డాకు మహారాజ్ - కథ - కథనం - విశ్లేషణ
బాలయ్య కెరీర్ లో అన్‌స్టాపబుల్ షో మొదలైన తర్వాత అయన ఇమేజ్ వేరు, అయన స్థాయి వేరు స్థానం వేరు అనే టైపు లో అయిపోయింది. ఫామిలీస్ నుంచి యూత్ వరకు అందరికి కనెక్ట్ అయిపోయారు. ఒకప్పుడు మీమ్ మెటీరియల్ అయిన కొన్ని సీన్స్ ఇప్పుడు అలాగే ఉన్నా కూడా ఇప్పుడు "జై బాలయ్య" నినాదం తో థియేటర్ లో మోత మోగిస్తున్నాయి. అఖండ నుంచి మొదలు పెట్టి వీర సింహ రెడ్డి మీదుగా భగవంత్ కేసరి వరకు కంటెంట్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్స్ గా పోస్టర్స్ కి ఎక్కాయి. బహుశా అయన వయసుకి సంబందించిన పాత్రలు - కథాంశాలు ఎంచుకోవటం కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ఒక్క సినిమా తప్ప తీసిన అన్ని సినిమాలు సమీక్షలతో సంబంధం లేకుండా లాభదాయకమైన వెంచర్‌గా తీసిపెట్టి మినిమం గ్యారంటీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బాబీ డైరెక్షన్ లో డాకు మహారాజ్ గా మన ముందుకి వచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో ఫ్యాన్ బాయ్ నాగ వంశీ ఉండగా ఇంకా మినిమం గ్యారంటీ ఏంటి మినిమం బ్లాక్ బస్టర్ గ్యారంటీ సినిమా ఆశించటం లో తప్పు లేదు. 2023 లో బాలయ్య సినిమా మీద వాల్తేర్ వీరయ్య తో సూపర్ హిట్ కొట్టిన బాబీ కి అంత కంటే పెద్ద హిట్ తీయాలి బాలయ్యతో అనే టాస్క్ ఇచ్చారు వంశీ. మరి అయన గత చిత్రాలతో పోలుస్తూ వాటికీ బిన్నం గా ఎం చెయ్యగలం అని ఆలోచించినప్పుడు, ఈ ఏజ్ కి తగ్గట్టు ఒక జైలర్, ఒక విక్రమ్ ఫార్మటు లో కొత్తగా ట్రై చేద్దాం అని అనిపించి ఈ కథని అల్లుకున్నారు. ట్రైలర్ లో ఈ ఛాయలు కనిపించినా, సాంగ్స్ లో పెద్దగా ఊపు లేకపోయినా, సెకండ్ ట్రైలర్ తో అంచనాలు క్రియేట్ చేయగలిగారు. అంతకు ముందు రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ దెబ్బకి ఈ సినిమా మినిమం ఉంటె చాలు రేంజ్ ఎక్కడికో వెళ్తుంది అనుకున్నారు, సినిమా కూడా మినిమం ఏ ఉంది, కానీ రేంజ్ అక్కడికి వెళ్ళలేదు. ఎందుకు - ఏమిటి - ఎలా అని కథ - కథనం లో విశ్లేషించుకుందాం.
బాలయ్య ఎం తీసినా ఆడేస్తున్నాయి కాబట్టి ఎలా తీసినా చెల్లిపోద్ది అనుకోవటం అమాయకత్వం. ఎంత టెంప్లేట్ బొమ్మ తీసుకుందాం అనుకున్నా లెక్కలు మిస్ అవ్వకూడదు, పవర్ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే సాంగ్స్, ఫైట్స్, కామెడీ, ఒక బీభత్సమైన గెట్ అప్, మాస్ మసాలా ఎలివేషన్ సీన్స్, ఒక ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఎమోషన్ మిస్ అవ్వకూడదు.
సినిమా చూసినా చూడకపోయినా ఈ ఆర్టికల్ చదవటం వలన మీ అనుభూతి అయితే దెబ్బ తినదు అనే అనుకుంటున్నా, అయినా సరే, సినిమా చూసిన తర్వాత చదవమని ప్రార్ధన. ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు.
