అజ్ఞాతవాసి సినిమా - పోస్ట్ మార్టం


అజ్ఞాతవాసి సినిమా - పోస్ట్ మార్టం


పవన్ కళ్యాణ్ వరస పెట్టి  డిజాస్టర్స్ ఇచ్చినా కూడా ఈ సినిమా పై ఇంత ఖర్చు పెట్టటానికి, అంతేసి పెట్టి కొనటానికి ఎవ్వరు భయపడలేదు అంటే కారణం, బహుశా, పరిచయాలు అక్కరలేని కాంబినేషన్, సెంటిమెంట్స్ అవసరం లేని అంచనాలు, అసలు గురి తప్పని గురూజీ అనే ఒక మొండి నమ్మకం అయి ఉండొచ్చు. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు అయ్యాక ఇది "లార్గో వించ్" నుంచి లేపేశారు అని కొందరు, అత్తారింటికి దారేది పార్ట్ 2 అని ఇంకొందరు అనుకున్నారు, అనుకున్నట్టు గానే ఎలాగూ పండగ సీసన్ కదా అని రెండు కలిపి "పులిహోర" కలిపేశారు గురూజీ. జనరల్ గా పండగ సీసన్ కి పులిహోర సేల్ అయిపోయే ఐటెమ్, కానీ ఈ సినిమా విషయానికి వచ్చే సరికి ఊహకి అందని విధం గా రిజెక్ట్ చేసారు ప్రేక్షకులు. ఈ మధ్య కాలం లో సినిమా టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ పరంగా నెట్టుకొచ్చేసినా పవర్ స్టార్ కి  ఈ సినిమా వరకు సీసన్ అడ్వాంటేజ్ ఉండి కూడా ఆ పప్పులు ఉడకలేదు, ఇదేదో కొంచెం ఆలోచించాల్సిన విషయమే అయినా అది మనకి సంబంధం లేని సబ్జెక్టు కాబట్టి మన వరకు మనం తోచిన ఎనాలిసిస్ చేసుకోటానికి ట్రై చేద్దాం అనే ప్రయత్నమే ఈ ఆర్టికల్. 

"సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం. ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు. 

కథ : ఒక లైన్ లో , తన తండ్రి చావుకు కారణమైన వాళ్ళని పట్టుకొని శిక్షించి, తన తండ్రి ఆస్తిని చెడ్డ వ్యక్తుల చేతులో పడకుండా కాపాడటం కోసం అజ్ఞాతం వీడి వచ్చిన కొడుకు కథ. ఇదే మూల కథ గా లార్గో వించ్ లో కూడా అని చెప్పుకోవచ్చు. అక్కడ దత్త పుత్రుడు ఇక్కడ సొంత కొడుకు. అక్కడ తనపై జరిగే అటాక్స్ ని ఎదుర్కొంటు తన తండ్రి చావుకి కారణం కనుక్కుంటాడు. తెలుగీకరించే ప్రాసెస్ లో ఈ ఇంపార్టెన్స్ ని మిస్ చేసి కామెడీ ?  కి పెద్ద పీట వేశారు అనుకోండి అది వేరే విషయం 

ఇంకొంచెం డిటైల్డ్ గా చెప్పుకుంటే, AB గ్రూప్ అధినేత విందా తన మొదటి భార్య కొడుకు ని సీక్రెట్ గా అస్సాం లో పెంచుతాడు (అస్సాం లోనే ఎందుకు అంటే సిక్స్త్ సెన్స్ అనుకోవాలి ఏమో). విందా ని తన కొడుకు ని చంపేసి ఆ సంస్థ ని హస్తగతం చేసుకోవాలి అని ప్లాన్ వేసేది ఎవరు అని తెలుసుకోవటానికి కాపాడుకోడానికి అజ్ఞాతం లో ఉన్నా తన కొడుకుని తీసుకొస్తుంది ఇంద్రాణి. డైరెక్ట్ గా వారసుడి గా కాకుండా, ఒక వర్కర్ గా వచ్చి అన్ని తెలుసుకోమన్న తల్లి కోరిక మేరకు మన వారసుడు ఎం చేసాడు ఎలా చేసాడు అనేది మిగతా కథ. 

