పడింది. అంతకు ముందు - దీని తర్వాత అతని పోరాటం - ప్రశ్నించే తత్త్వం లాంటి అదనపు హంగులతో కూడిన కథ అయ్యింది. ఎందుకు ఏమిటి ఎలా అంటే?


ఈ సినిమా రీమేక్ సినిమా అయినప్పటికీ, ఆ రీమేక్ అని అందరు చూసే అవకాశం లేదు కాబట్టి, ఒరిజినల్ తో పోలిక ని అవసరం అయినంత వరకు మాత్రమే తీసుకుంటూ, ఈ సినిమా అనే కాకుండా ఏ రీమేక్ సినిమా ని అయినా ఒక ఫ్రెష్ మూవీ గానే విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. వర్కౌట్ అయింది - అవ్వనిది విషయాల్లో మాత్రమే కంపేరిజన్ వెళ్ళటం సబబు అని నా అభిప్రాయం. 

కథనం - ప్రతి ఫ్లాష్ బ్యాక్ మూవీ లాగానే ఈ కథనం కూడా బిగినింగ్ తో కాకుండా మిడిల్ తో మొదలు అవుతుంది, అంటే వేరే ఎక్కడో జరుగుతున్న కథతో మొదలు అవుతుంది, ఒరిజినల్ బిగినింగ్ వేరే దగ్గర ఉంటుంది అది మనకి ఫ్లాష్ బ్యాక్ తో తెలుస్తుంది. 


బిగినింగ్ : కొణిదెల సత్యదేవ్ అనే యూనివర్సిటీ స్టూడెంట్ - బలహీనం గా ఉండే దాని గురుంచి భలం గా నిలబడే మనస్తత్వం, వందల ఎకరాల భూమిని ఆస్తిని పబ్లిక్ కి పనిచేసి అందరు సమానం గా ఉండాలి అని భావించే మంచి గుణం - సేవ్ స్టూడెంట్ రైట్స్ నినాదం తో - నిప్పులు చెరిగే నిజాయితితో -  మినిస్టర్ తలపెట్టిన సభని అడ్డుకొని అరెస్ట్ అవుతాడు. జైలు తో తోటి ఖైదీ ఒక ముసలాయన ద్వారా పేదోడికి న్యాయం దొరకటం లేదు అని తెలుసుకొని, ఢిల్లీ యూనివర్సిటీ లో న్యూక్లియర్ ఫిజిక్స్ లో PHD సీట్ వదులుకొని, లా కోర్స్ లో డిగ్రీ తో మొదలుపెడతాడు. లా పూర్తి చేసి అదే ముసలాయన కేసు తో మొదలు పెట్టి, ఎన్నో కేసు లు వాదిస్తూ, థమన్ స్వరపరిచిన సత్యమేవ జయతే నినాదం తో, ఎంతో మందికి న్యాయం అందిస్తూ ఉంటాడు. అవసరం అయితే ఫైట్లు కూడా చేస్తూ ప్రజల కోసం నిలబడతాడు. తనని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని డ్యూయెట్ లు పాడుకుంటూ హ్యాపీ గా ఉన్న జీవితం లో, గర్భవతి అయిన ఆమెకి మెడికల్ ప్రాబ్లెమ్ అని తెలుస్తుంది. ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఒక కేసు కోసం ఆమెని వదిలి కోర్ట్ కి వెళ్లాల్సి వస్తుంది. ఎవరికోసం పోరాడుతున్నాడో వాళ్ళు బ్యాక్ అవుట్ అయ్యిపోవటం తో ఆలోచన పక్కన పెట్టి ఆవేశం తో రియాక్ట్ అవ్వటం వలన కోర్ట్ కోపానికి గురై సస్పెండ్ అవుతాడు. భార్యని కూడా పోగొట్టుకుంటాడు. వేరే దగ్గరకి వెళ్ళిపోయి సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. ఇక్కడే అన్ని చెప్పెయ్యటం వలన ఇంకా హీరో పాత్రకి లక్ష్యం లేకుండా పోయింది. ఒకవేళ ఇంత జరిగినా కూడా అతను జనాల గురుంచి పోరాడుతూనే ఉంటె , అప్పుడు తాను తీసుకున్న సత్యమేవ జయతే కి వేల్యూ ఉండేది. అప్పటి వరకు ఆక్టివ్ గా ఉన్న పాత్ర పాసివ్ గా మారిపోతుంది. 