కథ : సివిల్ ఇంజనీర్ సీతారాం చంబల్ లో ఒక ఊరిలో ఉన్న నీటి సమస్య గురుంచి తెలుసుకొని దానిని సాల్వ్ చేద్దాం అనుకునే ప్రాసెస్ లో అక్కడ ఉన్న అరాచక శక్తులు ఆ గ్రామా ప్రజల్ని పట్టి పీడిస్తున్న తీరుకి చలించి, ఎదురు తిరిగి, డాకు మహారాజ్ గా మారి వారి ఆటకట్టించటం తో పాటు ఆ ఊరి నీటి సమస్య ని తీరుస్తాడు. ఇది ఇలాగె చెప్తే మనం ఫస్ట్ సీన్ కే క్లైమాక్స్ చెప్పేస్తాం కాబట్టి ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో చెప్పుకుందాం అని డిసైడ్ అయినట్టు ఉన్నారు. మరి అలాంటప్పుడు కథని ఎక్కడ మొదలు పెట్టాలి? ఫైనల్ గా ఎక్కడ ముగిద్దాం అనుకుంటున్నామో ఆ సమస్య తో మొదలు పెట్టాలి. ఇక్కడ ఎం చేసారు?
మదనపల్లి లో ఒక టీ ఎస్టేట్ లో తాతయ్య దగ్గర పెరుగుతున్న ఒక చిన్నారి కి ప్రాణాపాయం ఏర్పడితే, మధ్య ప్రదేశ్ లో జైలు లో డాకు మహారాజ్ తప్పించుకొని వచ్చి ఆ ఇంట్లో డ్రైవర్ గా చేరి పాపని కాపాడుతూ ఉంటాడు. అసలు అతను ఎవరు? అతను డాకు గా మారటానికి కారణం ఏంటి? అతనికి పాపకి సంబంధం ఏంటి? పాప మీద దాడి చేస్తున్న బాబీ డియోల్ ఎవరు? ఫైనల్ గా పాపని ఎలా కాపాడెడు అనేది కథ గా చెప్పారు.
కథనం : మిడిల్ లో మిడిల్: డైరెక్ట్ గా పాప తో స్టార్ట్ చేస్తే హీరో ఎంట్రన్స్ కి కానీ, ఎలివేషన్ కి కానీ చాలా టైం పట్టేస్తుంది కాబట్టి ముందు హీరో ఎలివేషన్ ఏసేసుకుందాం మదనపల్లి అడవుల్లో - మంటల్లో - మాన్షన్ హౌస్ బాటిల్ తో - జై బాలయ్య.
ఒక పాప వాళ్ళ టీ ఎస్టేట్ లో లీజ్ కి తీసుకున్న వాళ్ళు అక్రమాలు చెయ్యటం చూస్తుంది. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. లోకల్ MLA అండ్ తమ్ముడు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అందరు వద్దు అని వారిస్తున్నా వినకుండా ఆ ఇంటి పెద్ద MLA తమ్ముడి మీద కేసు పెడతాడు. ఎస్టేట్ సీజ్ చేస్తారు. MLA కి కోపం వచ్చి ఫ్యామిలీ మీద ఎటాక్ చేస్తాడు డ్రైవర్ ని చంపేస్తాడు. అప్పుడు ఆ ఫ్యామిలీ లో పని చేస్తున్న పనోడు ఫోన్ దగ్గరకి వెళ్తాడు, ఆ ఫోన్ మధ్య ప్రదేశ్ లో రింగ్ అవుతుంది, కరెక్ట్ గా అదే టైం కి ఒక ఖైదీ ని పోలీస్ లు హై సెక్యూరిటీ మధ్యలో తీసుకెళ్తుంటే ఒక గుంపు వచ్చి తప్పించేస్తుంది. మరొక్క సారి మళ్ళీ బాలయ్య ఎంట్రన్స్ - జై బాలయ్య. గుంపు చేస్తున్న పోరాటం అన్యాయం మీదన అయితే పర్వాలేదు, డ్యూటీ చేస్తున్న పోలీస్ లు ఎం పాపం చేసారు? మనం లాజిక్ లు అడగటం ఇక్కడ నుంచి మానేద్దాం, అసలు ఎం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ఇంట్లో డ్రైవర్ గా బాలయ్య చేరతాడు. ఆ పాప ని చూస్తూ అయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి పాప అయన కూతురు ఏమో అని మనం అనుకోవటం మన తప్పు కాదు.
ఎన్కౌంటర్ స్పెషలిస్టు "మలయాళ నటుడు" చాకో కి డాకు ని పట్టుకొనే అసైన్మెంట్ వస్తుంది? ఎందుకు ? "విక్రమ్" లో అలాగే ఉంది మరి. ఎంక్వయిరీ ఎలా జరుగుతుంది ? విక్రమ్ లో ఉన్నట్టే జరుగుతుంది. డాకు కి ఒక సైన్యం ఉన్నట్టు తెలుస్తుంది, విక్రమ్ లో పోలీస్ లు ఇక్కడ బందిపోట్లు అంతే తేడా.