మాములుగా అయితే ఫక్తు కమర్షియల్ హంగులు ఉన్న కథ, ఏ మాత్రం కమర్షియల్ ఫార్మటు లో వేసుకున్నా చెల్లిపోయే కథ, కామెడీ పేరుతో దారి తప్పించి ఉండక పోతే అన్ని కరెక్ట్ గా కుదిరిన పులిహోర అవ్వాల్సిన కథ ని కథనం లో ఎం చేసారు ఎలా చేసారు అనేది చెప్పుకుందాం. అది చెప్పుకునే ముందు మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటూ అంతర్లీనం గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. 

పాత్రల చిత్రణ

వారసుడు : తండ్రి కోరిక మేరకు అజ్ఞాతం లో ఉండిపోయిన కొడుకు, తండ్రి చనిపోయాక తల్లి ఆదేశం మేరకు అజ్ఞాతం నుంచి ఒక ఆశయం తో వచ్చిన కొడుకు, ప్రతి కష్టం వెనుక ఒక మినీ యుద్ధం దాగి ఉంటుంది అని సందేశం ఇచ్చే కొడుకు, ఈ పాత్ర నుంచి ఎంతో ఎక్ష్పెక్త్ చేస్తాం , పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గ హీరోయిజం ఆశిస్తాం, అంతలోనే, తేరుకొనే లోపే, పాత్ర కామెడీ చెయ్యటం మొదలు పెడుతుంది. కథానాయకుడి ఆశయం ఏంటి అంటే, తన తండ్రిని చంపేశారు అని అనుమానం ఉన్నా ఇద్దర్ని చంపాలి, మనం ఆనందం గా ఉండాలి. చంపేసిన తర్వాత ఆనందం గా ఉండటం వేరు, ఆనందం గా ఉంటూ చంపటం వేరు.  ఆ కామెడీ వర్కౌట్ అయ్యే వరకు ఎవరు పట్టించుకోరు కానీ చిరాకు పెట్టినప్పుడు, మాటల మాంత్రికుడి కలం మూగబోయినప్పుడు, విరక్తి అనే పదం కి దగ్గరగా ఫీలింగ్స్ ఉంటాయి. అక్కడ అత్తని తీసుకొచ్చే ప్రాసెస్ లో సముద్రం వరకు వెళ్లే రాముడు కి బ్రిడ్జి కట్టే ప్లాన్ లేక పోయినా పర్వాలేదు కానీ, ఇక్కడ కొడుక్కి అదే లాజిక్ వర్కౌట్ అవ్వదుగా. ఇక్కడ పెయిన్ వేరు. అక్కడ డ్రైవర్ ని మార్చేసి అయన స్టేజి లో వెళ్ళిపోవటం వేరు, ఇక్కడ కంపెనీ లో జాయిన్ అయ్యే ప్రాసెస్ వేరు. అది సిల్లీ అయినా కూడా అక్కడ రావు రమేష్ రూపం లో ఇచ్చిన జస్టిఫికేషన్ వేరు ఇక్కడ ప్రేక్షకులని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఫీలింగ్ వేరు. అక్కడ నుంచి లవ్ సీన్స్ అంటూ చేసే నటన కానీ, అతి కానీ, వర్ణనాతీతం అందం అంటే ఆ పదం సెకండ్ హాఫ్ లో బెల్ట్ ఎపిసోడ్ కోసం రిజర్వు చేసి పెట్టుకోవాల్సి వస్తుంది అనే భయం. ఇంట్రడక్షన్ సీన్ లో ప్రేక్షకులని అలరించిన ఈ పాత్ర ఇలా బిహేవ్ చేస్తుంటే చూస్తూ ఉండి పోవటం తప్ప ఏమి చెయ్యలేని పరిస్థితి. అక్కడక్కడా కొంచెం సీరియస్ ఎపిసోడ్స్ ఉన్న కూడా వాటిని ఎంజాయ్ చేసే సమయం ఇవ్వకుండా వింత ప్రవర్తన తో అదుపు తప్పించారు. సెకండ్ హాఫ్ లో గాడిన పడాల్సిన ఈ పాత్ర, ఫ్లాష్ బ్యాక్ అయినా రెండు నిమిషాలలో ఊపు తెప్పించిన ఈ పాత్ర "రౌడీ అల్లుడు" రూపు దిద్దుకోటానికి ఎంతో సమయం తీసుకోదు. ఏమైనా అంటే అన్నాం అంటారు కానీ అదే రౌడీ అల్లుడు లో ఆటో జానీ ఆఫీస్ లో కామెడీ చేసే సీన్స్ లో కళ్యాణ్ క్యారెక్టర్ కామెడీ చేసి ఉంటె ఎలా ఉండేది అని ఆలోచించుకొని ఉంటె బెల్ట్ ఎపిసోడ్ సైకిల్ ఎపిసోడ్ మనకి తప్పి ఉండేవి. రెండు క్యారెక్టర్ లు వైవిధ్యం గా చెయ్యటం వేరు, ఒకే క్యారెక్టర్ రక రకాలుగా చెయ్యటం వేరు. అది కూడా గుండె లోపల అంత బాధ ఉంచుకొని ? ఉంచుకొని అని మనం అనుకుందాం లేక పోతే మన ఇగో హర్ట్ అవుతుంది. అక్కడ ఆ సినిమా లో కూడా కామెడీ పేరుతో ఏవేవో చేసినా కరెక్ట్ టైం లో ఎమోషన్స్ ని వర్క్ అవుట్ చేయగలిగారు, కానీ ఇక్కడ ఒక పక్క పగ, తల్లి ప్రేమ, తండ్రి పోయిన బాధ, ప్రేమలు, ఎన్ని ఉన్న కూడా ఏ ఎమోషన్ ని టచ్ చెయ్యలేని విధం గా పాత్ర ని తీర్చి దిద్దారు. క్లైమాక్స్ లో డైలాగ్స్ లేనట్టు తల్లి ని పట్టుకొని ఏడుస్తూ ఉంటె అసలు ఎదో ఒకటి మాట్లాడుకోండి అనుకోవటం తప్ప ఏమి చెయ్యలేని పరిస్థితి లో మనం ఉంటాం. అప్పట్లో గురూజీ వ్రాసిన సత్యనారాయణ మూర్తి పాత్ర అదే అండి జై చిరంజీవ లో కూడా ఇదే తప్పిదం జరిగింది. ఫ్లాష్ బ్యాక్ లో ఆ ఎపిసోడ్ ఉంచుకొని ఇక్కడ బయట కామెడీ చేస్తూ ఉంటాడు, అప్పుడు చూసేసారు లే ఇప్పుడు చూడరు ఏమో అనుకోని ఉంటారు. 

సవతి తల్లి : అక్కడ ఎదో ఉంటుంది అని మనం అనుకోవటం, హీరో గురుంచి బిల్డ్ అప్ ఇచ్చి మాట్లాడటం తప్ప ఈ పాత్ర మనలాగే ప్రేక్షక పాత్ర. ఒకవేళ అజ్ఞాతం లో ఉన్న కొడుకు వెనక ఉండగా తాను ముందు నడిచే అంత పవర్ఫుల్ పాత్ర అయినా ఆకట్టుకునేది ఏమో. సినిమా మొత్తం ఈవిడ చుట్టూనే తిరుగురుగుతుంది అంటే, పూర్తిగా పాత్ర ఏంటో అని కూడా అడగకుండా ఒప్పేసుకొని ఉంటారు. 