మిడిల్ - మనకి చూపించిన బిగినింగ్ : అనగనగా ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్, సిటీ లో ఒక అపార్ట్మెంట్ లో ఉంటూ, జాబ్ చేసుకుంటూ, థమన్ స్వరపరిచిన పాటలో మాత్రమే వినిపించే "తెగువ తో"  వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది.


ఇలా సాగిపోతున్న జీవితం లో  ఒక రోజు పార్టీ నుంచి ఇంటికి వాస్తు ఉండగా, కార్ బ్రేక్ డౌన్ అయ్యి, వేరే ఫ్రెండ్ కార్ లో వెళ్లాల్సి రావటం, వాళ్ళతో రిసార్ట్ కి వెళ్ళటం, అక్కడ జరిగిన ఒక అనుకోని ఒక సంఘటన లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి బుర్ర బాటిల్ తో పగలగొట్టేస్తుంది. అబ్బాయిలు హాస్పిటల్ కి అమ్మాయిలు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎం జరిగింది అని ఎండ్ టైటిల్స్ లో చూపిస్తారు, దాని వలన ఎండ్ లో కూడా బిగినింగ్ ఉంటుంది అన్నమాట. 


మిడిల్ : సమస్యాత్మకం :  అనవసరం గా వెళ్లినట్టు ఉన్నాం, పాపం దెబ్బ గట్టిగా తగిలినట్టు ఉంది అని అమ్మాయిలు, వాళ్ళని అలా ఎలా వదిలేస్తాం అంతుచూడాల్సిందే అని అబ్బాయిలు ఆలోచిస్తూ ఉంటారు.  వెంటనే పోలీస్ కేసు పెట్టయ్యాలి అని వాళ్ళు అనుకోరు, ఆ తర్వాత అలాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేసుకోటానికి, అది బాగా పండటానికి  ఇదొక టూల్ లా ఉపయోగ పడుతుంది. దీనిని జనరల్ గా వాడే స్క్రీన్ ప్లే టెక్నిక్స్ లో రెఫ్యూసల్ అఫ్ ది కాల్ అంటారు. ఇంటి ఓనర్ ని బెదిరించి ఖాళీ చేయిద్దాం అనుకున్న ప్లాన్ వర్క్ అవుట్ అవ్వక,  డైరెక్ట్ ఎటాక్ కి దిగుతారు. ఇక్కడ మనం బిగినింగ్ లో చెప్పుకున్న లాయర్ వీళ్ళ ఏరియా కి వస్తాడు. అంటే తన కథ లో అసలైన ఉప కథ (మిడిల్) ఇప్పుడు మొదలు అయినట్టు. అమ్మాయిలు పోలీస్ కంప్లైంట్ తీసుకొనే నాధుడు ఉండడు. అబ్బాయిలు ఎటాక్ చెయ్యటం మొదలు పెడతారు, ఒక అమ్మాయి ఉద్యోగం పోతుంది  

ఇష్యూ పెద్దది అవుతుంది అని, పలుకుబడి ఉన్న అబ్బాయిల ఫామిలీ ఎంటర్ అయ్యి, అమ్మాయిల మీదనే తిరిగి కేసు పెడతారు. వాళ్ళు ఉండే కాలనీ నుంచే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బెయిల్ వచ్చే అవకాశం రాకూడదు అని వీకెండ్ కి లోపలేస్తారు. అప్పటికే అన్ని వదిలేసి అశాంతి తో ప్రశాంతంగా గడుపుతున్న సత్యదేవ్ వీళ్ళకి బెయిల్ ఎలా రాబట్టుకోవాలో మాటసాయం చేస్తాడు. 