ఒక పక్క ఎంక్వయిరీ జరుగుతూ ఉంటుంది, కామెడీ పేరుతో నస పెట్టిన కూడా, ఇంకో పక్క పాప మీద అటాక్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడక్కడా ఫైట్స్ - డైలాగ్స్ - ఎలేవేషన్స్ తో కాలక్షేపం అయిపోతుంది - జై బాలయ్య. అప్పుడు మనకి ఒక భయంకరమైన నిజం తెలుసుతుంది. MLA కి పైన ఒక బాస్ ఉంటాడు కదా, వాడు ఫోన్ చేసి చెప్తాడు, ఆ టీ ఎస్టేట్ లో పండుతుంది కొకైన్ అని. ఇప్పటికి మనం అది బయట నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాం కానీ 1996 లోనే మన మదనపల్లి లోనే పండించేసారు. మెయిన్ విలన్ దగ్గరకి వెళ్లే ముందు సైడ్ విలన్ ని సైడ్ ఎసెయ్యాలి కాబట్టి ఒక ఫైట్ - చంపటం లో మాస్టర్స్ చేసిన డాకు - సింహం నక్కల మీదకి వస్తే వార్ అవ్వదు రా లఫుట్ అని MLA కి మాస్ వార్నింగ్ ఇస్తాడు. మెయిన్ విలన్ ని రమ్మంటాడు - జై బాలయ్య. వాడు రావటానికి ఎలాగూ టైం పడుతుంది కాబట్టి ఒక మాస్ సాంగ్ ఏసుకుంటాడు - జై బాలయ్య . ఇంతలో డాకు ని వెతుకుంటూ చాకో వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తు ఉంటాడు. మెయిన్ విలన్ తమ్ముడు వచ్చి పెద్దాయన ఫ్యామిలీ మీద ఎటాక్ - తోట లో చేతికొచ్చిన పంట ని ఫసక్ ఒకేసారి ప్లాన్ చేస్తాడు. ఇంట్లో ఎటాక్ జరిగినప్పుడు ఏజెంట్ టీనా - అదే మన పనోడు ఫైట్ మొదలు పెడతాడు, మొత్తం డాకు సైన్యం అంతా కాపాడటానికి వస్తారు డాకు కూడా నూడుల్స్ ఫైట్ చేసేసి - జై బాలయ్య - తోటలోకి వచ్చేస్తాడు. ఇక్కడ మనం సినిమా స్టార్టింగ్ లో చూసిన హీరో ఎంట్రన్స్ - జై బాలయ్య. మెయిన్ విలన్ ఇంట్రడక్షన్ వాల్తేర్ వీరయ్య ఇంటర్వెల్ ఎపిసోడ్ టైపు లో ఒక భారీ ఇంటర్వెల్ ఫైట్.
ఫస్ట్ హాఫ్ వరకు ఇది బ్లాక్ బస్టర్ కంటెంటే, ఒక ఫక్తు కమర్షియల్ సినిమాకి కలవాల్సిన అన్ని దినుసులు సమకూరిన వంటకమే. పాటలు, ఫైట్ లు, ఎలివేషన్ లు, బీభత్సమైన ఇంటర్వెల్, ఇంకా రెవీల్ అవ్వని ఫ్లాష్ బ్యాక్ అందులో అలరించే గెట్ అప్, ఫాన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులకి కూడా విందు బోజనమే.
సెకండ్ హాఫ్: ఫ్లాష్ బ్యాక్ : ప్రారంభం : నీటి కోసం జరిగిన ఒక యుద్ధం కథ. నేటి కోసం అలమటించే కొన్ని వందల గ్రామాలూ ఉన్న చంబల్ లో, ఠాకూర్ ఫ్యామిలీ అరాచకాలు చేస్తూ ఉంటారు. జనాల్ని పీడించుకొని, వాళ్ళతో చాకిరీ చేయించుకొని, మార్బల్ మైనింగ్ మాఫియా చేస్తూ ఉంటారు. ఇందులో కొత్త ఏమైనా ఉందా అంటే అది మార్బల్. ఆ ఊరివాళ్ళు అందరు సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఇంజనీర్ సీతారాం గారి సహాయం కోరతారు. IES లో చీఫ్ ఇంజనీర్ అంటే మినిమం 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్సపీరియన్సు ఉండాలి ఆ లెక్కన 50 ఇయర్స్ లేత బాలయ్య పరిచయం అవుతాడు.