హీరోయిన్స్ : పెద్దగా ఎక్ష్పెక్త్ చెయ్యక పోయినా ఎంతో కొంత ఎక్ష్పెక్త్ చెయ్యటం ఈ మధ్య గురూజీ తీసిన అ ఆ వలన అయ్యి ఉండొచ్చు కానీ, మరీ ఇంత దారుణం గా డిజైన్ చేస్తారు అని ఊహించి ఉండరు. ఆ లవ్ ట్రాక్ తో మొదలు అయ్యి, ఫారిన్ లో చెంపలు వాయించుకునే వరకు అసలు వ్రాసింది గురూజీ యేన అని అనుమానం కలిగేలా చేసారు. 


శర్మ - వర్మ : కామెడీ కోసం అని సృష్టించిన పాత్రలు అయితే సీరియస్ నెస్ అనవసరం. పాత్రల పరిచయం వేరు, కంపెనీ లో వాళ్ళ పోసిషన్ వేరు, ఫ్లాష్ బ్యాక్ వేరు, వారు ప్రవర్తించే తీరు వేరు. త్రివిక్రమ్ సినిమా లో ఛాన్స్ అంటే విమానం లో ఎగరటం అనుకున్నారు ఏమో, హీరో సెంట్రిక్ గా చేసిన అతి కి వీళ్ళు బలి అయ్యారు. 


మిగతా పాత్రలు:  ముఖ్యం గా విలన్ పాత్ర లో ఆది కి నిడివి తక్కువ అయినా ఉన్నంతలో తాను ఉన్నాను అని చెప్పుకునేలా చేసాడు, కానీ ఆ పాత్రని అమాంతం లేపాల్సింది పోయి, ఎదో ఉన్నాడు అన్నట్టు చేసారు. పవర్ స్టార్ లాంటి క్యారెక్టర్ ఏ కామెడీ చేస్తున్నప్పుడు అంత స్ట్రాంగ్ విలన్ అవసరం ఏముంది అనుకున్నారు ఏమో కానీ, స్ట్రెంగ్త్ లేని విలన్ ముందు పండే హీరోయిజం ఉండదు అని మర్చినట్టు ఉన్నారు. ప్రత్యేకం గా విలన్ లేని ఆ సినిమా లోనే సిట్యుయేషన్స్ రూపం తో ఆడుకున్న గురూజీ కి, విలన్ కి స్కోప్ ఉన్న ఈ సినిమా లో ఎందుకు ఇలా తేల్చేసారు అనేది సమాధానం లేని ప్రశ్న. భరణి గారు వేస్ట్ అవ్వగా, మిగతా బ్యాచ్ చారు లో కరివేపాకు లా పనికొచ్చారు.

సంగీతం : ఇంతకు ముందు వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది లాంటి ఆల్బమ్స్ తో పోలిస్తే ఈ ఆల్బం తేలిపోయింది. కొడకా కోటేశ్వరరావు అని కొంచెం ఊపు తెప్పించిన మాట వాస్తవమే అయినా సినిమా చూస్తున్నప్పుడు ఆన్ స్క్రీన్ కూడా సాంగ్స్ ఎలివేట్ అవ్వక పోవటం శోచనీయం. అనిరుద్ తమిళ్ సినిమాలలో పెద్ద హీరోస్ కి కూడా (కత్తి, వేదాళం) మంచి మ్యూజిక్ ఇచ్చాడు, ఇక్కడ తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టుకోలేక పోయాడు అనే కంటే కుర్రోడి దగ్గర నుంచి సరైన పాటలు రాబట్టుకోలేక పోయారు అనటం సమంజసం ఏమో 