అమ్మాయిలు అతన్ని తక్కువ అంచనా వేస్తారు, ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్న బిగినింగ్ గురించి వాళ్ళు కూడా తెలుసుకొని, ఇంత గొప్ప వారిని మనం దూరం చేసుకోటం దురదృష్టం అని గ్రహిస్తారు, వేరే ఎవరు కేసు తీసుకోవటం లేదు అని సత్యదేవ్ ని హెల్ప్ చెయ్యమని అడుగుతారు. లాయర్ అవ్వటానికి మోటివేషన్ ఉన్నట్టు, ఈ కేసు టేక్ అప్ చెయ్యటానికి మొటివియేషన్ ఎక్కడ ?  అలంటి మోటివేషన్ కి సెట్ అప్ క్రియేట్ చెయ్యాలి అంటే రెఫ్యూసల్ అఫ్ ది కాల్ ని వాడుకోవాలి. లేదంటే ఇన్ని రోజులు కేసులు లేక వకీలు గారు ఖాళీ గా ఉండిపోయారు అనుకుంటారు. అక్కడే తాను లాయర్ అవ్వటానికి ముసలాయన చెప్పిన డైలాగ్ అంజలి తో చెప్పించారు. ఒప్పుకున్నాడో లేదో అనే డౌట్ ప్రేక్షకులకి వదిలేసి ఆలోచిస్తున్నట్టుగా చూపించి ఒక ఫైట్ పెట్టుకున్నారు.  ఆ ఫైట్ తో, ఫాలో అప్ వార్నింగ్ లో నాలుగు పొలిటికల్ రిఫరెన్స్ డైలాగ్ లతో ఇంటర్వెల్ బాంగ్ సెట్ చేసుకున్నారు. 


ఈ ఫస్ట్ హాఫ్ లో వీలు దొరికినప్పుడల్లా కొంచెం గట్టిగానే వాడేసుకున్నారు డైలాగ్స్. ఇలాంటి రిఫరెన్స్ డైలాగ్స్ తమిళ్ లో విజయ్, రజినీకాంత్ మూవీస్ లో కామన్, వాళ్ళు రాజ్యకీలల్లోకి రాలేదు, వస్తే ఎలా ఉంటుందో తెలియదు, ఇలా ఉండాలి అని ఆశించే వాళ్ళు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ సిచువేషన్ అందరికి తెలిసిందే, అందువలన ఇలాంటి డైలాగ్స్ వలన ఉపయోగం ఉండకపోగా, వేరే వాళ్ళకి సెటైర్లు వేసే అవకాశం కల్పించినట్టే అయ్యింది. 


సెకండ్ హాఫ్ : పేరున్న లాయర్ నందాజి ఎంటర్ అవ్వటం తో సత్యదేవ్ కి కొత్త సవాలు మొదలు అవుతుంది. అక్కడ నుంచి కోర్ట్ సీన్స్ తో కథనం జోరందుకుంటుంది. ఇంటర్వెల్ లో రెడ్-బుల్ కొట్టి రెట్టించిన ఎనర్జీ తో వచ్చే పవన్ కళ్యాణ్ ని చూస్తాం సెకండ్ హాఫ్ లో. తాను ఎదో డాక్టర్ అయినట్టు నందా కూడా సత్య ని వకీల్ సాబ్ అని సంబోధిస్తూ ఉంటాడు. గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ నుంచి సత్యదేవ్ అని మాట్లాడుకోవటం మానేసి కళ్యాణ్ అనో, వకీల్ సాబ్ అనో మాట్లాడుకోటానికి ప్రిపేర్ అవ్వాలి మనం కూడా. పూర్తిగా కళ్యాణ్ ఈ  మూవీ ని తన భుజాన వేసుకోటం మొదలు అవుతుంది. ఫాన్స్ ని అలరించటానికి తన హావభావాలతో, డైలాగ్స్ తో, ఫాన్స్ కి మాత్రమే కాదు సగటు ప్రేక్షకుడి టికెట్ కి కూడా నేను న్యాయం చేస్తాను కదా అని హామీ ఇస్తున్న కళ్యాణ్ కనపడతాడు. కేసు లో లాజిక్స్ ఎం వెతుకుతాడా మన వకీల్ అనే కంటే, నెక్స్ట్ డైలాగ్ లో నందా కి పంచ్ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసేలా చేస్తాడు. 