మిడిల్ : విత్ ఫ్యామిలీ వాళ్ళ ఊరు వెళ్తాడు. సెంట్రల్ వాటర్ కమిషన్ లో ఉండే Designs and Research (D&R) Wing, River Management (RM) Wing and Water Planning and Projects (WP&P) Wing అన్ని తానై ఒక డిజైన్ వేసి పెడతాడు. కలెక్టర్ తో డిస్కస్ చేస్తాడు ప్రాజెక్ట్ ప్రపోసల్ పెడతాడు. అక్కడ జరుగుతున్నా ఇల్లీగల్ మైనింగ్ ని ఆపమని కోరతాడు. ఠాకూర్ తో మీటింగ్ - ట్విస్ట్. ఆ కలెక్టర్ ఠాకూర్ భార్య. రాయలసీమ మాలూం తెరేకో అని వార్నింగ్ ఇస్తాడు - జై బాలయ్య. మినిస్టర్ ని కలుస్తాడు - పని అవ్వదు. విషయం తెలుసుకున్న ఠాకూర్ అర్ద రాత్రి ఊరిని తగలెట్టేస్తాడు. స్క్రీన్ మీద ఇంత జరుగుతున్నా మనకి ఏమి అనిపించక పోవటానికి కారణం ఆ సమస్య హీరో ది కాదు, ఒక ఊరిది. అది తన సొంత ఊరు కూడా కాదు, దేశం లో ఉన్న ఎన్నో అలాంటి ఊర్ల బాధ్యత కూడా తనకి ఉంది. అన్ని పనులు మానుకొని ఫ్యామిలీ లో అక్కడ ఉంటూ అతను చేసే పోరాటం మనకి ఎప్పుడెప్పుడు అతను మారతాడా అనే ఆరాటం తప్ప ఇంకా దేనికి పనికి రాదు.
ఒకవేళ బాలయ్య ఆ ఊరు రాక పోయినా వాళ్ళ పరిస్థితిలో మార్పు ఉండదు, వచ్చిన తర్వాత కూడా చావులు తప్పలేదు, లక్షల ఎకరాలకు నీళ్లు తెప్పిస్తాను అంటాడు కానీ ఎత్తి కొడితే ఒక గ్రామం తప్ప ఏమి కనపడదు. సైన్యం అనే అంత పెద్ద మాటలే కానీ పట్టు మని పది మంది ఉండరు. ఇది ఎంత గొప్ప ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది అని ఎలా అనుకున్నారో వాళ్ళకే అర్ధం అవ్వాలి. ఆవేశం కట్టలు తెంచుకున్న సీతారాం ఆ రాత్రి ఉగ్ర రూపం దాల్చి రాక్షస వధ చేస్తాడు - జై బాలయ్య. అతని కోసం రాయలసీమ నుంచి బాంబు లు కూడా వెళ్తాయి. అసలు ఇంజనీర్ గారు చంబల్ లో ఎక్కడో ఉన్న నీటి సమస్య గురుంచి ఇంత చేస్తున్నారు ఆ రోజుల్లో రాయలసీమ లో ఉన్న నీటి సమస్య పరిస్థితి ఏంటి? సొంత ప్లేస్ లో సమస్య ని చూపించినా బావుండేది కదా, అసలు ఆ తర్వాత ఎప్పుడో ఇంద్ర సేనా రెడ్డి యాగం చేసి డాన్స్ చేసి వర్షం రప్పించి, పొలం దానం చేసి డాం కట్టించిన తర్వాత కాదా రాయలసీమ లో నీటి ప్రాబ్లెమ్ తీరింది. సీతారాం గారు ఎం చేసారు అసలు మన ప్రాంతానికి. కర్ణాటక నుంచి కత్తులు వెళ్తాయి, అసలు 70 వ దశకం లో కావేరి నది ని డైవర్ట్ చేసేసుకొని తమిళనాడు మీద గొడవ పడి ఇప్పటికి కొట్టుకునేలా చేసిన ఆ ప్రాబ్లెమ్ గురుంచి చీఫ్ ఇంజనీర్ గారు ఏమైనా అలోచించి ఉంటారా?