పెట్టుబడి / బిజినెస్ : ముప్పావలా ని రూపాయి చేసే గురూజీ అయితే రూపాయి పావలా పెట్టె ప్రొడ్యూసర్ దొరకటం అద్భుతం. ఇంత బిజినెస్ చేసే వీలు ఉంది అని అంత పెట్టుబడి అయితే పెట్టి ఉంటారు. పెట్టిన డబ్బులు ప్రతి ఫ్రేమ్ లో కనిపించినా, అంత పెట్టాల్సిన అవసరం కనిపించలేదు. ఉదాహరణ కి DNA టెస్ట్ తో పోయే దానికి టీం ని వేసుకొని బల్గెరియా వెళ్లే అంత అయితే అవసరం లేనే లేదు. కాంబినేషన్ ఉంది అని పెట్టేసారు, మార్కెట్ ఉంది అని అమ్మేసారు కానీ కొన్న వాళ్ళకి ఎం సమాధానం చెప్తారో చూడాలి.

రచన - దర్శకత్వం : "కొత్త ఐడియా రానప్పుడు మనం పాత ఐడియా నే రిపీట్ చెయ్యటం బెటర్" ఈ డైలాగ్ ని ఏ ఉద్దేశం తో వ్రాసుకున్నారో కానీ, విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది అనే డైలాగ్ కి మించిన సెల్ఫ్ సెటైర్ ఇది. గురూజీ సినిమాలో ఫస్ట్ ఇరవై నిముషాలు, లాస్ట్ పది నిముషాలు మాత్రం కథ కి కేటాయించి, మధ్య మధ్య లో దానిని టచ్ చేస్తూ మిగతా సమయం కామెడీ తో అలరించటం అయన పద్ధతి. ఇక్కడ కూడా మొదలు అయిన తర్వాత హీరో ఆశయం తెలిసే వరకు ఒక లా ఉన్నా సినిమా, ఇంటర్వ్యూ ప్రాసెస్ మొదలు అయ్యాక అనే కంటే కార్పొరేట్ ఆఫీస్ లో కామన్ బాత్రూం అనే దగ్గర గాడి తప్పటం మొదలు అవుతుంది. జనరల్ బాడీ మీటింగ్ అనే కాన్సెప్ట్ ని ఒరిజినల్ నుంచి అలాగే తీసుకున్నా కూడా, సినిమా మొత్తం కుష్బూ గారి చుట్టూ తిరిగిందో లేదో కానీ ఈ మీటింగ్ చుట్టూ అయితే మాత్రం తిరిగింది. హీరో కి ఉన్నా టైం ఒక నెల. ఆ నెలలో ఎం జరిగింది అనేది మిగతా సినిమా. లవ్ స్టోరీ ఏ చిరాకు అనుకుంటే రెండో హీరోయిన్ తో దానిని రిపీట్ చెయ్యాలి అనే ఐడియా ని ఏమనాలో ఆయనకే వదిలెయ్యాలి. ఒరిజినల్ లో హీరో మీద అటాక్స్ జరుగుతూ ఉంటాయి, ఆసక్తి కలిగిస్తూ కథనం ముందుకు పోతుంది. ఒక సీరియస్నెస్ ఉంటుంది. ఎందుకంటే తాను అప్పటికే అజ్ఞాతం నుంచి బయటికి వచ్చేస్తాడు కాబట్టి, కానీ ఇక్కడ ఇంకా అజ్ఞాతం లో ఉండటం వలన ఆ థ్రిల్స్ మిస్ అయ్యాయి. ఆది ఎంట్రన్స్ తో కొంచెం కథనం లో ఊపు వస్తుంది, కానీ అప్పటికే సినిమా మొదలు అయ్యి గంట అయిపోతుంది.నకుల ధర్మం అని గురూజీ మెరుపులు మెరిపించినా, ఈ నకుల ధర్మం కోసమే హీరో ని ఇంకా అజ్ఞాతం లో ఉనచాల్సి వచ్చింది ఏమో అనిపిస్తుంది. ఫాలో అప్ సీన్ లో ఉండే ఎమోషన్ ఏ ప్రేక్షకులు కోరుకునేది అని అక్కడ నుంచి మొదలు అయ్యి ఇంటర్వెల్ వరకు పడే సన్నివేశాల ద్వారా పెరిగిన స్పీడ్ తెలుపుతుంది. ఒక యుద్ధం అంత విధ్వంసం, ఒక నడిచే మారణాయుధం అంటూ హీరో కి బిల్డ్ అప్ ఇస్తుంటే, కథ గాడిన పడిపోయినట్టే, ఇంక ఇప్పటి వరకు జరిగిన దానిని క్షమించేయ్యోచ్చు అనే భావన కలుగుతుంది. 