ఒక్కొక్క సాక్ష్యం అమ్మాయిలకి ఎదురుగా వాళ్లదే తప్పు అన్నట్టు ప్రూవ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క దానిని సమర్ధం గా తిప్పి కొడుతూ ఉంటాడు. అలాంటి ఒక ఎపిసోడ్ ఏ పోలీస్లు తన క్లయింట్ కంప్లైంట్ తీసుకోకుండా ఫ్యాబ్రికేటెడ్ కంప్లైంట్ సృష్టించటం. సూపర్ విమెన్ డైలాగ్స్. రిసార్ట్ లో వీడియో ప్రూఫ్స్. క్రాస్ ఎక్సమినేషన్స్. ఇక్కడ ఒరిజినల్ వెర్షన్ లో బాగా రీచ్ అయినవి అంత ఇంపాక్ట్ గా చూపించలేక పోయారు, ఉదాహరణ కి అమ్మాయిలు డ్రింక్ చేస్తే, రిసార్ట్ కి వెళ్తే, నవ్వుతు మాట్లాడితే, రాత్రి పూట అమ్మాయిలు రోడ్డు మీద పోతూంటే వాహనాలు స్లో అవుతాయి,  అద్దాలు కిందికి దిగిపోతాయి. ఇలాంటి డైలాగ్స్ ఒరిజినల్ లో బాగా పేలాయి. అప్పటి వరకు వాళ్ళు వాదించిన తీరుకి, ఈ డైలాగ్స్ చెప్పే విధానం కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం కోర్ట్ సీన్ స్టార్ట్ ఐన దగ్గర నుంచి నందా అండ్ వకీల్ మోడ్ లో ఉండిపోవటం వలన వీటికి రావాల్సిన ఇంపార్టెన్స్ రాలేదు అనిపించింది. ఈ గ్యాప్ లో టాయిలెట్ ఫైట్, అది చూస్తుంటే అసలు ఎందుకొచ్చిన వాదనలు వకీల్ సాబ్ వాళ్ళకి నాలుగు తగిలించండి అని అరవాలి అనిపిస్తుంది. ఒకప్పటి వకీల్ ట్రాక్ రికార్డు ప్రకారం ఈయనకి ఆవేశం వస్తే అదుపు తప్పుతాడు అని నందా ఒక ట్రాప్ వేస్తాడు. కోర్ట్ లో వాళ్ళు కొట్టుకొనే వరకు వెళ్లే సీన్ అయితే జుడ్గే గారు లేచి "ఎందుకు రా మీరే కొట్టుకు సావండి" అంటారేమో అని భయమేస్తుంది. సినిమాటిక్ లిబర్టీస్ కోసం కొన్ని సన్నివేశాలు శృతి మించిన మాట వాస్తవమే అయినప్పటికి, ఇదంతా కమర్షియల్ హంగులతో భాగమే అని సర్దిచెప్పుకోవాలి. ఆల్మోస్ట్ సస్పెంట్ అవ్వాల్సిన వకీల్, లాస్ట్ వార్నింగ్ తో తప్పించుకుంటాడు. ఒక అమ్మాయి తాము డబ్బులు తీసుకున్నాం అని ఒప్పుకోవటం తో మరింత సమస్యాత్మకం అయ్యి, చివరి ఆక్ట్ కి వెళ్తుంది. 