డాకు అవతారం ఎత్తి ఠాకూర్ బ్రదర్ ని ట్రాప్ చేసి మట్టుబెడతాడు - జై బాలయ్య. డాకు వైఫ్ ని వెతికి పట్టుకొని చంపాలని తిరుగుతూ ఉంటారు మిగిలిన ఠాకూర్ బ్రదర్స్. దొరికిపోయింది అనుకునే టైం కి కలెక్టర్ కాపాడుతుంది. అప్పుడొక ట్విస్ట్. కలెక్టర్ మంచి ఆవిడే మరియు ఆవిడా ప్రయత్నం వలెనే ఇంజనీర్ గారు ఈ ఊరు వచ్చారు కూడా. విషయం తెలుసుకున్న ఠాకూర్ సొంత భార్య ని కూడా చంపటానికి వెనుకాడడు. ఒక పెద్ద ఫైట్ - జై బాలయ్య, కలెక్టర్ ని కాపాడలేక పోయిన, ఆవిడ కూతురు బాధ్యత తీసుకుంటాడు డాకు. అప్పటి వరకు కూర్చున్న ప్రేక్షలులకు కూడా మబ్బులు విడిపోయిన ట్విస్ట్ ఆ పాప బాలయ్య పాప కాదు, కలెక్టర్ గారి పాప. మనం ఇప్పటి వరకు చూసిన నీటి యుద్ధం ఊరుకోసం అయితే బ్లాక్ బస్టర్ అనుకోని చూసిన ఫస్ట్ హాఫ్ యుద్ధం ఇక ముందు చూడబోయే క్లైమాక్స్ యుద్ధం కూడా కలెక్టర్ పాప కోసం.
ఆ ఠాకూర్ పాపని ఎక్కడ చంపేస్తాడో అని తన వెంట ఉండి కాపాడటం మానేసి పనోడికి అప్పచెప్పి తాతగారి ఇంటికి పంపిస్తాడు. అన్ని కేసులు తన మీద వేసుకొని జైలు కి వెళ్తాడు - జై బాబీ. ఒక పక్క ప్రాణహాని ఉన్న పాప, ఇంకో పక్క కడుపుతో ఉన్న భార్య, వేరొక సైడ్ వాటర్ ప్రాజెక్ట్ ఇన్ని పెట్టుకొని ఈయన జైలు కి వెళ్లాడా ? పోనీ అప్పటికే ఠాకూర్ ని చంపేశాడా ? చట్టం మీద ఉన్న గౌరవం ? మరి అలాంటోడు బెయిల్ పెట్టుకొని రావాలి కానీ తప్పించుకోటం ఎందుకు? ఫ్లాష్ బ్యాక్ కూడా రొటీన్ గా ఉండేసరికి ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ ఫీలింగ్ నుంచి సూపర్ హిట్ వరకు వచ్చేసే టైం కి ఈ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ తో ఎండ్ ఐన ఫ్లాష్ బ్యాక్ కి సరేలే మినిమం యావరేజ్ ఉంటుంది అని అనుకుంటాం. - జై బాబీ. జైలు కి వెళ్తే జైల్లోనే చంపెయ్యాలి అని ఠాకూర్ చూడడు. పాప ఏమైపోయింది అని వెతకడు, డాకు ఎలాగూ లేదు కనీసం వాడి సైన్యం ని అయినా లేపేద్దాం అని చూడడు. ఎదో వేటాడుకుంటూ - కొకైన్ పండించుకుంటూ శేష జీవితం గడిపేస్తూ ఉంటాడు - జై బాబీ
ఆ ఊరికోసం జీవితం ని త్యాగం చేసిన సీతారాం, ప్రాణం త్యాగం చేసిన కలెక్టర్, ఆ కలెక్టర్ కూతురు కోసం ప్రాణాలకు సైతం తెగించి ఫైర్ ఫైట్ చేసిన నానాజీ, ఇంత జరుగుతున్నా డిప్యూటీ ఇంజనీర్ గారు ఏమయ్యారు? కొడుకో కూతురో పుట్టి ఉంటె వాళ్ళ సంరక్షణ ఎవరు చూసుకుంటున్నారు? ఆ ఇంట్లో ఏజెంట్ TINA ఎవరు? అసలు ఈ మొత్తం స్టోరీ లో చాకో కనుక్కున్నది / కనిపెట్టింది ఏంటి? కనీసం ఆ ఫైట్ లో హీరోయిన్ పోయి ఈ పాప బాలయ్య పాప అయినా కూడా ఎంతో కొంత సర్ది చెప్పుకోవచ్చు కానీ ఇంకో 10 ఇయర్స్ లో రిటైర్మెంట్ పెట్టుకొని గవర్మెంట్ జాబ్ వదిలేసుకొని సీతారాం గారు ఎందుకు అండి ఈ రచ్చ మీకు ? అన్ని ప్రశ్నలకి ఒకటే ఆన్సర్ - జై బాబీ