అదే ఊపులో మొదలు అయిన సెకండ్ హాఫ్ ఎప్పుడో మొదట్లో కనిపించిన వాడు అప్పటి వరకు కథలో లేని వాడు ఎవడో వచ్చి ఊహించి చెప్తే తెలిసే ఫ్లాష్ బ్యాక్ ద్వారా కథని రెవీల్ చెయ్యటం అంత మంచి ఐడియా అనిపించుకోదు. ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత అదే బిల్డ్ అప్? కొనసాగుతూ (రోడ్ మీద బైక్ ఎపిసోడ్ మాత్రం దారుణం) ఆఫీస్ లో ఓపెన్ అయిన కథనం చెయ్యి జారిపోవటానికి ఎంతో దూరం లేదు అనిపించేలా బెల్ట్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసారు. రావు రమేష్ అభినయం తో అలరించటం ఒకటే నిట్టూర్పు అవగా, సంబంధం లేని కామెడీ చేస్తున్న కథానాయకుడు నిస్సహాయత కి రచయితని తిట్టుకోలేక కళ్యాణ్ అభినయం ని ఎంజాయ్ చేసిన వాళ్ళు లక్కీ ఫెలోస్. దాదాపు ఇరవై నిమిషాల ఈ ఎపిసోడ్ తో ఇంక సినిమా పై ఆశలు వదులుకోవడం అనేది సాధారణం గా జరిగే విషయమే అనుకోవటం అతిశయోక్తి కాదు. అత్తారింటికి దారేది లో పండిన కామెడీ టైం లో ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేసుకొని ఉండొచ్చు. అక్కడ నుంచి జనరల్ బాడీ మీటింగ్ అంటూ మొదలై, వయా బల్గెరియా ఆఫీస్ బిల్డింగ్ టెర్రస్ పై ల్యాండ్ అవుతుంది. ఈ విల్లు ఎపిసోడ్ ఒరిజినల్ లో బాండ్స్ ఎపిసోడ్ గా బాగా తీశారు, ట్విస్ట్ లు ఇచ్చారు, అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు నిలబెట్టారు, ఇక్కడ మనం పెద్దగా మాట్లాడుకోటానికి ఎం లేకుండా చేసారు. 

జనరల్ గా వేరే సినిమాల నుంచి కథల నుంచి గురూజీ స్ఫూర్తి పొందటం కొత్త విషయం కాదు కానీ, వాటిని తన సినిమా గా మలచి తీర్చి దిద్ది అలరించారు ఇన్నాళ్లు, ఈ సినిమా వరకు, అసలు ఒరిజినల్ ని అలాగే తీసేసిన బావుణ్ణు అనే ఫీల్ మిగిల్చారు. అసలు రెండే నిముషాలు కథ ఫోన్ లో చెప్పి ఓకే చేయించారు అంటే ఆ ఫోన్ సంభాషణ ఏమై ఉంటుంది ? ఊహించుకుంటే 