ముగింపు : మనం ఒప్పుకోనంత వరకు ఓడిపోనట్టే, నిజం కోసం నిలబడినప్పుడు చాలా కోల్పోవాల్సి వస్తుంది అన్నిటికి సిద్దపడే ముందుడగు వెయ్యాలి. తన లాస్ట్ ఛాన్స్ గా మెయిన్ అబ్బాయిని క్రాస్ చేసే అవకాశం ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాడు వకీల్. ఇక్కడ కూడా మనం కళ్యాణ్ విశ్వరూపం ఏ చూస్తాం. అదే ఒరిజినల్ లో క్లోసింగ్ స్టేట్మెంట్ ఒక సారి యూట్యూబ్ లో చూస్తే, ఆ డిఫరెన్స్ ఏంటో అర్ధం అవుతుంది. అంటిని ఆవేశం తోనే చెప్పాలి అని రూల్ లేదు. ఒక్కోసారి ఆ ఆవేశం లో సందేశం వినపడదు జస్ట్ పెర్ఫార్మన్స్ ఏ కనపడుతుంది. ఒక చిన్న ఫైట్ తో, తుది తీర్పు తో కేసు ముగుస్తుంది. వకీల్ సాబ్ ప్రయాణం మళ్ళీ కొనసాగుతుంది. మన అందరికోసం, మన సమస్యల కోసం, కలిసి పోరాడదాం అనే హామీ తో....... 


ఇక్కడ ఆ రోజు ఎం జరిగింది అని చూపిస్తూ అమ్మాయిల స్టోరీ, ఇది అమ్మాయిల కథ గా అయ్యి ఉంటె, బిగినింగ్ లో సెకండ్ ఆక్ట్ ఎంటర్ అవ్వటానికి జరగటానికి ముందు జరిగిన స్టోరీ చూపిస్తారు. ఇదే స్టోరీగా చెప్పాలి అనుకున్నపుడు సత్యమేవ జయతే టైటిల్ పెట్టుకున్నా పవర్ఫుల్ గా ఉండేది, ఫ్లాష్ బ్యాక్ ని పక్కన పెట్టి, ఈ అమ్మాయిల కథని మాత్రమే ఉంచుకొని, ఒక నొక టైం లో వీళ్ళు కూడా తప్పు చేశారేమో అనే భావన ప్రేక్షకులలో కలిగించి, అప్పుడు క్లైమాక్స్ లో ఇది జరిగింది అని చెప్పి ఉంటె ఇంకా బావుండేది. 


చివరిగా : ఒరిజినల్ తో కంపేర్ చేసే అవకాశం ఇవ్వని ఈ వకీల్ సాబ్ (టైటిల్ వలన) , చాలా గొప్పోడు, అందరి కోసం అన్ని వదులుకున్నాడు, తన కోసం అని కాకుండా మన అందరి కోసం పోరాడుతున్నాడు, పేదలకు ఇల్లు ఇప్పించాడు, బూటకపు ఎన్కౌంటర్ ని నిరూపించాడు, యురేనియం తవ్వకాలు ఆపించాడు, ప్రాణాంతకమైన కెమికల్స్ ఫ్యాక్టరీ మూయించాడు,  సింగరేణి కార్మికులకు అండగా నిలబడ్డాడు, ముగ్గురు అమ్మాయిలను కేసు నుంచి కాపాడి న్యాయం అందించాడు, జనగణమున  కలగలిసిన జనం మనిషి రా, మన తరపున నిలబడగల నైజం, ఆంధ్రా, సీడెడ్ మనిషి రా - సత్యమేవ జయతే. 


మనకేమో ఒకే ఒక్క కేసు చూపించారు, ఇంకో నాలుగైదు పార్ట్ లు అయినా తీసి అన్ని కేసు లు చూపించాలి అని నేను కేసు ఎద్దాం అనుకుంటున్నా.. 



  


3 comments:

Anonymous said...

Fans ni anti fans ni kuda satisfy cheyyatam lo neku nuvve saati Raju Bhaiyya. Kummesav po

kiran said...

as usual a very well written analysis hari garu

Anonymous said...

e roje cinema choodatam jarigindi meru cheppindi perfect guruji bang on

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views