ముగింపు: ఇంటర్వెల్ దగ్గర పదహారు కత్తి పోట్లు పడి, ఇంకా ఎక్కువ అనస్థీషియా మోతాదు లో పడి, ఒక గంట ఫ్లాష్ బ్యాక్ అయ్యాక హాస్పిటల్ లో పడి ఉన్న బాలయ్య మీద ఠాకూర్ దాడి. మంచి ఎలివేషన్ లీడ్ తో ఫైట్ - జై బాలయ్య. అప్పుడే తగిలిన దెబ్బ మీద సుత్తి తో కొడుతున్నట్టు సాగుతుంది ఈ క్లైమాక్స్ ఫైట్ మొత్తం. తర్వాత ఏమైంది ? పాత కేసులతో పాటు, జైలు నుంచి తప్పించుకోవటం అండ్ ఇప్పుడు చేసిన మర్డర్ కి కూడా శిక్ష ఏమైనా పడిందా? అని మనం ఒకటే టెన్షన్ టెన్షన్ పడిపోతుంటే, కొన్ని సంవత్సరాల తర్వాత కార్ లో నుంచి (ఎక్కడ నుంచి వచ్చాడు అని అడగకండి) దిగిన బాలయ్య నందిని డాం ( ప్రభుత్వ డాం నా లేక ప్రైవేట్ డాం అనుకోవాలా? ) ఓపెన్ చేస్తాడు. అప్పుడు తెలుస్తుంది వైఫ్ ఇంకా బ్రతికే ఉంది అని, కొడుకు ఉన్నాడని, వాడు పాప కంటే పెద్దోడిలా ఎదిగిపోయాడు అని కానీ డాం శిలాఫలకం లో ఇయర్ 199? - జై బాబీ
చివరిగా : జై బాలయ్య తో మొదలైన ఉత్సాహం - జై బాబీ తో నీరసించి పోయింది.
జై బాలయ్య అనే అభిమానులకి "మహారాజ్"
మాస్ అండ్ యాక్షన్ సినిమా ప్రేమికులకు "జస్ట్ ఓకే రాజ్"
సగటు ప్రేక్షకులకు "యమధర్మ రాజ్, బాకు, మేకు"
కొన్ని ఎలేవేషన్లు కానీ డైలాగ్స్ కానీ బాలయ్య కోసమే పుట్టాయా అన్నట్టు ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి అవి కూడా మన సహనానికి పరీక్ష పెడతాయి. ఏ మాస్ సినిమాకి అయినా రేంజ్ డిసైడ్ చేసేది లాస్ట్ అరగంట, అప్పటి వరకు మనం చూసిన సినిమా మీద ఉన్న అభిప్రాయాన్ని డిసైడ్ చేసేది కూడా అదే, సరిగ్గా అక్కడికి వచ్చే సరికి - జై బాబీ. పండగ సీజన్లో లో వచ్చి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ దగ్గర ఆగిపోవటానికి ఇదొక కారణం అనుకోవటానికి లేదు, అసలు ఈ మాత్రం కలెక్షన్స్ అయినా వచ్చాయి అంటే పండగ సీజన్లో రావటమే కారణం అని కూడా గుర్తించాలి.
బాలయ్య బాబు మాడ్యులేషన్ లో చదువుకోండి
"నీటి సమస్య గురుంచి కథ అయినప్పుడు దాని గురుంచి చెప్పు
పాప సమస్య కథ అయితే దాని గురుంచి చెప్పు
అంతే కానీ నీటి సమస్య ఫ్లాష్ బ్యాక్ లో పెట్టి చంబల్ లో ఠాకూర్, మదనపల్లి లో మనవరాలు, టీ ఎస్టేట్ లో కొకైన్ అంటావేంట్రా లఫుట్ " అని ఒక్క మాట ముందుగానే అడిగి ఉంటే బావుండేది, కథ కి కథనం కి ఒక షేప్ వచ్చి ఉండేది.
1 comments:
superb article sir kani meru ranu ranu baga late chesthunnaru, okkosari writing or not kuda teliyatam ledhu. please konchem regular ga rasthu undandi
Post a Comment