గురూజీ : కళ్యాణ్ గారు లార్గో వించ్ అనే ఫ్రెంచ్ సినిమా చూసాను అండి, లింక్ పంపమంటారా?
 కళ్యాణ్ : అవన్నీ చూసే టైం ఏముంది కానీ, కథ ఏంటో క్లుప్తం గా చెప్పండి
గురూజీ: రాజ్యం మీద ఆశ లేని ఒక యువరాజు తన తండ్రి వలన అజ్ఞాతం లో బ్రతకాల్సి వస్తుంది. అతని తండ్రి చనిపోతే, ఆ రాజ్యం దుష్టుల పాలు కాకూడదు అని అజ్ఞాతం వీడి బయటికి వచ్చి తన రాజ్యం కోసం, తన ప్రజల కోసం పోరాడిన వీరుడి కథ. 
కళ్యాణ్ : బాగా సీరియస్ అయిపోతుంది ఏమో అండి 
గురూజీ : మన ముందు సినిమాలాగానే ఎంటర్టైన్మెంట్ ని ఫాలో అయిపోతూ, విలన్స్ విషయం లో నకుల ధర్మం పాటించే యువరాజు కథ 
కళ్యాణ్ : నకుల ధర్మం ఏంటండీ 
గురూజీ : మహా భారతం లో................ దానినే నకుల ధర్మం అంటారు 
కళ్యాణ్ : హింస ఎక్కువ అయిపోదు కదా, 
గురూజీ : విచ్చల విడిగా నరికేస్తే హింస కానీ విచక్షణ తో నరికితే అది ధర్మం కళ్యాణ్ గారు 
కళ్యాణ్ : మీతో ఎప్పుడు మాట్లాడినా ఎదో ఒక కొత్త విషయం తెలుసుకుంటాను, మనం ఈ సినిమా చేస్తున్నాం. మన జనరేషన్ కి ఈ విషయం చెప్తున్నాం 
గురూజీ : మనం సాధారణ మానుషాలమే అయినా మన ఆశయం సాయంకాలం నీడలా చాలా పెద్దది. ప్రొడ్యూసర్ చినబాబు గారిని లైన్ లో తీసుకుంటాను. 
కళ్యాణ్ : జై హింద్ 


కథలో మంచి కమర్షియల్ లైన్ ఉన్నప్పటికీ, మంచి ఏక్షన్ థ్రిల్లర్ ని కలగాపులగం చేసేసారు. అనవసరమైన కామెడీ కి ఇచ్చిన స్క్రీన్ టైం ని కీలకమైన ఇంటరెస్ట్ వున్న ఎపిసోడ్స్ గా మలిచే అవకాశం ఉంది కూడా జస్ట్ టచ్ చేసి వదిలేసారు, స్టార్ హీరో సినిమా కి ఈ మాత్రం సరిపోతుంది అని అనుకోని ఉంటారు, కానీ, "కొత్త ఐడియా లు రానప్పుడు వచ్చిన ఐడియా ని కొత్తగా ఎలా చెప్పాలా" అని ఆలోచిస్తే "సృజనాత్మకత" అవుతుంది కానీ, పాత ఐడియా ని రిపీట్ చేస్తే ఎలా అవుతుంది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు  ? గురూజీ 

కర్త కర్మ క్రియ - కెప్టెన్ అఫ్ ది షిప్ అయినట్టు, ఈ సినిమా వరకు వేరే ఎవర్ని వేలెత్తి చూపే అవకాశం కూడా గురూజీ ఇవ్వక పోవటం బాధ కరమైన విషయమే అయినప్పటికీ, ఫైనల్ గా ఒక డౌట్, గురూజీ ఎదో అత్తారింటికి దారేది లో లుంగీ స్టెప్స్ తో, అహల్య ఎపిసోడ్ లో కొరకడం తో ఇంప్రొవైజ్ చేసారు అని చెప్పి సినిమా మొత్తం అయన ఇంప్రవైజేషన్ కోసం వదిలెయ్యలేదు కదా? జస్ట్ పాజిటివ్ థింకింగ్ అంతే 





2 comments:

kiran said...

Raju garu you are back with a bang andi. last lo conversation aithe highlight. chala rojula tarvata me nunchi oka article.. tarachuga rasthu undandi sir

Anonymous said...

super fun

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views